తిరుపతి తుడా: తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రుల్లో ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు పాటిస్తున్నారని ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మిను బాజ్‌పాయ్ ప్రశంసించారు. ఆయన గురువారం టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆస్పత్రులను సందర్శించారు.
ముందు శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో కలిసి గుండెమార్పిడి అనంతరం చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు పలు వార్డుల్లో గుండె జబ్బులకు చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ తదితర కేంద్రాలను చూసి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం బర్డ్‌లో నిరుపేదలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి, ఆర్థో సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్సలను బర్డ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి..
డాక్టర్ బాజ్‌పాయ్‌కి వివరించారు. అనంతరం డాక్టర్ బాజ్‌పాయ్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆస్పత్రుల్లో నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, మోకీలు, తుంటిమార్పిడి, అత్యంత సంక్లిష్టమైన వెన్నుపూస ఆపరేషన్లు, గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆస్పత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నట్లు చెప్పారు.
పద్మావతి ఆస్పత్రిలో ఇప్పటివరకు 1,300కు పైగా గుండె సంబంధిత ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. దేశం నలుమూలలతో పాటు పక్క దేశం నుంచి కూడా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి చికిత్సకోసం వస్తుండడం గొప్ప విషయమన్నారు. తిరుమల శ్రీవారి అండదండలతోనే ఇంతటి ఘనత సాధ్యమైందని కొనియాడారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పేద, మధ్యతరగతి ప్రజలకు వరమని చెప్పారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద వైద్యరంగంలో కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తామని తెలిపారు. తమ బోర్డు ఆధ్వర్యంలో స్పెషలిస్టులను తయారు చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ అంశాల్లో వైద్యులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.
క్యాన్సర్ రోగుల కోసం వినియోగించే లీనియర్ యాక్సిలరేటర్ రూ.50 కోట్లు అవుతుందని, మన దేశంలో ఇలాంటివి వందల సంఖ్యలో కావాల్సి ఉందని తెలిపారు. ఇలాంటి ఖరీదైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసేందుకు మన డాక్టర్లకు శిక్షణ ఇప్పించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు చెప్పారు. బర్డ్ ఆస్పత్రిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సౌకర్యాలు ఉన్నాయన్నారు.
వైద్యరంగంలో నూతన పరికరాల తయారీ కోసం బర్డ్‌లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం దేశంలోని ఐదు ప్రముఖ ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవిలను ఆయన అభినందించారు. ఈఈ కృష్ణారెడ్డి, ఎస్పీసిహెచ్‌సీకి చెందిన డాక్టర్ గణపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment