మయన్మార్‌లో పాలక సైన్యం దారుణానికి తెగబడింది. సొంత పౌరులపై వైమానిక దాడి జరిపింది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గంపై ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ భీకర దాడిలో 100 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
కాగా సగయింగ్ ప్రాంతంలోని పాజిగై గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో మయన్మార్ సైన్యం ఆ గ్రామంపై ఫైటర్ జెట్‌తో బాంబుల వర్షం కురిపించింది.
ఈ దాడిలో 100 మందికి పైగా మరణించగా.. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు, స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష సంస్థల నాయకులు కూడా ఉన్నారని ప్రతక్ష్య సాక్షి ఒకరు స్థానిక మీడియాతో వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే మయన్మార్ సైన్యం వివరాలను బయటకు పొక్కనీయకపోవడంతో మృతుల సంఖ్యపై స్పష్టత లేదు.
చదవండి: Bathinda: మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..
ఇక ఈ దాడి తామే చేసినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం జుంటా ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందుకు పాజిగై గ్రామంపై అటాక్ చేశామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. మయన్మార్ మిలిటరీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు.
అదే విధంగా అమాయక పౌరులపై సాయుధ దళాల దాడిని ఉగ్రవాద సైన్యం జరిపిన హేయమైన చర్యగా ప్రతిపక్ష నేషనల్ యూనిటీ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి సైన్యం దేశ అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భద్రతా బలగాలు దాదాపు 3,000 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment