సాక్షి, తిరుపతి: ఇంట్లో సైతం పాదరక్షలు ధరించి తిరుగుతున్న ఈ రోజుల్లో.. ఆ ఊరి వాసులు ఎక్కడికి వెళ్లినా చెప్పులు ధరించరు. ఆకలేస్తే ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటున్న ప్రస్తుత తరంలో.. ఆ ఊరి వాళ్లు బయటి ప్రాంతాలకు వెళితే మంచినీళ్లు కూడా ముట్టరు. ఆచారాలు, సంప్రదాయాలకు విలువనిచ్చే ఆ గ్రామం పేరు ‘వేమన ఇండ్లు’. తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో ఉంది. వేమన ఇండ్లు గ్రామంలో ఉంటున్న వారంతా ‘పాలవేకరి’ కులస్తులుగా, దొరవార్లుగా చెప్పుకుంటున్నారు. వీరంతా బీసీ జాబితాలో ఉన్నారు. వీరి ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి. గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజుకో కుటుంబం పూజలు చేస్తుంది. గ్రామంలోని లక్ష్మీ నరసింహ
స్వామి, గంగమ్మను కూడా పూజిస్తారు.
విలువలు.. కట్టుబాట్లకు పెద్దపీట
ఈ ఊళ్లో ఉన్న అందరూ ఒకే వంశం వారు. తమ కులం వారితో మాత్రమే వీరు సంబంధాలు కలుపుకుంటున్నారు. వేమన ఇండ్లు గ్రామానికి ఎవరొచి్చనా.. ఊరి బయటే చెప్పులు విడిచి గ్రామంలోకి అడుగుపెట్టాలి. ఇంట్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా స్నానం చేయాల్సిందే. లేదంటే ఇంటి బయటే ఉండాలి. కలెక్టర్ అయినా గ్రామ ఆచార సంప్రదాయాలు పాటించాల్సిందేనని స్థానికులు తేల్చిచెబుతున్నారు. ఈ గ్రామస్తులు ఎన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్లినా చెప్పులు మాత్రం ధరించరు. శ్రీ వెంకటేశ్వరుడిపై భక్తితో పాదరక్షలు ధరించడం మానేశామని గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే వారు సైతం చెప్పులు లేకుండానే వెళ్లివస్తారు. ఒకరిద్దరు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారు కూడా గ్రామ ఆచార సంప్రదాయాలను తప్పక పాటిస్తున్నారు.
బయట తిండి ముట్టరు
వేమన ఇండ్లకు చెందిన వారు ఏదైనా పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే.. బయట తిండి ముట్టరు. మంచినీరు కూడా తీసుకోరు. ఇంటి నుంచే క్యారియర్లో భోజనం, బాటిల్లో మంచినీరు తీసుకెళ్తారు. విద్యార్థులు స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి నుంచి ఇంటికి వచ్చినా.. స్నానం చేసి బట్టలు మార్చుకోనిదే గడప తొక్కరు. అది కూడా చన్నీళ్ల స్నానమే. చిన్నారులైనా చన్నీటితోనే స్నానం చేయిస్తారు. బంధువులు ఇంటికి వచ్చినా.. గ్రామంలో ఈ ఆచార సంప్రదాయాలు పాటించాల్సిందే.
చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఆ వారం రోజులు మహిళలు ఊరి బయటే
నెలసరి మహిళల కోసం ఊరికి అవతల ప్రత్యేకంగా రెండు పక్కా గృహాలు నిర్మించారు. పీరియడ్స్ వచ్చిన మహిళలు వారం రోజులపాటు వాటిలోనే ఉండాలి. అప్పటివరకు ఇంటి యజమానే వంట వార్పు చేస్తారు. వంటచేసి భార్యకు తీసుకెళ్లి ఇచ్చి వచ్చేస్తారు.
ఆస్పత్రుల మొహం ముఖం చూడలేదు
గ్రామస్తులకు జబ్బు చేసినా.. చివరకు పాము కరచినా ఆస్పత్రికి వెళ్లరు. పాము కరిస్తే పుట్టచుట్టూ తిరిగితే నయం అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. గర్భిణులు సైతం ఆస్పత్రిలకు వెళ్లిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలోనూ వీరెవరూ ఆసుపత్రికి వెళ్లలేదు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని చెబుతున్నారు.
ఇప్పుడిప్పుడే పక్కా గృహాలొస్తున్నాయ్
నాలుగేళ్లుగా ఆ గ్రామస్తులకు రేషన్ సరఫరా చేస్తున్నాను. గతంలో ఈ ఊర్లో పక్కా గృహాలే లేవు. తడికలు ఏర్పాటు చేసుకుని దానిపై పట్టా కప్పుకుని జీవించేవారు. టీడీపీ హయాంలో ఒకే ఒక్క ఇల్లు మంజూరు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం 12 ఇల్లు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చింది. – బాబురెడ్డి, రేషన్ డీలర్
Comments
Please login to add a commentAdd a comment