tiger cubs
-
అడవి ఒడికి పులి కూనలు
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలు అతి త్వరలో నల్లమల అభయారణ్యంలో అడుగిడనున్నాయి. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడ పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజల కంటపడిన విషయం విదితమే. తల్లి జాడ లేకపోవటంతో పులి పిల్లలను అటవీ శాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల మృతి చెందగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్క్లోజర్లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పులులను సంరక్షించేందుకు ఎల్లవేళలా వెటర్నరీ వైద్యులు ఎన్క్లోజర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎన్క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు. పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ జూ పార్కు నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు. చారల దుప్పుల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్ కాకినాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన చారల దుప్పుల కోసం కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో 20 మీటర్ల పొడవు, వెడల్పుతో ప్రత్యేకంగా ఓ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. వీటికోసం ఎన్‌క్లోజర్ బయట రూ.2.50 లక్షలతో సోలార్ బోరు అమర్చారు. దానినుంచి ఎన్‌క్లోజర్‌లోకి ప్రత్యేకంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. వీటి అవసరాలను తీర్చేందుకు సాసర్పిట్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశారు. వేసవిని తట్టుకునేలా ఎన్‌క్లోజర్ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్ ఫీడ్‌ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదోర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్‌క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఎన్క్లోజర్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన టైగర్ ఎన్క్లోజర్లను సిద్ధం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇక్కడకు రప్పించిన చారల దుప్పుల కోసం కూడా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసి సోలార్ బోర్ ద్వారా నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్ రేంజి అధికారి, కొర్రప్రోలు -
అనాథలైన పులి పిల్లలు..ఆదరించిన రైతన్నలు..
-
పులి కూనలకు మూడేళ్లు జూ లోనే సంరక్షణ
-
తల్లి పులి ఒక చోట..పిల్లలు మరోచోట
-
తిరుపతి జూ పార్క్‌కు తరలిన పులి కూనలు
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు నాగార్జున సాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలి పారు. తల్లితో పులి కూనలను కలిపేందుకు నాలుగు రోజులపాటు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి కూనల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్క్‌కు తరలించారు. పులి కూనల ఆరోగ్యం భేష్ తల్లి పులి బతికే ఉందని నిర్ధారణ కావడం, పులి కూనలు కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉండటం సంతోషకరమని నాగార్జునసాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జూపార్క్‌కు అనుబంధంగా ఉన్న అడవిలో పులి కూనలను పెంచుతామన్నారు. కొంత వయసు వచ్చాక వేటలో తర్ఫీదునిచ్చి తిరిగి అడవిలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఇదిలావుండగా.. పులి పాదముద్రలు కనిపించాయని కొందరు చెప్పగా.. ఆ ప్రదేశానికి గురువారం తెల్లవారుజామున పులి కూనలను తరలించారు. కూనల అరుపులతో కూడిన రికార్డింగ్స్‌ను వినిపిస్తూ.. తెల్లవారే వరకు ఎదురు చూసినా తల్లి పులి జాడ కనిపించలేదు. -
నాలుగో రోజైనా జాడ దొరికేనా?
ఆత్మకూరు రూరల్/కొత్తపల్లి: శ్రీశైలం–నాగార్జున సాగర్ పులుల అభయారణ్యంలో 4 ఆడ పిల్లలను ఈనిన ‘టీ108’ అనే పెద్దపులి వాటికి దూరమై 3 రోజులు గడిచిపోయింది. మరో వైపు తల్లీ బిడ్డల పునరేకీకరణ (రీయూనియన్)కు అటవీ అధికారులు పూర్తిగా శ్రమిస్తున్నారు. 300 మంది ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్) సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్ పేట్రోలింగ్) చేస్తున్నారు. పులుల ప్రవర్తనాంశాలను పరిశీలిస్తే తల్లి పులి తన పిల్లల కోసం గరిష్టంగా 4 రోజుల వరకు వెతికే యత్నం చేస్తుందని పులి జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు చెబుతున్నారు. అయితే ఇంకో 24 గంటలు గడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తల్లి పులి తన బిడ్డలను గుర్తించి అక్కున చేర్చుకోవడమన్నది అసాధ్యమంటున్నారు. తల్లి పులి జాడ దొరకని పక్షంలో పులి కూనలను జంతు ప్రదర్శన శాలకు తరలించే అవకాశం ఉంది. కాగా, పులి కూనల ఆరోగ్యం నిలకడగా ఉందని ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్) డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ చెప్పారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులి కూనలు చక్కగా ఆహారం తీసుకుంటున్నాయని, కోడి కాలేయం ముక్కలను ఇష్టంగా భుజించాయని తెలిపారు. 300 మంది ఎన్ఎస్టీఆర్ సిబ్బంది, అధికారులు విడతల వారీగా పాద పరిశీలన (ఫుట్ పేట్రోలింగ్)లో ఉన్నట్లు వివరించారు. తల్లిని విడిచిన కూనలు కొంత షాక్‌లో ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించడం వాటికి ఇబ్బంది అయిన కారణంగా మొదట తల్లిని అన్వేషించి ఆ తరువాత పిల్లలను ఆ పులి వద్దకు చేర్చే వ్యూహాన్ని పాటిస్తున్నామన్నారు. స్నిప్పర్ డాగ్స్‌తో (శునక శోధన), డ్రోన్ కెమెరాలతో పులిని గుర్తించే యత్నం చేయడం లేదని, అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని చెప్పారు. ఆ పాదముద్ర తల్లి పులిదేనా? నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు, చిన్నగుమ్మడాపురం గ్రామాల మధ్యన ప్రధాన రహదారికి కొద్ది దూరంలో ఆటోడ్రైవర్‌కు పెద్దపులి బుధవారం కనిపించింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న గొర్రెల కాపరి చిన్న వెంకటేశ్వర్లుకు అతడు తెలపగా..అతను చూసేలోపు పులి అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి కాలిముద్రలను పరిశీలించారు. అచ్చిరెడ్డికుంట వరకు పెద్దపులి కాలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడినుంచి పులి ఎటువైపుగా వెళ్లిందనే కోణంలో గాలింపునకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ పులి పాదముద్రలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అచ్చు తీసి టీ108 తో సరిపోల్చి నిర్థారించగలిగితే తల్లిని అన్వేషించే పనిలో కొంత పురోభివృధ్ధి సాధించినట్లేనని శ్రీశైలం అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు డీఎఫ్‌వో అలెన్చాంగ్టేరాన్ తెలిపారు. -
నంద్యాల: తల్లి పులి ఉత్కంఠ.. కీలక పరిణామం
సాక్షి, నంద్యాల: తల్లిపులి దగ్గరికి పులి పిల్లలను చేర్చడం అనే ఆపరేషన్ ద్వారా.. దేశ చరిత్రలోనే తొలిసారి ఈ తరహా ప్రయత్నానికి ఏపీ వేదిక అయ్యింది. అలాగే నంద్యాల జిల్లాలో తల్లి పులి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే.. తాజాగా ఆపరేషన్ తల్లి పులిలో కీలక పరిణామం చోటు చేసుకుందని ఆపరేషన్ కమిటీ మెంబర్, డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ ఆప్పవ్ ఐఎఫ్ఎస్ పేర్కొన్నారు. పెద్ద గుమ్మాడాపురం అటవీప్రాంతంలోపెద్ద పులి అడుగుజాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించినట్లు విగ్నేష్ తెలిపారు. అయితే.. అది తల్లి పులి (T108 F)వి అవునా? కాదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. మరోవైపు 50కిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో ఆపరేషన్ తల్లి పులి నిర్వహిస్తున్నట్లు తెలిపారాయన. పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారాయన. శాస్త్రీయంగాను సాంకేతికంగా తల్లి పులికోసం గాలిస్తున్నాం. దాదాపు 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేస్తున్నాము. అవసరాన్ని బట్టి డ్రోన్ కూడా వినియోగిస్తాం అని తెలిపారాయన. నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం చేత ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నాం. నిపుణుల సూచనల మేరకు పులికూనలకు పాలు, సెరోలాక్ తో పాటు ఇవాళ (బుధవారం) చికెన్ లివర్ ముక్కలను అందించాం అని తెలిపారాయన. -
తల్లి కోసం పులి కూనల కలవరం
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది. పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి³ పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్ నుంచి వదులుతారు. ఆ నాలుగూ ఆడ కూనలే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే ప్రధాన పాత్ర. గుమ్మడాపురంలో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఒక ఆడపులి తన జీవిత కాలంలో (అడవిలో అయితే 18 ఏళ్లు) 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. చేరదీస్తుందో.. లేదో! వన్యప్రాణుల్లో పెద్ద పులి, దొమ్మల గొండి (హైనా) తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు రానీయవు. పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలను తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. కాగా, మనిషి ముట్టిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరిస్తున్నారు. దీంతో పులి పిల్లల వంటిని తడపనున్నారు. అన్ని సందర్భాల్లో వర్తించదు మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ పేర్కొన్నారు. తల్లికి, పిల్లలకు మధ్య ఉండే బలమైన బంధం, ప్రత్యేక పరిస్థితులు దీనికి మినహాయింపు కావచ్చన్నారు. అందువల్ల పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభిస్తాం పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని అటవీ శాఖ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్లో గర్భంతో ఉన్న పులిని ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించామన్నారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చన్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల వన్యప్రాణి వైద్య నిపుణులు డాక్టర్ తోయిబా సింగ్ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారన్నారు. కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చోంగ్ టెరాన్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
24 గంటలు గడిచినా జాడలేని తల్లి పులి..బిక్కుబిక్కు మంటున్న కూనలు
సాక్షి, అమరావతి/కొత్తపల్లి: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులోని ఓ గోడౌన్లో సోమవారం ఉదయం నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. ఆ నాలుగు ఆడ పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పిల్లల కోసం తల్లి పులి వచ్చి దాడి చేస్తుందని పెద్దగుమ్మడాపురం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. గ్రామస్తులు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళుతుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ యువకుడు గ్రామానికి చివర నిర్మాణంలోని మల్టీపర్పస్ గోడౌన్ అవతలివైపునకు వెళ్లగా, పులిపిల్లల అరుపులు వినిపించాయి. మొదట జంగం పిల్లులుగా భావించినా.. దగ్గరకు వెళ్లి చూడగా నాలుగు పులి పిల్లలు కనిపించాయి. అతను వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగేశ్వరావు, సిబ్బంది పెద్దగుమ్మడాపురం చేరుకుని నాలుగు పులి పిల్లలను పరిశీలించారు. సుమారు 40రోజుల వయసు కలిగిన పులి పిల్లలను అడవిలోకి తీసుకువెళ్లి తల్లితో కలిపేందుకు ప్రయత్నించారు. మూడు గంటలు అడవిలో తిరిగినా తల్లి కనిపించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పులిపిల్లలు డీలా పడిపోయాయాయి. దీంతో వాటికి పాలు పట్టించి బైర్లూటి రేంజ్లో ఉన్న జంతువైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో ఎండ పెరగడం, చెట్లకు మంట పెడుతుండటంతో వేడి తీవ్రత తట్టుకోలేక గ్రామంలోకి పెద్దపులి తన పిల్లలను తీసుకువచ్చి, ఒంటరిగా తిరిగి వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆత్మకూరు సర్కిల్ సీఐ ఆర్జీ సుబ్రహ్మణ్యం పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయమై సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహమ్మద్ హయత్ మాట్లాడుతూ గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని, పులి రాకను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పెద్ద పులికి రెండు, మూడు పిల్లలే పుడతాయని, అయితే నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడం చాలా అరుదని ఆయన తెలిపారు. ఎన్‌క్లోజర్‌లో పెట్టి.. తల్లి కోసం ఎదురుచూస్తూ.. పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బందితో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) ఆర్.శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పులి పిల్లలు దొరికిన సమీపంలోనే చిన్న ఎన్‌క్లోజర్‌లో వాటిని ఉంచి దూరం నుంచి తల్లి వస్తుందో.. లేదో.. అని గమనిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ 50 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల వాసన, అరుపులను బట్టి తల్లి వస్తుందని భావిస్తున్నామని, వస్తే వాటిని దానికి జత చేస్తామన్నారు. అలాకాకుండా అడవిలో వదిలేస్తే అవి ఇతర జంతువుల బారినపడతాయని చెప్పారు. ఐతే 24 గంటలు గడిచినా తల్లి పులి జాడ లేదు. దీంతో అధికారులు ఒకటి, రెండు రోజులు చూసిన తర్వాత కూడా తల్లి రాకపోతే వాటిని తిరుపతి జూకు తరలించి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆ కూనలు సంరక్షణ కోసం తిరుపతి వన్య ప్రాణి బృందం మంగళవారం ఆత్మకూరు రానుంది. ఇదిలా ఉండగా, సమీపంలోనే సంచరిస్తున్న తల్లి! పులి పిల్లలు లభించిన ప్రాంతంలోనే తల్లి పులి తిరుగుతున్నట్లు దాని గాండ్రిపుల ద్వారా అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ తల్లి పులిని డిసెంబర్ నెలలో కెమెరా ట్రాప్‌లో గుర్తించినట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో అది గర్భంతో ఉంది. ఇప్పుడు దాని పిల్లలే పెద్దగుమ్మడాపురంలో ఉన్నట్లు భావిస్తున్నారు. (చదవండి: ఎంఎస్ఎంఈల్లో రాణిస్తున్న మహిళలు) -
నంద్యాల: పులి కూనలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో పెద్ద పులి కూనల లభ్యమైన ఘటనలో ఉత్కంఠ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన నాలుగు పులి కూనల్లో... రెండు పులి కూనల ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ టీమ్ సిబ్బంది పులికూనలను ఆడవిలో వదిలిన కానీ, అక్కడి నుంచి అవి కదలడం లేదు పులికూనలకు పాలు తాగించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నం చేసింది. నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా పులి కూనలు డీహైడ్రేషన్‌కు గురికావడంతో బైర్లుటి వైల్డ్ లైఫ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. పులి కూనల తల్లీ(పెద్దపులి) ఆచూకీ తెలుసుకునేందుకు ఇన్ఫ్రారెడ్(ట్రాప్) కెమెరాలను టైగర్ ట్రాకర్లు పరిశీలిస్తున్నారు. చదవండి: రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో -
ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన మరో అడోరబుల్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ట్విటర్లో ఆకర్షణీయమైన పో'స్టులు, ఆసక్తిరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ఆయన ఈ వీకెండ్లో మరో ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఒక్కోసారి పిల్లలు వేరే జాతివాళ్లా... అనిపిస్తుంది. ఏది ఏమైనా పిల్లలంటే పిచ్చి ప్రేమే అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. (కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!) ఈ వీడియోలో ఒరంగుటాన్ పులి పిల్లలకు పాలు పట్టడం, ముద్దు చేయడం కన్నతల్లి కంటే మిన్నగా ప్రేమను పంచడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో అమ్మ ఎక్కడైనా అమ్మే అని కొంతమంది, జంతువులనుంచి మనుషుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని మరికొంతమంది కమెంట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న చక్కటి ఈ వీడియోను ఈ వీకెండ్లో మీరు కూడా చూసేయండి. (Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్) Sometimes you feel like your kids belong to a different species but you’re crazy about them nevertheless! 😊 pic.twitter.com/rD9IGohPQq — anand mahindra (@anandmahindra) August 7, 2022 -
కన్నపేగు కసిరి కొట్టినా.. ఆ అమ్మ అక్కున చేర్చుకుంది
ప్రేమకు హద్దులు లేవు. అందునా అమ్మ ప్రేమకి!. అందుకు నిదర్శనంగా నిలిచే.. ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. వింటున్నాం కూడా. ప్రస్తుతం ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో అమితంగా ఆకట్టుకుంటోంది. అమ్మ ప్రేమకు దూరమైన మూడు పులి పిల్లలను అక్కున చేర్చుకుంది ఓ లాబ్రాడర్ డాగ్. అలాగని ఆ అమ్మ వాటికేం శాశ్వతంగా దూరం కాలేదు. ఓ తల్లి పులి దానికి పుట్టిన మూడు పిల్లలను పుట్టినప్పటి నుంచి దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో జూ నిర్వాహకులు.. ఆ పులి కూనల ఆలనా పాలనను ఓ శునకానికి అప్పజెప్పారు. తొలుత ఈ ప్రయత్నం ఫలించదేమో అని, పులి కూనల పరిస్థితిపై ఆందోళన చెందారు నిర్వాహకులు. కానీ, అదేం బంధమో.. ఆ పులి కూనలను అక్కున చేర్చుకుంది ఆ ఆడ శునకం. ఇంకేం ఆ ప్రేమకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. చైనా జూలో ఇది చోటుచేసుకుంది. ఒరిజినల్ వీడియో ఏప్రిల్ 27న అప్లోడ్ కాగా, తాజా వీడియో ట్విటర్ ద్వారా వైరల్ అవుతోంది. Because you want to see a lab doggy take care of baby rescue tigers pic.twitter.com/qmKnyO4Fzi — A Piece of Nature (@apieceofnature) May 15, 2022 నేషనల్ టైగర్ కన్వర్జేషన్ అథారిటీ ప్రకారం.. సాధారణంగా తల్లి పులి చనిపోయినప్పుడు కూనలు అనాథలు అవుతుంటాయి. కానీ, పాలిచ్చే పెంచే ఓపిక లేనప్పుడు కూడా పులులు ఇలా కూనల్ని దగ్గరకు రానివ్వకుండా కసరుకుంటాయట. అడవుల్లో అయితే కొన్ని సందర్భాల్లో తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తుంటాయట!. కిందటి ఏడాది.. ఓ నల్ల చిరుతను ఓ శునకం సైబీరీయాలో పెంచిన కథనం.. ఇలాగే వైరల్ అయ్యిం అందరినీ ఆకట్టుకుంది. -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తెల్ల పులి
సాక్షి, బెంగళూరు: చెన్నై వండలూరు జూలోని తెల్లపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలను ప్రత్యేక బోనులో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో సంరక్షిస్తున్నారు. కాగా ఓ పిల్లపై తల్లి పంజా తగలడంతో గాయమైంది. వైద్యులు చికిత్స చేస్తున్నారు. మిగిలిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ సిబ్బంది తెలిపారు. -
జాడలేని తల్లి.. పాపం పులి కూనలు..
సాక్షి, మైసూరు: మైసూరు జిల్లాలోని బండీపుర అరణ్యంలో తల్లి లేని మూడు పెద్ద పులి పిల్లల్లో రెండు మృత్యువాత పడిన విషాదం వెలుగుచూసింది. బండీపుర అభయారణ్యంలో సోమవారం గస్తీలోనున్న అటవీ సిబ్బందికి పొదల్లో సుమారు నెలన్నర వయసున్న మూడు పులి కూనలు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా వాటిలో ఒకటి చనిపోయినట్లు గుర్తించారు. మరో రెండు తీవ్ర ఆకలితో మృత్యువుకు చేరువగా ఉన్నాయి. ఏ కారణం వల్లనో తల్లిపులి వాటిని వదిలేసి వెళ్లడంతో రోజుల తరబడి పాలు, పోషణ కరువైనట్లు అధికారులు తెలిపారు. జీవించి ఉన్న పులి కూనలను హుటాహుటిన మైసూరు జూకు తెస్తుండగా మరొకటి కూడా చనిపోయింది. బతికి ఉన్న ఏకైక కూనకు ఆహారం అందించి చికిత్స చేపట్టారు. చనిపోయినవాటికి పోస్టుమార్టం నిర్వహించగా ఆహారం లేకపోవడమే మృతికి కారణమని తేలిందని అధికారులు చెప్పారు. తల్లి పులి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బావిలో పడ్డ పంగోలిన్ మరో ఘటనలో మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని చిక్కాడనహళ్ళి గ్రామంలో ఓ బావిలో అరుదైన పంగోలిన్ దర్శనమిచ్చింది. బావిలో పడిన అలుగు బయటకు రాలేకపోయింది. గ్రామస్తులు గమనించి దానిని బయటకు తీసి అటవీ సిబ్బందికి అప్పగించారు. సాధారణ పంగోలిన్లు బూడిద, నలుగు రంగులో ఉంటాయి. ఇది నారింజ రంగులో ఉండడం విశేషమని తెలిపారు. -
‘బెంగాల్ టైగర్’ వారసులొచ్చాయి
ఆస్ట్రియా: కాకుల కావ్‌కావ్‌లు కానరావట్లేదు. కోకిల కిలకిలలు తగ్గిపోయాయి. పాలపిట్ట జాడైనా తెలియరావట్లేదు. పక్షులే కాదు జంతువులూ ఈ కోవలోకే వస్తున్నాయి. మనిషి తన స్వార్థానికి చేస్తున్న విధ్వంస రచన వల్ల అనేక జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే ఎన్నో జంతువులు ఇప్పటికే అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరాయి. అందులో ‘బెంగాల్ టైగర్’ మొదటి స్థానంలో ఉంది. అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడానికి భారత్‌తో పాటు ఇతర దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రియాలోని కెర్నాఫ్ జూ సంరక్షణలో ఉన్న పదమూడేళ్ల ఆడపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకొస్తున్న జూ సిబ్బంది పులిపిల్లలు పుట్టిన నెలన్నర తర్వాత వాటిని సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. జూ అధికారి రేయినర్ ఎడర్ మాట్లాడుతూ.. పదమూడేళ్ల ముసలి వయసులో ఒక పులి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం తమకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించిందన్నారు. పుట్టినప్పుడు అవి ఒక్కోటి కిలో బరువు ఉండగా ఇప్పుడు దాదాపు నాలుగు కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హెక్టార్, పాషా, జీయస్ అని వాటికి నామకరణం కూడా చేశారు. ఈ జూలో ఇప్పుడు పులిపిల్లలు వచ్చి చేరడంతో జూకి కొత్త అందం వచ్చినట్టయింది. దీంతో కెర్నాఫ్ జూ మంచి టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఒక ఏడాది తర్వాత ఈ పిల్లలను వేరే జూకి దత్తత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అక్కడి అధికారులు. భారతదేశంలో ఎక్కువగా ఉండే ఈ జాతి పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2500కు పడిపోయిందని వరల్డ్ వైల్డ్ లైఫ్ అనే వెబ్సైట అంచనా వేసింది. మరోవైపు ఈ పులిపిల్లలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి ముచ్చట పడిపోతున్న జంతు ప్రేమికులు ‘బెంగాల్ టైగర్ వారసులొచ్చాయి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మ లాంటి బొమ్మను చూసి...
-
అమ్మ లాంటి బొమ్మను చూసి...
చిన్న పిల్లలకు తల్లి దూరమైతే కలిగే బాధ చెప్పనలవి కాదు. కన్నతల్లి కానరాక.. అన్న పానీయాలు కూడా మానేస్తారు. మనుషులే కాదు.. జంతువులకు కూడా ఇది వర్తిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఒక పెద్దపులి మూడు పిల్లలను కంది. ఆ తర్వాత అది రైతులు తమ పొలాల సంరక్షణ కోసం ఏర్పాటుచేసుకున్న కరెంటు కంచె తగిలి చనిపోయింది. దాంతో అప్పటివరకు తల్లి దగ్గరే అడవిలో పెరిగిన ఆ పులి పిల్లలకు ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు. మనుషులను నమ్మలేక.. బాటిళ్లలో ఇచ్చే పాలు తాగలేక రోజురోజుకూ అవి క్షీణించసాగాయి. వాటి ఆరోగ్యం కూడా బాగా ప్రమాదకరంగా మారడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కాలేదు. చివరకు వాళ్లలో ఒకరికి మంచి ఐడియా తట్టింది. రోడ్డు పక్కన అచ్చం పులిలాగే ఉండే సాఫ్ట్ టాయ్స్ అమ్ముతుండటం గుర్తుకొచ్చి, అలాంటి బొమ్మ ఒకదాన్ని తీసుకొచ్చి ఆ పులిపిల్లలున్న చోట పెట్టారు. సాధారణంగా గ్రామాల్లో దూడలు చనిపోయినప్పుడు ఆవులు, గేదెలు పాలివ్వవు. అలాంటప్పుడు గ్రామస్తులు వాటి దగ్గరలో ఆ దూడ మృతదేహాన్ని నిలబెట్టడం లేదా బొమ్మ దూడలను ఉంచడం చేస్తారు. అప్పుడు అవి పాలిస్తాయి. ఆ విషయం తెలిసిన మృదుల్ పాఠక్ అనే ఫీల్డ్ డైరెక్టర్ అదే ఆలోచనను ఇక్కడ కూడా అమలుచేశారు. అధికారులు ఆ పులిపిల్లలను చూసేసరికి అవి దాదాపుగా మరణానికి దగ్గరగా ఉన్నాయి. సాధారణంగా మనుషులకైతే వెంటనే సెలైన్ పెట్టడం లాంటి చర్యల ద్వారా వీలైనంత త్వరగా కోలుకునేలా చేస్తారు. కానీ జంతువుల విషయంలో అలా కుదరదు. వాటికి సూది గుచ్చిన వెంటనే విపరీతంగా భయపడతాయని, ఆ భయంతో వెంటనే చనిపోతాయని పాఠక్ వివరించారు. అందుకే వాటికి తప్పనిసరిగా నోటి ద్వారానే ఆహారం అందించాలన్నారు. దాంతో బొమ్మ పులి లోపల పాల బాటిళ్లను ఉంచి, బయటకు పాల తిత్తులు వచ్చేలా చేసి, వాటి ద్వారా ఆ పిల్లలకు పాలు అందించారు. నిజంగా అమ్మే పాలు పడుతోందని భావించిన ఆ పులిపిల్లలు.. పాలు తాగి ఎంచక్కా కోలుకున్నాయి, ఇప్పుడు చలాకీగా తిరుగుతున్నాయి. -
అమర్-అక్బర్-ఆంటోనీ మళ్లీ పుట్టారు!
అమర్.. అక్బర్.. ఆంటోని.. అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి అద్దంపట్టిన వెండితెర దృశ్యరూపం. సినిమా విడుదలై, హిట్టై 39 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ ముగ్గురూ మరో రూపంలో పునర్జన్మ పొందారు. పులి కూనలుగా భూమి మీదకు పాదంమోపి, గురువారం నామకరణ మహోత్సవం జరుపుకొన్నారు. మంగళూరు శివారులోని పిలికులా జాతీయ పార్కు పులలకు ఫేమస్. అక్కడి నేత్రావతి, విక్రమ్ అనే జంటకు మార్చిలో జన్మించిన కూనలే ఈ అమర్, అక్బర్, ఆంటోనీ, నిషాలు. నిధుల కొరతతో సతమతమవుతోన్న పార్క్ నిర్వాహకులు.. పులులను దత్తత తీసుకోవాల్సిందిగా(నిర్వహణా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా) చేసిన అభ్యర్థనలకు మంచి స్పందన లభించింది. అబుదాబికి చెందిన మిచెల్ డిసౌజా అనే వ్యక్తి నాలుగు పులి పిల్లల సంరక్షణార్థం ఏడాదికి రూ.5 లక్షల వితరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దీంతో పులి పిల్లలకు పేరుపెట్టే అవకాశం ఆయనకు లభించింది. బాలీవుడ్ హిట్ సినిమా అమర్- అక్బర్- ఆంటోనీ పేర్లను మూడు మగ పులి పిల్లలలకు, ఆడ పిల్లకేమో నిషా అని పేరు పెట్టాయన. ప్రస్తుతం పిలికులా పార్క్ లో 11 పులులు ఉన్నాయని, సంరక్షణా బాధ్యతలు స్వీకరించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు జూ డైరెక్టర్ హెచ్ జే భండారి. మీరూ pilikulazoo.com ను దర్శించి, ఏదేని జంతువునో, పక్షినో దత్తత తీసుకుని ఇష్టమైన పేరు పెట్టుకోండిమరి! -
పులి పిల్లలు - శునకమాత..!
మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా ‘సరోగసి’ ఉంటుందంటున్నారు చైనా జూ అధికారులు. అనడమే కాదు, నిజమని నిరూపిస్తున్నారు కూడా. తల్లి నిరాదరణకు గురైన పులిపిల్లలను అదే జూలోని ఓ శున కమాతకి దత్తత ఇచ్చి, జంతువులకు జాతివైరం లేదని చాటి చెబుతున్నారు. హాంగ్జూహూ జూ లో ఈ వింత సంఘటన చోటు చేసుకొంది. అక్కడ ఒక సైబీరియన్ టైగర్ రెండు కబ్స్‌కు జన్మనిచ్చింది. ఎందుకో అది వాటికి పాలివ్వనని మొరాయించింది. దీంతో దిక్కుతోచని జూ అధికారులు అదే జూ లో ప్రసవించిన జియావో అనే శునకం దగ్గరకు ఈ కబ్స్‌ను తీసుకెళ్లారు. పరాయి తల్లి కన్నబిడ్డలైనప్పటికీ వాటిని ఈసడించుకోకుండా, తన పిల్లలతో సమానంగా పులిపిల్లలకు కూడా ప్రేమతో పాలిచ్చింది జియావో. నవంబర్ పదోతేదీన కబ్స్ పుట్టాయట. అప్పటినుంచి వాటికి పాలిచ్చే బాధ్యత జియావోకే అప్పజెప్పామని వారు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ శునకాన్ని పులిపిల్లలకు సరోగసీ మదర్‌గా చెప్పవచ్చని వారు అంటున్నారు. ఈ జూలో ఇలా ఒక జాతి జంతువును మరోజాతికి దత్తతఇవ్వడం కొత్తకాదు. గతంలోనూ జరిగింది. అప్పుడూ ఇలాగే చేశారు. పులులు ఇలా తమ పిల్లలకు పాలివ్వకుండా మొరాయించడం మామూలేనని, అలాంటప్పుడు ఇదే పరిష్కార మార్గమని జూ అధికారులు పేర్కొన్నారు.