టీడీపీలో చేరిన బెట్టింగ్‌ డాన్‌ కుటుంబ సభ్యులు | Betting Dons Family Members Joined In TDP In Rayalaseema, More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరిన బెట్టింగ్‌ డాన్‌ కుటుంబ సభ్యులు

Published Wed, Mar 26 2025 8:37 AM | Last Updated on Wed, Mar 26 2025 10:57 AM

Betting dons family members join TDP

25వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మెహరూన్‌తోపాటు కుటుంబ సభ్యులను కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వనిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

రాయలసీమ జిల్లాలకు విస్తరించిన బెట్టింగ్‌ సామ్రాజ్యమతడిది  

ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో కేసులు  
 

సాక్షి : క్రికెట్‌ బెట్టింగ్‌ డాన్‌గా గుర్తింపు పొందిన కీలక బుకీ అతడు.. క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్న వారికి ఇతని పేరు తెలియకుండా ఉండదు. ప్రొద్దుటూరు వాసే అయినా జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌ రాయుళ్లకు బాగా సుపరిచితుడు. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో 25వ వార్డుకు చెందిన అతడు ఒక బెట్టింగ్‌ సామ్రాజ్యాన్నే నడిపిస్తున్నాడు. ప్రారంభంలో జిన్నారోడ్డుకు చెందిన ఒక బుకీ వద్ద గుమాస్తాగా పని చేసేవాడు. తర్వాత అతని వద్దే సబ్‌ బుకీగా పని చేస్తూ నేడు రాయలసీమలోనే పేరు పొందిన క్రికెట్‌ బుకీగా మారాడు. సీమ జిల్లాల్లో అతనికి వందలాది మంది సబ్‌ బుకీలు ఉన్నా రు. మ్యాచ్‌లు జరిగే సమయంలో వీరి నుంచి ప్రతి రోజు రూ.కోట్లలో టర్నోవర్‌ సదరు బెట్టింగ్‌ డాన్‌కు చేరుతుంది. అతను కొంత బెట్టింగ్‌ మొత్తాన్ని తనే ఉంచుకొని మిగతా టర్నోవర్‌ను ముంబైలోని సేట్‌లకు పంపిస్తుంటాడు. ఇలా చాలా ఏళ్ల నుంచి అతను బెట్టింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఏపీతో పాటు తెలంగాణా, ముంబై తదితర ప్రాంతాలకు చెందిన బడా బుకీలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. 

ప్రొద్దుటూరు నుంచే అధిక టర్నోవర్‌ ...  
ప్రొద్దుటూరు క్రికెట్‌ బెట్టింగ్‌కు ప్రసిద్ధి. ఇక్కడ బడా బుకీలతో పాటు సబ్‌ బుకీలు అనేక మంది క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఈ డాన్‌కే టర్నోవర్‌ ఉన్న బుకీలే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్లే గాక పందేల డబ్బులు వసూలు చేసేందుకు అనేక మంది యువకులు కొరియర్‌ బాయ్‌లుగా వీరి కింద పని చేస్తున్నారు. వీరికి బైక్‌తో పాటు మెయింటెనెన్స్‌ కోసం డబ్బు, ఖరీదైన సెల్‌ఫోన్, మందు ఆశ చూపడంతో అనేక మంది యువకులు వారికి తెలియకుండానే క్రికెట్‌ బెట్టింగ్‌ రొంపిలోకి దిగుతున్నారు. కాగా క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబం«ధించి రాయలసీమలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ప్రొద్దుటూరు నుంచే రూ. కోట్లలో టర్నోవర్‌ ఇతడికి వెళ్తుండడం విశేషం.  

అనేక బెట్టింగ్‌ కేసులు 
బెట్టింగ్‌ డాన్‌పై అనేక కేసులున్నాయి. హోమ్‌ స్టేషన్‌ అయిన ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. ఇదే స్టేషన్‌లో 10కి పైగా బెట్టింగ్‌ కేసులు ఉన్నాయి. అలాగే టూ టౌన్, త్రీ టౌన్, ప్రొద్దుటూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో అనేక క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు నమోదు అయ్యాయి. కడపలోని రెండు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అలాగే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో కూడా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు ముగ్గురు క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు సదరు బెట్టింగ్‌ డాన్‌ ప్రమేయం కూడా ఉందని నిర్ధారణ కావడంతో అతని పేరు కూడా కేసులో చేర్చారు. అలాగే ఇదే కేసులో నెల్లూరు, అనంతపురానికి చెందిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. 

రక్షణ కోసం టీడీపీలో చేరిక...
క్రికెట్‌ బెట్టింగ్‌లే ఆదాయ మార్గంగా ఎంచుకున్న సదరు ‘బెట్టింగ్‌ డాన్‌’ కుటుంబీకులు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో 25వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మెహరూన్, ఆమె భర్త ఖాద్రి, బావ నూరి టీడీపీలో చేరారు. వీరంతా బెట్టింగ్‌ డాన్‌ రక్తసంబం«దీకులు.  ఖాద్రిపై కూడా క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు ఉన్నాయి. కేవలం అధికార పార్టీ అండకోసమే ‘డాన్‌’ కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారని సమాచారం. తమ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెంటే నడిచామని ఈ సందర్భంగా నూరి చెప్పడం గమనార్హం.

అన్ని వేళ్లూ వరద వైపే...
క్రికెట్‌ డాన్‌గా గుర్తింపు పొందిన సదరు బుకీ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై విమర్శకుల వేళ్లన్నీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైపే చూపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే జూదం, క్రికెట్‌ బెట్టింగులను అంతం చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అదే వ్యక్తులను అధికార పారీ్టలో చేర్చుకోవడం వెనుక మతలబు ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. ప్రొద్దుటూరులో ఇప్పటికే యధేచ్ఛగా జూదం కొనసాగుతుంది. మరోవైపు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు ఎమ్మెల్యే చెంతన ఉంటే అడ్డగించే సాహసం చేసేదెవరని పరిశీలకులు నిలదీస్తున్నారు.   

సొంతంగా యాప్‌ల నిర్వహణ  
ప్రస్తుతం క్రికెట్‌ బెట్టింగ్‌లో యాప్‌ల హవా నడుస్తుండటంతో బుకీలు కూడా అప్‌డేట్‌ అయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన ‘బెట్టింగ్‌ డాన్‌’తో పాటు పలువురు సొంతంగా యాప్‌లను నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ల సమయంలో యాప్‌ల నిర్వహణ కోసం రూ. లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా టెక్నికల్‌ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఐడీల ద్వారా స్థానికంగా ఉన్న బుకీలు యాప్‌ల ద్వారానే క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న అతను ఐపీఎల్‌ లాంటి వరుస క్రికెట్‌ మ్యాచ్‌లు ఉన్న సమయంలో సింగపూర్, కువైట్, దుబాయ్‌ దేశాల్లో ఉంటూ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుంటాడు. ఒకే చోట ఉండకుండా 15–20 రోజులకు మకాం మారుస్తుంటాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్‌ పందేలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement