అమర్-అక్బర్-ఆంటోనీ మళ్లీ పుట్టారు!
అమర్.. అక్బర్.. ఆంటోని.. అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి అద్దంపట్టిన వెండితెర దృశ్యరూపం. సినిమా విడుదలై, హిట్టై 39 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ ముగ్గురూ మరో రూపంలో పునర్జన్మ పొందారు. పులి కూనలుగా భూమి మీదకు పాదంమోపి, గురువారం నామకరణ మహోత్సవం జరుపుకొన్నారు.
మంగళూరు శివారులోని పిలికులా జాతీయ పార్కు పులలకు ఫేమస్. అక్కడి నేత్రావతి, విక్రమ్ అనే జంటకు మార్చిలో జన్మించిన కూనలే ఈ అమర్, అక్బర్, ఆంటోనీ, నిషాలు. నిధుల కొరతతో సతమతమవుతోన్న పార్క్ నిర్వాహకులు.. పులులను దత్తత తీసుకోవాల్సిందిగా(నిర్వహణా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా) చేసిన అభ్యర్థనలకు మంచి స్పందన లభించింది. అబుదాబికి చెందిన మిచెల్ డిసౌజా అనే వ్యక్తి నాలుగు పులి పిల్లల సంరక్షణార్థం ఏడాదికి రూ.5 లక్షల వితరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.
దీంతో పులి పిల్లలకు పేరుపెట్టే అవకాశం ఆయనకు లభించింది. బాలీవుడ్ హిట్ సినిమా అమర్- అక్బర్- ఆంటోనీ పేర్లను మూడు మగ పులి పిల్లలలకు, ఆడ పిల్లకేమో నిషా అని పేరు పెట్టాయన. ప్రస్తుతం పిలికులా పార్క్ లో 11 పులులు ఉన్నాయని, సంరక్షణా బాధ్యతలు స్వీకరించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు జూ డైరెక్టర్ హెచ్ జే భండారి. మీరూ pilikulazoo.com ను దర్శించి, ఏదేని జంతువునో, పక్షినో దత్తత తీసుకుని ఇష్టమైన పేరు పెట్టుకోండిమరి!