న్యూఢిల్లీ: దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో గ్రామ పంచాయతీల్లో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీలు), పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
దేశవ్యాప్తంగా దాదాపు 99,000 పీఏసీలు ఉండగా, 63,000 మాత్రమే చురుగ్గా ఉన్నాయి. 1.6 లక్షల పంచాయతీల్లో పీఏసీలు లేవు. 2 లక్షల గ్రామాల్లో పాడి–మత్స్య సహకార సంఘాల్లేవు. అక్కడ వాటిని, తీర గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లలో 2 లక్షల బహుళ ప్రయోజనకర పీఏసీలు, పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఉత్తర సరిహద్దుల్లో ‘భవ్య గ్రామాలు’
దేశ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్(వీవీపీ) పేరిట నూతన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022–23 నుంచి 2025–26 దాకా మూడేళ్ల వ్యవధిలో రూ.4,800 కోట్లతో వీవీపీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకం. ఇందులో రూ.2,200 కోట్లను రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు. ఈ పథకంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వీవీపీ స్కీమ్‌తో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రం పాలిత ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేసింది.
షింకున్ లా సొరంగం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి 4.1 కిలోమీటర్ల పొడవైన షింకున్ లా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిమూ–పదామ్–దార్చా రోడ్డు లింక్‌లో రూ.1,681 కోట్లతో ఈ సొరంగం నిర్మిస్తారు. 2025 డిసెంబర్ నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్ధాఖ్‌కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని వివరించారు. దేశ భద్రతకు సైతం ఈ ప్రాజెక్టు చాలా కీలకమని చెప్పారు. శ్రీనగర్–కార్గిల్–లేహ్ టన్నెల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment