వీకెండ్‌కు వెళ్లి విషాదాంతం
మంగళూరు వద్ద రిసార్టులో దుర్ఘటన
మృతులు మైసూరువాసులు
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు యువతులు మృతిచెందిన సంఘటన మంగళూరు శివారులోని ఉచ్చిల బీచ్‌ను ఆనుకుని ఉండే వాజ్కో బీచ్ రిసార్ట్‌లో చోటుచేసుకుంది.
మైసూరుకు చెందిన ఎన్. నిశిత (21), పార్వతి (20), ఎండీ కీర్తన (21) మృతులు. వీకెండ్ కావడంతో వీరు శనివారం నాడు రిసార్ట్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికే నీట మునిగిపోయారు. యువతులకు ఈత రాకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు.
గంతులేస్తూ ఆడుతూనే..
మొదట అందరూ ఈత కొలనులో గంతులేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోతైన చోట నిశిత మునిగిపోవడంతో ఆమెను కాపాడాలని పార్వతి ముందుకు వెళ్లింది. ఇదంతా చూస్తున్న కీర్తన కూడా వెళ్లింది. ఇలా వరుసగా మునిగి చనిపోయారని కమిషనర్ చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలలో ఈ ఘోరం దృశ్యాలు నమోదయ్యాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మధ్యాహ్నం కల్లా చేరుకుని విగతజీవులుగా ఉన్న కూతుళ్లను చూసి పెద్ద పెట్టున రోదించారు. వేలకు వేల ఫీజులు వసూలు చేసి రిసార్టులు, హోటళ్లలో కనీస భద్రతా వసతులు లేవని, ఫలితమే ఈ ఘోరమని ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment