దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ వివిధ పార్టీలు తమ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. ప్రతీ పార్టీ వీలైనన్ని ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అయితే దేశంలోని ఆ గ్రామంలో కొనసాగే రాజకీయాల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ప్రత్యేకత ఏమిటి?
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని జనం దశాబ్ధాల తరబడి బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారు. ఈ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి కాంగ్రెస్ లేదా ఇతర ఏ పార్టీ కూడా ప్రచారానికి రాదు. గ్రామంలో కొన్ని దశాబ్ధాలుగా ఇదే జరుగుతోంది. గ్రామంలోనివారంతా బీజేపీకి ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నారు.
చంద్రపూర్‌లోని బల్లార్‌పూర్ అసెంబ్లీ పరిధిలోకి వచ్చే ఉథల్‌పేత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఈ గ్రామంలో 653 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 96 శాతం ఓటింగ్ జరిగింది. ఈ ఓట్లన్నీ బీజేపీకే దక్కడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ గ్రామంలోని ఓటర్లంతా బీజేపీకే తమ ఓటు వేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ లీడ్‌లోకి రాగా, ఉథల్‌పేత్‌లోని ఓట్లన్నీ బీజేపీకే పడటం విశేషం.
ఈ గ్రామం ఆదర్శగ్రామంగానూ పేరొందింది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ తామంతా బీజేపీకే పట్టం కడతామని గ్రామస్తులు చెబుతున్నారు. బిల్లార్‌పూర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సుధీర్ మున్‌గాంటీవర్ తమ గ్రామాన్ని అభివృద్ధిపథాన నడిపించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని తెలిపారు. దీంతో గ్రామంలోని వారంతా స్వచ్ఛందంగా బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. గ్రామంలోని పంచాయితీ కూడా బీజేపీ పాలకవర్గం చేతిలోనే ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment