24 గంటలు గడిచినా జాడలేని తల్లి పులి..బిక్కుబిక్కు మంటున్న కూనలు | Tiger Cubs In Godown On Village Outskirts At Nandyala | Sakshi
Sakshi News home page

జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!

Published Tue, Mar 7 2023 10:05 AM | Last Updated on Tue, Mar 7 2023 10:21 AM

Tiger Cubs In Godown On Village Outskirts At Nandyala - Sakshi

సాక్షి, అమరావతి/కొత్తపల్లి: నంద్యాల జిల్లా కొత్త­పల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారు­లోని ఓ గోడౌన్‌లో సోమవారం ఉదయం నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. ఆ నాలుగు ఆడ పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తు­న్నారు. మరోవైపు పిల్లల కోసం తల్లి పులి వచ్చి దాడి చేస్తుందని పెద్దగుమ్మడాపురం గ్రామస్తులు భయాందోళ­నలకు గురవుతున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని కొత్తపల్లి మండలం పెద్ద­గుమ్మ­డా­పురం గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి ఆను­కుని ఉంటుంది. గ్రా­మ­స్తులు ఉదయం కాలకృత్యాలు తీర్చు­కునేందుకు అటవీ ప్రాంతానికి వెళు­తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ యువకుడు గ్రామానికి చివ­ర నిర్మాణంలోని మల్టీ­పర్పస్‌ గోడౌన్‌ అవతలివైపునకు వెళ్లగా, పులి­పిల్లల అరుపులు వినిపించాయి.

మొదట జంగం పిల్లు­లుగా భావించినా.. దగ్గరకు వెళ్లి చూడగా నాలుగు పులి పిల్లలు కనిపించాయి. అతను వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలి­యజేశాడు. స్థానికుల సమా­చా­రం మేరకు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నాగేశ్వరావు, సిబ్బంది పెద్దగుమ్మ­డా­పురం చేరుకుని నాలుగు పులి పిల్లలను పరిశీలించారు. సుమారు 40రోజుల వయసు కలిగిన పులి పిల్ల­లను అడవిలోకి తీసుకువెళ్లి తల్లితో కలిపేందుకు ప్రయ­త్నిం­చారు. మూడు గంటలు అడవిలో తిరి­గినా తల్లి కనిపించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పులిపిల్లలు డీలా పడిపో­యాయాయి. దీంతో వాటికి పాలు పట్టించి బైర్లూటి రేంజ్‌లో ఉన్న జంతువైద్య­శా­లకు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నా­­­యని నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో ఎండ పెరగడం, చెట్లకు మంట పెడుతుండ­టంతో వేడి తీవ్రత తట్టుకో­లేక గ్రామంలోకి పెద్దపులి తన పిల్ల­లను తీసుకువచ్చి, ఒంటరిగా తిరిగి వెళ్లి ఉంటుందని అధి­కారులు భావిస్తు­న్నారు.

ఆత్మ­కూరు సర్కిల్‌ సీఐ ఆర్‌జీ సుబ్రహ్మ­ణ్యం పరిస్థితిని సమీక్షించారు. ఈ విష­యమై సున్ని­పెంట బయోడైవర్సిటీ రేంజ్‌ అధికారి మహ­మ్మద్‌ హయత్‌ మాట్లా­డుతూ గ్రామస్తులు ఎలాంటి భయాందోళన­లకు గురికా­వొద్దని, పులి రాకను గమనిస్తే వెంటనే అధికారు­లకు సమాచారం అందించాలని సూచించారు. పెద్ద పులికి రెండు, మూడు పిల్లలే పుడతా­యని, అయితే నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడం చాలా అరుదని ఆయన తెలిపారు. ఎన్‌క్లోజర్‌లో పెట్టి.. తల్లి కోసం ఎదురుచూస్తూ.. పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథా­రిటీ (ఎన్‌­టీసీఏ) నిబంధనల ప్రకారం అధికా­రులు, సిబ్బందితో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్ట్‌ టైగర్‌ సర్కిల్‌ ఏసీఎఫ్‌ (అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌) ఆర్‌.శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’­కి తెలి­పారు.

పులి పిల్లలు దొరి­కిన సమీపంలోనే చిన్న ఎన్‌క్లోజర్‌లో వాటిని ఉంచి దూరం నుంచి తల్లి వస్తుందో.. లేదో.. అని గమనిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ 50 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల వాసన, అరుపులను బట్టి తల్లి వస్తుందని భావిస్తున్నామని, వస్తే వాటిని దానికి జత చేస్తామ­న్నారు. అలా­కాకుండా అడవిలో వదిలేస్తే అవి ఇతర జంతువుల బారినపడ­తా­యని చెప్పారు. ఐతే 24 గంటలు గడిచినా తల్లి పులి జాడ లేదు. దీంతో అధికారులు ఒకటి, రెండు రోజులు చూసిన తర్వాత కూడా తల్లి రాకపోతే వాటిని తిరు­పతి జూకు తరలించి సంరక్షించేందుకు చర్య­లు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆ కూనలు సంరక్షణ కోసం తిరుపతి వన్య ప్రాణి బృందం మంగళవారం ఆత్మకూరు రానుంది. ఇదిలా ఉండగా, సమీపంలోనే సంచరిస్తున్న తల్లి! పులి పిల్లలు లభించిన ప్రాంతంలోనే తల్లి పులి తిరు­గుతున్నట్లు దాని గాండ్రిపుల ద్వారా అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ తల్లి పులిని డిసెంబర్‌ నెలలో కెమెరా ట్రాప్‌లో గుర్తించినట్లు అటవీ శాఖాధికారులు చెబుతు­న్నారు. ఆ సమయంలో అది గర్భంతో ఉంది. ఇప్పుడు దాని పిల్లలే పెద్దగుమ్మడాపురంలో ఉన్నట్లు భావిస్తు­న్నారు.

(చదవండి: ఎంఎస్‌ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement