గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రావడం...అదే క్రమంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం...వ్యాపార అవకాశాలు విస్తృతంగా మారడంతో పల్లె జనం పట్టణాలకు చేరుతున్నారు. రెండు దశాబ్దాల్లో జిల్లాలోని పలు పట్టణాల్లో జనాభా పెరుగుదలే ఇందుకు నిదర్శనం.
కొందరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఉపాధి అవకాశాల కోసం సిటీ బాట పడుతున్నారు. దీంతో చిన్నచిన్న పట్టణాలు అనతి కాలంలోనే వేగంగా విస్తరిస్తున్నాయి.
కడప కార్పొరేషన్: పట్టణ జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది...పల్లెలు విడిచి జనం పట్టణాలకు వలస వస్తున్నారు. పిల్లల చదువుల కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సిటీబాట పడుతున్నారు. దీంతో గత 20 ఏళ్లలో పట్టణ జనాభా మూడింతలు పెరిగింది. ఇదే క్రమంలో పట్టణ సమీపాల్లో ఉన్న పల్లెలు పట్టణాల్లో విలీనమవుతున్నాయి. క్రమేణా పల్లె వాతావరణం మాయమై పట్టణీకరణ ఛాయలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం కడపతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది.
దాదాపు 22 ఏళ్లక్రితం ఈ పట్టణాల మొత్తం జనాభా 5,66,000 ఉండగా, 2011 సంవత్సరానికి 7,17,259కి చేరింది. 2021 సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ చేయాల్సి ఉండగా, కరోనా వల్ల సాధ్యం కాలేదు. అయితే 2001 జనాభాతో పోల్చితే 2021 సంవత్సరానికి దాదాపు రెట్టింపు అయినట్లు గణాంక అధికారులు చెబుతున్నారు. పదో తరగతి తర్వాత కళాశాలల్లో పిల్లలను చదివించేందుకు పలువురు పట్టణాలకు వస్తున్నారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు కనుమరుగు కావడంతో ఉపాధి కోసం పల్లెలను వీడుతున్న వారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఇదే కోవలో పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు రోజూ గ్రామాల నుంచి రాకపోకలు సాగించలేక పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. దీనివల్ల పట్టణాల జనాభా పెరిగిపోతోంది. జనాభా పెరుగుదల వల్ల పట్టణ శివారు ప్రాంతాల్లో కాలనీలు వెలుస్తున్నాయి. పట్టణాలను అనుకొని ఉన్న పల్లెలు వాటిలో కలిసిపోతున్నాయి.
దీంతో మేజర్ గ్రామ పంచాయితీలు సైతం చిన్న పట్టణాలుగా, చిన్న పట్టణాలు పెద్ద పట్టణాలుగా మార్పు చెందుతున్నాయి. చెన్నూరు, సీకేదిన్నె, వల్లూరు మండలాలు, పెండ్లిమర్రి మండలంలోని వైవీయూ ఇప్పటికే కడపలో దాదాపు కలిసిపోయాయి. ప్రొద్దుటూరులో పోట్లదుర్తి, రాజుపాళెంలు కలిసిపోయినట్లు ఉంటాయి. మైదుకూరులో చాపాడు, దువ్వూరు, ఖాజీపేట చాలా దగ్గరగా ఉంటాయి. బద్వేల్‌కు సమీపంలో ఉన్న గోపవరం మండలం దాదాపు బద్వేల్‌లో కలిసిపోయింది.
ఇలా చిన్న చిన్న గ్రామాలు మేజర్ పంచాయితీలలో, మేజర్ పంచాయితీలు నగర పంచాయితీల్లో కలిసిపోయి పట్టణాలుగా రూపొందుతున్నాయి.
అర్బన్ మండలం ఏర్పడినా....
పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని పాలనా సౌలభ్యం కోసం కడప అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు సిబ్బందిని కూడా నియమించారు. అయితే అర్బన్ మండలంలోని అధికారులతో భూసేకరణ పనులు అప్పగించి, పరిపాలన పరమైన వ్యవహారాలన్నీ కడప మండలం నుంచే జరుపుతున్నారు. దీంతో కడప అర్బన్‌మండలం ఏర్పడినా ఫలితం లేకుండా పోయింది.
మౌళిక సదుపాయాలపై దృష్టి
పట్టణాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రధానంగా విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు,పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటువుతున్నాయి. వ్యాపార సంస్థలు అందుబాటులోకి రావడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుపడుతున్నాయి.
పట్టణాలకు చేరుతున్న జనాభాకు అనుగుణంగా సమీప గ్రామాలు పట్టణాల్లో కలుస్తుండటంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, విద్యుత్, త్రాగునీటి సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటున్నారు.
పిల్లల చదువుల కోసం రావాల్సి వచ్చింది
మా స్వగ్రామం సిద్దవటం మండలంలోని వెంకటాయపల్లె. నాకు పట్టణ,జనాభా ,చదువులు,ఉద్యోగాలు,వ్యాపారాలు,గ్రామంలో కొంత పొలం ఉంది. పిల్లలను చదివించుకోవడానికి ఎనిమిదేళ్లక్రితం కడపకు వచ్చాను. మా గ్రామం నుంచి కడపకు వచ్చి పోవడానికి కొంత ఇబ్బందిగా ఉండటంతో కడపలోనే ఇల్లు బాడుగకు తీసుకొని, క్లినిక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నా. పల్లెలో ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చా.
– జె. ఉమామహేశ్వరరావు, ఫిజియోథెరపిస్ట్.
ఉపాధి అవకాశాల కోసం...
కమలాపురం మండలంలోని అప్పాయపల్లె మా స్వగ్రామం. నేను ఫోర్ వీలర్స్‌ను బాడుగకు ఇస్తుండేవాణ్ణి. ఈక్రమంలో ఉపాధి అవకాశాల కోసం మెల్లగా కడపకు వచ్చాం. పిల్లలను కూడా ఇక్కడే చదివిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడే ఇల్లు బాడుగకు తీసుకొని, స్థిర వ్యాపారం ఏర్పాటు చేసుకున్నాను. ఆ వ్యాపారం వల్ల జీవనం సాగిస్తున్నాను. పండుగలు, పబ్బాలకు మాత్రమే ఊరు వెళుతుంటాను.
– మోషె, కో ఆపరేటివ్ కాలనీ.
Comments
Please login to add a commentAdd a comment