ఆఫ్రికాలోని పెద్ద సరస్సులో ఒకటైన నొకోవే సరస్సు దయ్యాల సరస్సుగా పేరుమోసింది. అయినా కొందరు ఆ సరస్సు నడిబొడ్డున తేలియాడే ఊరును నిర్మించుకున్నారు. ఈ ఊరి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశమైన బెనిన్‌లో ఉంది ఈ ఊరు. దీని పేరు గాన్వీ. నాలుగు శతాబ్దాల కిందట యూరోప్ నుంచి వివిధ దేశాల వలస వర్తకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండేవారు. ప్రస్తుతం బెనిన్‌గా పిలుచుకుంటున్న దేశంలో అప్పట్లో ఫోన్, దహోమి రాజ్యాలు ఉండేవి. ఈ రెండు రాజ్యాల సైన్యాల్లోనూ చాలా క్రూరులైన సైనికులు ఉండేవారు.
వారు ఇక్కడి టొఫిను తెగకు చెందిన వారిని బందీలుగా పట్టుకుని, ఇక్కడకు వర్తకం కోసం వచ్చే పోర్చుగీసు వారికి బానిసలుగా అమ్మేసి, వారు తమ దేశం నుంచి తీసుకువచ్చే వస్తువులను ప్రతిఫలంగా తీసుకునేవారు. అయితే, ఫోన్, దహోమీ రాజ్యాల్లో నొకోవే సరస్సు దయ్యాల సరస్సు అనే నమ్మకం ఉండేది. సైనికులకు చిక్కకుండా తప్పించుకోవడానికి ఈ సరస్సు ఒక్కటే తగిన ప్రదేశమని నిర్ణయించుకున్న టొఫిను తెగ ప్రజలు చెక్క తెప్పలపై గుడారాలను నిర్మించుకుని, సరస్సులోనే నివసించడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ సరస్సలోనే వారు తేలియాడే ఇళ్లను నిర్మించుకున్నారు.
జనాభా పెరగడంతో సరస్సులో ఏకంగా తేలియాడే ఊరు తయారైంది. కాలం తెచ్చిన మార్పుల్లో ఫోన్, దహోమి రాజ్యాలు అంతరించాయి. తర్వాతికాలంలో ఇక్కడ అధికారం చలాయించిన ఫ్రెంచ్ పాలన కూడా అంతరించింది. ఈ ప్రాంతం ‘బెనిన్’ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినా అప్పట్లో ఇక్కడ స్థిరపడిన టొఫిను తెగ ప్రజలు తిరిగి నేల మీదకు రాకుండా, ఈ సరస్సులోని ఊరినే తమ శాశ్వత నివాసంగా చేసుకుని, తరతరాలుగా కొనసాగు తున్నారు.
(చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!)
Comments
Please login to add a commentAdd a comment