బోనులో పులి పిల్లలు.. చనిపోయిన పులికూన
సాక్షి, మైసూరు: మైసూరు జిల్లాలోని బండీపుర అరణ్యంలో తల్లి లేని మూడు పెద్ద పులి పిల్లల్లో రెండు మృత్యువాత పడిన విషాదం వెలుగుచూసింది. బండీపుర అభయారణ్యంలో సోమవారం గస్తీలోనున్న అటవీ సిబ్బందికి పొదల్లో సుమారు నెలన్నర వయసున్న మూడు పులి కూనలు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా వాటిలో ఒకటి చనిపోయినట్లు గుర్తించారు.
మరో రెండు తీవ్ర ఆకలితో మృత్యువుకు చేరువగా ఉన్నాయి. ఏ కారణం వల్లనో తల్లిపులి వాటిని వదిలేసి వెళ్లడంతో రోజుల తరబడి పాలు, పోషణ కరువైనట్లు అధికారులు తెలిపారు. జీవించి ఉన్న పులి కూనలను హుటాహుటిన మైసూరు జూకు తెస్తుండగా మరొకటి కూడా చనిపోయింది. బతికి ఉన్న ఏకైక కూనకు ఆహారం అందించి చికిత్స చేపట్టారు. చనిపోయినవాటికి పోస్టుమార్టం నిర్వహించగా ఆహారం లేకపోవడమే మృతికి కారణమని తేలిందని అధికారులు చెప్పారు. తల్లి పులి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
బావిలో పడ్డ పంగోలిన్
మరో ఘటనలో మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని చిక్కాడనహళ్ళి గ్రామంలో ఓ బావిలో అరుదైన పంగోలిన్ దర్శనమిచ్చింది. బావిలో పడిన అలుగు బయటకు రాలేకపోయింది. గ్రామస్తులు గమనించి దానిని బయటకు తీసి అటవీ సిబ్బందికి అప్పగించారు. సాధారణ పంగోలిన్‌లు బూడిద, నలుగు రంగులో ఉంటాయి. ఇది నారింజ రంగులో ఉండడం విశేషమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment