ఈసీ ఆదేశాలతో నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
సచివాలయాల వద్ద సిబ్బందితో కొనసాగనున్న కార్యక్రమం
3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టేలా అధికారుల ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఎన్నికల నేపథ్యంలో వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌లు వేసినందున తిరిగి ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు వచ్చే రెండు మూడు నెలల పాటు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పింఛన్ల పంపిణీని లబ్ధిదారుల ఇంటి వద్ద కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద చేపడతారు. సచివాలయాల వద్ద సిబ్బంది లబ్ధిదారుల ఆధార్ లేదా ఐరిస్ వివరాలను నిర్థారించుకుని పెన్షన్లు అందచేస్తారు.
ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని వారం క్రితమే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది కూడా ఏప్రిల్‌లో మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు.
► కోడ్ కారణంగా సచివాలయాల వద్ద జరిగే పింఛన్ల పంపిణీలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సచివాలయాల సిబ్బంది అందరి సేవలను వినియోగించుకోవాలని సెర్ప్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వలంటీర్ల ప్రమేయం లేకుండా కేవలం సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రమే ఫించన్ల పంపిణీని కొనసాగించాలని స్పష్టం చేసింది. ► గతంలో మాదిరిగానే సచివాలయాల వద్ద కూడ లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలోనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది.
► పింఛన్లు పంపిణీ చేసే సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు. ఫోటోలు, వీడియోలు తీయకూడదు. ఎన్నికల కోడ్ నియమాలను తప్పునిసరిగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
► సచివాలయాల వారీగా బ్యాంకుల నుంచి నగదు డ్రా వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిట్నరింగ్ అధికారులకు ఆయా మండల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లు ముందుగానే తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సచివాలయాలవారీగా విడుదల చేసే డబ్బుల వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలను ప్రభుత్వమే జారీ చేస్తుంది. వాటిని సంబంధిత మండల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంటాయి.
► పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాల సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లను అందుబాటులో ఉంచుతున్నారు.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది .అందరూ పింఛన్ల పంపిణీలో పాల్గొనే అవకాశం ఉన్న నేపధ్యంలో ఏ రోజు ఎంత మందికి ఇచ్చారనే వివరాలను సేకరించడంతోపాటు సంబంధిత రోజు మిగిలిపోయే నగదును తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలకు అప్పగించారు.
► ఎవరైనా లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే అలాంటి వారికి ప్రత్యేకంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిషీయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఆర్‌బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఆదేశించింది.
► ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు తరలింపుపై అంక్షలు ఉన్నందున పింఛన్ల డబ్బులను బ్యాంకు నుంచి డ్రా చేసే బాధ్యతను గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శితో పాటు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అప్పగించగా వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో పాటు వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలకు అప్పగించారు.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది అందరికి కొత్తగా ఫించన్ల పంపిణీకి సంబంధించి అన్‌లైన్ లాగిన్‌లను అందుబాటులో ఉంచుతున్నామని, తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్‌ను సిబ్బంది డౌన్‌లోడ్ చేసుకోవాలని సెర్ప్ సూచించింది. ఆయా సచివాలయాల పరిధిలో పింఛన్ లబ్ధిదారులందరి వివరాలు అక్కడ పనిచేసే సిబ్బంది మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment