అమ్మ లాంటి బొమ్మను చూసి...
అమ్మ లాంటి బొమ్మను చూసి...
Published Sat, Feb 18 2017 9:45 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
చిన్న పిల్లలకు తల్లి దూరమైతే కలిగే బాధ చెప్పనలవి కాదు. కన్నతల్లి కానరాక.. అన్న పానీయాలు కూడా మానేస్తారు. మనుషులే కాదు.. జంతువులకు కూడా ఇది వర్తిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఒక పెద్దపులి మూడు పిల్లలను కంది. ఆ తర్వాత అది రైతులు తమ పొలాల సంరక్షణ కోసం ఏర్పాటుచేసుకున్న కరెంటు కంచె తగిలి చనిపోయింది. దాంతో అప్పటివరకు తల్లి దగ్గరే అడవిలో పెరిగిన ఆ పులి పిల్లలకు ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు. మనుషులను నమ్మలేక.. బాటిళ్లలో ఇచ్చే పాలు తాగలేక రోజురోజుకూ అవి క్షీణించసాగాయి. వాటి ఆరోగ్యం కూడా బాగా ప్రమాదకరంగా మారడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కాలేదు. చివరకు వాళ్లలో ఒకరికి మంచి ఐడియా తట్టింది.
రోడ్డు పక్కన అచ్చం పులిలాగే ఉండే సాఫ్ట్ టాయ్స్ అమ్ముతుండటం గుర్తుకొచ్చి, అలాంటి బొమ్మ ఒకదాన్ని తీసుకొచ్చి ఆ పులిపిల్లలున్న చోట పెట్టారు. సాధారణంగా గ్రామాల్లో దూడలు చనిపోయినప్పుడు ఆవులు, గేదెలు పాలివ్వవు. అలాంటప్పుడు గ్రామస్తులు వాటి దగ్గరలో ఆ దూడ మృతదేహాన్ని నిలబెట్టడం లేదా బొమ్మ దూడలను ఉంచడం చేస్తారు. అప్పుడు అవి పాలిస్తాయి. ఆ విషయం తెలిసిన మృదుల్ పాఠక్ అనే ఫీల్డ్ డైరెక్టర్ అదే ఆలోచనను ఇక్కడ కూడా అమలుచేశారు. అధికారులు ఆ పులిపిల్లలను చూసేసరికి అవి దాదాపుగా మరణానికి దగ్గరగా ఉన్నాయి.
సాధారణంగా మనుషులకైతే వెంటనే సెలైన్ పెట్టడం లాంటి చర్యల ద్వారా వీలైనంత త్వరగా కోలుకునేలా చేస్తారు. కానీ జంతువుల విషయంలో అలా కుదరదు. వాటికి సూది గుచ్చిన వెంటనే విపరీతంగా భయపడతాయని, ఆ భయంతో వెంటనే చనిపోతాయని పాఠక్ వివరించారు. అందుకే వాటికి తప్పనిసరిగా నోటి ద్వారానే ఆహారం అందించాలన్నారు. దాంతో బొమ్మ పులి లోపల పాల బాటిళ్లను ఉంచి, బయటకు పాల తిత్తులు వచ్చేలా చేసి, వాటి ద్వారా ఆ పిల్లలకు పాలు అందించారు. నిజంగా అమ్మే పాలు పడుతోందని భావించిన ఆ పులిపిల్లలు.. పాలు తాగి ఎంచక్కా కోలుకున్నాయి, ఇప్పుడు చలాకీగా తిరుగుతున్నాయి.
Advertisement