సాగరానికి చేరువలో నీటి మధ్య కొలువైన అద్భుతం.. వెనిస్ నగరం. ఆ ఊరు పేరు చెప్పగానే ఎటుచూసినా నీరు.. మధ్యలో అందమైన భవనాలు.. వంతెనలు.. పడవ ప్రయాణాలు.. కళ్లల్లో మెదులుతాయి. అయితే అలాంటి హంగులేవీ లేని వెనిస్ గురించి ఎప్పుడైనా విన్నారా? చీకటి ఖండం ఆఫ్రికాలో ఉంది ఆ ఊరు. పేరు.. గాన్వీ.
నీటిపై తేలియాడే ప్రాంతాలు నిజంగా అద్భుతాలు. అలాంటి అద్భుతాల్లో ఒకటే గాన్వీ. వెనిస్ అంత కాకపోయినా ఈ ఊరూ పర్యాటకానికి వరల్డ్ ఫేమస్సే. కారణం..
నీటి అందాలతో పాటు ఈ ఊరికి ఉన్న చారిత్రక నేపథ్యం. ఇది పశ్చిమ ఆఫ్రికా, బెనిన్ ప్రాంతంలోని నోకోయూ సరస్సు మధ్యలో ఉంటుంది. బానిసత్వం రాజ్యమేలిన కాలంలోనే గాన్వీ వెలిసిందని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట టోఫిన్ గ్రామ ప్రజలు.. ఫోన్‌తెగ పోరాటయోధులకు భీతిల్లి ఇలా నీటి మధ్యలో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్‌తెగ వాళ్లు తమను బానిసలుగా అప్పజెప్తారనే భయంతోనే టోఫిను ప్రజలు పారిపోయారు. అలా సరస్సు మధ్యలో వెలిసిన ఆ ఊరు.. ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. గాన్వీ అంటే వాళ్ల భాషలో ‘బతికి బట్టకట్టాం’ అని అర్థం.
అందుకే ఆ పేరొచ్చింది
గాన్వీ జనాభా ముప్పై వేలకు పైనే. వీళ్లు సరస్సు మధ్యలో గట్ల వెంట ఆరడుగుల కంటే ఎత్తులో వెదురు బొంగులు, చెక్కలతో ఇళ్లు నిర్మించుకున్నారు. మూడు వేలకు పైగా భవనాలు నీటి మధ్యలోనే ఉంటాయి. అందులో రెండు బడులు, ఓ బ్యాంకు, ఓ పోస్టాఫీస్, ఇంకా ప్రార్థన మందిరాలు ఉన్నాయి. నీటి ఆవాసం కారణంగా వీళ్లను ‘నీటి మనుషులు’(వాటర్ మెన్) అని వ్యవహరిస్తుంటారు. ఊరిలో తిరగడానికి ఏకైక మార్గం.. చిన్నపడవలు. అందుకే గాన్వీకి ‘వెనిస్ ఆఫ్ ఆఫ్రికా’ అనే పేరొచ్చింది. కోళ్లను ఎక్కువగా తినే గాన్వీ ప్రజలు.. తాటాకులతో, గడ్డిపోచలతో చేపలనూ వేటాడి తింటారు. ఒకప్పుడు చేపలు పట్టడమే ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. కానీ ఇప్పుడు దాన్ని పక్కనపెట్టి.. టూరిస్ట్ గైడ్స్‌గా మారిపోతున్నారు. రీజన్.. టూరిస్టులు క్యూ కడుతుండడమే.
సోలార్ ప్యానెల్స్, జనరేటర్స్, సరస్సు నీటితో కరెంట్ అందుతోంది ఈ ఊరికి. పడవల మీదే తిరుగుతూ కూరగాయలు, నిత్యావసరాలు అమ్ముతుంటారు. 1996లో గాన్వీ.. వెనిస్ ఆఫ్ ఆఫ్రికాకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే స్ట్రీమింగ్‌లోకి వచ్చిన డాక్యుసిరీస్ ‘హై ఆన్ ది హోగ్: హౌ ఆఫ్రికన్ అమెరికన్ కజిన్ ట్రా¯Œ్సఫార్మ్‌డ్ అమెరికా’లో గాన్వీ గురించీ ఉంటుంది. రణగొణ ధ్వనులకు దూరంగా.. రాకపోకలకు బాటలుగా పిల్ల కాలువలున్నాయి. అందుకే కాలుష్యం ఈ నగరానికి ఆవలే ఉండిపోయింది. ఓవైపు వరదలు పోటెత్తుతున్నా.. మరోవైపు పర్యాటకులతో కిటకిటలాడుతోంది గాన్వీ. అందుకు కారణం.. మనసుకు సాంత్వననిచ్చే ప్రాంతం కావడమే.
మొసలి రాజు?
ఈ ఊరికి ఓ నేపథ్య కథ కూడా ప్రచారంలో ఉంది. బానిసత్వమంటే టోఫిన్ ప్రజలు భయపడుతున్న సమయంలో.. గాన్వీ రాజు ఒక కొంగగా మారి సురక్షితమైన ప్రదేశం కోసం గాలించాడు. ఆ తర్వాత నోకోయూ సరస్సును సురక్షితమైన ప్రాంతంగా గుర్తించి వాళ్లను అక్కడికి వెళ్లమని సూచించాడు. అయితే తమ వస్తువులతో అక్కడికి వెళ్లడం కష్టంగా మారడంతో.. భారీ మొసలిగా మారిన ఆ రాజు తన వీపుపై వాళ్లందరినీ మోసుకుంటూ వెళ్లాడట. తీరా ఆ సరస్సులో శాపగ్రస్త ఆత్మలు ఉన్నాయనే భయంతో నది నీటిని తాకకూడదనే ఉద్దేశంతో కాస్త ఎత్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆ కథ సారాంశం. అయితే గాన్వీ నేటి తరం మాత్రం అలాంటి నమ్మకాలేవీ లేకుండా.. మొసళ్లు లేని ఆ సరస్సులో హాయిగా జీవిస్తోంది. -భాస్కర్ శ్రీపతి
Comments
Please login to add a commentAdd a comment