టీడీపీ–జనసేన మధ్య ముదిరిన వివాదం
నాలుగు కుటుంబాలను గ్రామం నుంచి వెలివేసిన టీడీపీ నేతలు
వెలి వేస్తున్నట్లు మైక్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం
కొండెవరంలో ఇరువర్గాల బాహాబాహి
పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేటలో కలకలం
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ టీడీపీ ఆధ్వర్యాన గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద కేఎస్‌ఈజెడ్‌లో ఇటీవల ఒక కంపెనీ నిరి్మస్తున్న పైప్‌లైన్‌వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొందరు జనసేన నేతలు కంపెనీ వద్ద రూ.6 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు.
ఈ మేరకు గ్రామంలో గురువారం సమావేశం ఏర్పాటుచేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్నదొర, పల్లేటి దారకొండ, పల్లేటి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనుతో పాటు వారి కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆరుగురు వ్యక్తులు టీడీపీ నేతలపై దాడికి దిగగా ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారి తరఫున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే, దాడిచేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో కోనపాపపేటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించినట్లు గ్రామస్తుల పేరుతో శుక్రవారం మైక్‌లో ప్రచారం చేశారు. అలాగే, వారి ఫొటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటుచేశారు. ఈ నాలుగు కుటుంబాల వారితో ఎవరైనా మాట్లాడినా, వారికి సహకరించినా, వారి దుకాణాల వద్ద ఏ విధమైన వస్తువులు కొన్నా, వారికి చేపలు అమ్మినా, కొన్నా రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు బహిరంగంగా ప్రచారం చేశారు.
విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలుపుదల చేశారు. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు అధికారులకు ఫిర్యాదు చేయగా.. తమపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టుచేయాలని టీడీపీ నేతలూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో కొత్తపల్లి పోలీసులు గ్రామంలో పహారా ఏర్పాటు చేశారు.
కొండెవరంలో టీడీపీ–జనసేన కుమ్ములాట..
మరోవైపు.. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో టీడీపీ–జనసేన నేతలు శుక్రవారం కుమ్ములాటలకు దిగారు. గ్రామంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలూ తనకు తెలియడంలేదని, ప్రొటోకాల్ పాటించడంలేదని టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు దుళ్ల సత్తిబాబు ఇటీవల ఎంపీడీవో రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీఓ శుక్రవారం కొండెవరం గ్రామ సచివాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. దీనికి ఎంపీటీసీ సభ్యుడ్ని ఆహ్వానించగా.. ఆయన టీడీపీ నేతలను వెంటబెట్టుకుని సచివాలయానికి వెళ్లారు.
విషయం తెలుసుకున్న జనసేన నేతలూ గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో మీకు పనేంటి.. వెంటనే వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీచేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇరువర్గాలనూ అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సంఘటనపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment