Benin
-
దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు!
ఆఫ్రికాలోని పెద్ద సరస్సులో ఒకటైన నొకోవే సరస్సు దయ్యాల సరస్సుగా పేరుమోసింది. అయినా కొందరు ఆ సరస్సు నడిబొడ్డున తేలియాడే ఊరును నిర్మించుకున్నారు. ఈ ఊరి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశమైన బెనిన్‌లో ఉంది ఈ ఊరు. దీని పేరు గాన్వీ. నాలుగు శతాబ్దాల కిందట యూరోప్ నుంచి వివిధ దేశాల వలస వర్తకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండేవారు. ప్రస్తుతం బెనిన్‌గా పిలుచుకుంటున్న దేశంలో అప్పట్లో ఫోన్, దహోమి రాజ్యాలు ఉండేవి. ఈ రెండు రాజ్యాల సైన్యాల్లోనూ చాలా క్రూరులైన సైనికులు ఉండేవారు. వారు ఇక్కడి టొఫిను తెగకు చెందిన వారిని బందీలుగా పట్టుకుని, ఇక్కడకు వర్తకం కోసం వచ్చే పోర్చుగీసు వారికి బానిసలుగా అమ్మేసి, వారు తమ దేశం నుంచి తీసుకువచ్చే వస్తువులను ప్రతిఫలంగా తీసుకునేవారు. అయితే, ఫోన్, దహోమీ రాజ్యాల్లో నొకోవే సరస్సు దయ్యాల సరస్సు అనే నమ్మకం ఉండేది. సైనికులకు చిక్కకుండా తప్పించుకోవడానికి ఈ సరస్సు ఒక్కటే తగిన ప్రదేశమని నిర్ణయించుకున్న టొఫిను తెగ ప్రజలు చెక్క తెప్పలపై గుడారాలను నిర్మించుకుని, సరస్సులోనే నివసించడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ సరస్సలోనే వారు తేలియాడే ఇళ్లను నిర్మించుకున్నారు. జనాభా పెరగడంతో సరస్సులో ఏకంగా తేలియాడే ఊరు తయారైంది. కాలం తెచ్చిన మార్పుల్లో ఫోన్, దహోమి రాజ్యాలు అంతరించాయి. తర్వాతికాలంలో ఇక్కడ అధికారం చలాయించిన ఫ్రెంచ్ పాలన కూడా అంతరించింది. ఈ ప్రాంతం ‘బెనిన్’ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినా అప్పట్లో ఇక్కడ స్థిరపడిన టొఫిను తెగ ప్రజలు తిరిగి నేల మీదకు రాకుండా, ఈ సరస్సులోని ఊరినే తమ శాశ్వత నివాసంగా చేసుకుని, తరతరాలుగా కొనసాగు తున్నారు. (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
పీడ తక్కువ పిశాచాల్లాంటి... కీడు తక్కువ క్యాన్సర్లివి!
Benign Cancer Malignant What Are The Differences Must Known Facts: క్యాన్సర్ అన్న మాట వింటేనే భయం. ఆ పదంతోనే వణుకు. కానీ కొన్ని క్యాన్సర్ల తీవ్రత తక్కువ. ఎలాగంటే... క్యాన్సర్ ఒక భూతం అనుకుంటే... ఈ భూతాల కీడు మోతాదు కాస్త తక్కువ. క్యాన్సర్ ఓ దెయ్యం అనుకుంటే... ఈ దెయ్యాల దయా గుణం ఒకింత ఎక్కువ. క్యాన్సర్ ఓ పిశాచమనుకుంటే ఈ పిశాచాలు పీడ తక్కువగా ఉండే పిల్ల పిశాచాలనుకోవచ్చు. ఇవి తెచ్చే అనర్థాలు చాలా దీర్ఘకాలానికి గాని రావు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మందకొడి క్యాన్సర్లతో పోలిస్తే దీర్ఘకాలంలో డయాబెటిస్ తెచ్చే ముప్పే ఎక్కువన్నమాట. అలాంటి మొద్దుక్యాన్సర్ల గురించి తెలుసుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం. అన్ని గడ్డలూ క్యాన్సర్లు కావన్నది తెలిసిందే. హానికరం కాని గడ్డలను ‘బినైన్’ అని అంటారు. అలాగే హానికరమైనవాటిని ‘మెలిగ్నెంట్’ అని చెబుతారు. ఈ రెంటికీ మధ్య... అంతగా హానికరం కాని క్యాన్సర్లను ఒక రకంగా ‘బార్డర్ లైన్ క్యాన్సర్స్’ అనుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం. కార్సినాయిడ్ ట్యూమర్స్ : వీటినే ‘న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్’ అనవచ్చు. ఇవి చాలా చాలా అరుదు. లక్షమంది జనాభాల్లో ఏ ముగ్గురూ లేదా నలుగురిలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఇవి ఎండోక్రైన్ గ్రంథులు... అంటే హార్మోన్లు పుట్టి, స్రవించే అవయవాలైన పాంక్రియాస్, గ్యాస్రోఇంటస్టినల్ ట్రాక్ట్, టెస్టిస్, ఓవరీస్ లాంటి వాటిల్లో ఆవిర్భవిస్తాయి. వీటి సైజూ తక్కువే, పెరుగుదల రేటూ తక్కువే. ఈ క్యాన్సర్లెంత బద్దకమైనవంటే...కొన్ని సందర్భాల్లో... అవి పుట్టి, లక్షణాలు కనిపించే నాటికి కొన్ని దశాబ్దాలే దొర్లిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయా అవయవాల నుంచి స్రవించే స్రావాల (ఉదాహరణకు సెరటోనిన్, బ్రాడీకైనిన్, హిస్టమైన్, ప్రోస్టాగ్లాండిన్ వంటి వాటి) మోతాదులు చాలా ఎక్కువగా ఉండటంతో... మోతాదుకు మించి స్రవించినందున కనిపించే లక్షణాల కారణంగా అసలు సమస్య కనిపించవపోవచ్చు. నిజానికి సమస్య క్యాన్సరా లేక మరొకటా అనే అయోమయం నెలకొనవచ్చు. అందుకే ఈ అనిశ్చితి కారణంగా సమస్యకు ‘‘కార్సినాయిడ్ సిండ్రోమ్’’ అని పేరు. ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా వీటి నిర్ధారణ చేయవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘డోటా’ న్యాక్ స్కాన్’ ఇలాంటి క్యాన్సర్లను ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సీరమ్ క్రోమోగ్నానిన్ వంటి కొన్ని రక్తపరీక్షలూ, 24 గంటల మూత్రపరీక్షతో పాటు బయాప్సీ కూడా నిర్ధారణకు ఉపయోగపడే పరీక్షలు. అరికట్టడానికి సూచనలు : ఆహారంలో నియాసిన్ (విటమిన్ బి3) ఎక్కువగా ఉండే పదార్థాలు (ఉదాహరణకు కాలేయం, చికెన్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలతో పాటు శాకాహారంలో వేయించిన పల్లీలు, నువ్వులు, బార్లీ, గోధుమరవ్వ మొ.) ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కార్సినాయిడ్ సమస్య లక్షణాల తీవ్రతను తగ్గించడంతో పాటు... పెలెగ్రా, నీళ్ల విరేచనాలు వంటి ఇతర సమస్యల నియంత్రణకూ కొంత తోడ్పడతాయి. క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా (సీఎల్ఎల్) : ఇదో రకం బ్లడ్‌క్యాన్సర్. ఎముకల మజ్జ/మూలగ భాగాల్లో తెల్లరక్తకణాల్లో ఒకటైన లింఫోసైట్స్ కూడా తయారవుతాయి. ఈ క్యాన్సర్‌ను చాలా మందకొడి అనీ స్టేజ్ జీరో అని చెబుతారు. తొలిదశల్లో లక్షణాలు దాదాపుగా కనపడవు. ఆ తర్వాత లింఫ్‌నోడ్స్ వాపు, తీవ్రమైన అలసట, జ్వరం, రాత్రివేళల్లో చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి నిర్దిష్టంగా ఫలానా అని చెప్పడానికి వీల్లేనివి కావడంతో సమస్య తెలియదు. ఏళ్లూపూళ్లూ గడిచాక... అతి నెమ్మదిగా గానీ అసలు లక్షణాలు కనిపించవు. ఫిల్లోడ్ ట్యూమర్స్ : గ్రీక్‌లో ఫిల్లో... అంటే ఆకు అని అర్థం. ఇవి మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్లలో ఒక రకం. మధ్యవయసు కు చేరిన మహిళల్లో తప్ప... యువతుల్లో ఒకింత తక్కువే. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని వారాల్లోని చేతికి తగిలేలా/స్పర్శకు తెలిసేలా పెరుగతాయి. ఇవి ఎంతగా హాని చేయనివి అని చెప్పవచ్చంటే... అలా పెరిగిన వాటిని శస్త్రచికిత్సతో తొలగిస్తే చాలు. పూర్తిగా నయమైపోతాయి. కీమో/రేడియేషన్ వంటి చికిత్సలూ అక్కర్లేదు. బోర్డర్‌లైన్ ఒవేరియన్ క్యాన్సర్లు : వైద్యపరిభాషలోనే వీటిని అత్యంత తక్కువ హానికరమైన క్యాన్సర్లు (లో మేలిగ్నెంట్ పొటెన్షియల్ ట్యూమర్స్)గా చెబుతారు. అల్ట్రాసౌండ్ లేదా సీటీ స్కాన్ చేసినప్పుడు ఇవి ఎపిథీలియల్ ఒవేరియన్ క్యాన్సర్లలాగా కనిపిస్తాయి. మామూలు ఇతర క్యాన్సర్ గడ్డలకు శస్త్రచికిత్స తర్వాత కీమో కావాలగానీ... వీటికి కేవలం సర్జరీ చాలు. ఆ తర్వాత వీటి ఊసే కనిపించకుండా పోతాయి. సూడో మిక్సోమా పెరిటోనీ : ఇది కడుపులో చాలా నెమ్మదిగా పెరిగే ‘మ్యూకస్’ను స్రవించే గడ్డ. దీన్ని నయం చేయడం ఒకింత కష్టం. కానీ ఇదెంత నెమ్మదిగా పెరుగుతుందంటే... దాన్నసలు గుర్తించడానికే చాలా చాలా సమయం పడుతుంది. లో–గ్రేడ్ లింఫోమాస్ : కొన్నింటిని మినహాయిస్తే... ఈ రకాలకు చికిత్స కూడా అవసరం లేకుండా అలా గమనిస్తూ ఉంటే చాలు. కాస్తంత మంచి వ్యాధి నిరోధకత ఉన్నవాళ్లలో ఇవి ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే పూర్తిగా లొంగి ఉంటాయి. ఎందుకు తెలుసుకోవాలంటే... ఇవి ఒకింత అరుదైనవే. చాలా తక్కువ మందిలోనే కనిపించేవే. అయితే వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న... మనకు చాలా మేలైన సమాధానం ఇస్తుంది. కణాల్లోని ఏ జన్యు పదార్థాలు, వీటిని వేగంగా పెరగకుండా చేస్తున్నాయి?... ఏ డీఎన్ఏ అంశాలు... వీటిని హానికారకాలు కాకుండా చూస్తున్నాయి? ఎందుకు చికిత్స కూడా అవసరం లేనివిగా ఉంటున్నాయి? (చికిత్స అందిస్తే ఒక్కోసారి వాటి కంటే కూడా ఆ చికిత్స కారణంగా కనిపించే దుష్ప్రభావాల వల్లనే నష్టాలు ఎక్కువన్నమాట)... ప్రస్తుతం క్యాన్సర్ పరిశోధకులు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఆ సమాధానాలు తెలుసుకుంటే వాటిని... హానికరమైన క్యాన్సర్లకూ అనువర్తింపజేసి... చికిత్సలు కనుగొనేందుకు ఆస్కారముందా అన్న దిశలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీటికీ చికిత్స చేస్తుంటారు. కాకపోతే అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్టులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆధ్వర్యంలో... చికిత్స కంటే దుష్ప్రభావాల తీవ్రత పెరగకుండే రీతిలో వాటికి చికిత్సలు నిర్వహిస్తుంటారన్నమాట. -డాక్టర్ సురేశ్ ఏవీఎస్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. -
బెనిన్ వందపూల వికాసం!
ఫ్రాన్స్ అధీనంలో ఉన్న బెనిన్‌ను 1975 వరకు ‘దహేమీ’ అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ దేశం బానిసల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బానిసలను కొనడానికి ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రాంతానికి సంపన్నులు వచ్చేవారు. 1960లో ఫ్రాన్సు నుండి బెనిన్‌కు స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్రం మాట ఎలా ఉన్నా... 1972 వరకు బెనిన్ అంతర్యుద్ధాలతో అల్లాడిపోయింది. మార్క్సిస్ట్-లెనినిస్ట్ పాలకుల పాలనలో 1975లో బెనిన్ ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బెనిన్’గా అవతరించింది. 1990 మార్చి 1న ‘రిపబ్లిక్ ఆఫ్ బెనిన్’గా మారింది. పశ్చిమ ఆఫ్రికాలోని ఈ చిన్న దేశం ప్రకృతి పరంగా చెప్పుకోవాలంటే పెద్దది, విశిష్టమైనది. నోకా, పోరోటనోవో లాంటి గొప్ప సరస్సులు ఈ దేశంలో ఉన్నాయి. ఈ సరస్సులకు ఉత్తర భాగంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. దేశానికి ఉత్తర భాగంలో అటకోరా పర్వతాలు, పచ్చని గడ్డితో ఉన్న సవన్నా పీఠభూములు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 12 భాగాలుగా విభజించారు. వీటిని డిపార్ట్మెంట్లు అంటారు. ఈ డిపార్ట్మెంట్లను మళ్లీ 77 కమ్యూన్లుగా విభజించారు. 42 ఆఫ్రికన్ తెగల ప్రజలు ఈ దేశంలో నివసిస్తున్నారు. ప్రజల్లో దాదాపు 50 శాతం ఫ్రెంచ్ భాషనే మాట్లాడతారు. బెనిన్ దేశ రాజధాని పోర్టోనోవోను ‘హాగ్‌బోనోవ్’ అని కూడా పిలుస్తారు. పోర్టోనోవో మ్యూజియంలో రాజుల వస్తువులు, దుస్తులు, కళాకృతులు ఉన్నాయి. టోఫా రాజభవంతి ప్రత్యేక ఆకర్షణ. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రకృతి అందాల వల్ల ఈ దేశానికి వచ్చే పర్యాటకులు ఎక్కువే. పెండ్జారీ నదీ తీరంలో ఉన్న ‘పెండ్జారీ జాతీయపార్క్’ సహజమైన పార్క్‌గా పేరు పొందింది. ఈ పార్క్‌లో అనేక రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఏనుగులు 800 వరకు ఉన్నాయి. అడవి దున్నలు, కోతులు మొదలైనవి వేలసంఖ్యలో ఉన్నాయి. బెనిన్లోని అబోమీ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నగరం చుట్టూ మట్టిగోడ కట్టి ఉంటుంది. ఈ మట్టి గోడకు ఆరుచోట్ల ఆరు ద్వారాలు ఉన్నాయి. ఎన్నో రాజభవనాలు ఉన్న ఈ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. బెనిన్‌కు బలమైన సంప్రదాయ మౌఖిక సాహిత్య సంపద ఉంది. ఫ్రెంచ్ భాష ఆధిపత్యం ఉన్నప్పటికీ మౌఖిక సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నాయి. వలస పాలన, అంతర్యుద్ధాల ప్రభావంతో బెనిన్ ఇంకా అభివృద్ధి చెందని దేశాల జాబితాలోనే ఉంది. దేశంలో అత్యధికులు నేటికీ దారిద్య్రరేఖకు దిగువనే నివసిస్తున్నారు. టాప్ 10 1. బెనిన్‌లో వివిధ వ్యాపారాలలో భారతీయులు ప్రముఖ స్థానంలో ఉన్నారు. 2. మనషులను బలి ఇచ్చే సంప్రదాయం ఒకప్పుడు దేశంలో బలంగా ఉండేది. 3. బెనిన్ దేశపటం ఐస్‌క్రీమ్ కోన్ ఆకారంలో ఉంటుంది. 4. కోటోనోవ్ దేశంలో అతి పెద్ద నగరం. బెనిన్‌కి ఆర్థిక రాజధాని. 5. బెనిన్‌లో పొడవైన నది వ్యోమె. 6. బెనిన్‌లో పాపులర్ క్రీడ ఫుట్‌బాల్. 7. ఈ దేశ జాతీయపతాకంలోని ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులలో ఆకుపచ్చరంగు ఆశావాహదృక్పథాన్ని, ఎరుపు పూర్వీకుల ధైర్యసాహసాలను, పసువు రంగు సాంస్కృతిక సౌభాగ్యాన్ని సూచిస్తాయి. 8. బెనిన్‌లో ఎక్కువమంది రైతులే. 9. దేశంలో అక్షరాస్యత 42.4 శాతం. 10. జంతువులు, ఆత్మలను ఆరాధించే సంస్కృతి ప్రజల్లో ఎక్కువగా ఉంది. దేశం బెనిన్ ఫ్రాన్సు నుంచి స్వాతంత్య్రం 1 ఆగస్ట్ 1960 రాజధాని పోర్టో-నోవో అధికార భాష ఫ్రెంచ్ కరెన్సీ సీఎఫ్ఏ ఫ్రాంక్ జనాభా కోటి 8 లక్షల 79 వేల 829 (సుమారుగా) -
బెనిన్
ప్రపంచవీక్షణం చూడదగిన ప్రదేశాలు బెనిన్ దేశంలో పర్యాటక పరిశ్రమ పెద్దగా అభివృద్ధి చెందలేదు. అయినప్పటికీ, ప్రకృతి రమణీయత వల్ల ప్రతి ఏటా దాదాపు లక్షా ఏభై వేల పర్యాటకులు వస్తూ ఉంటారు. అబోమీ, రాజధాని పోర్టోనోవో, పెండ్‌జారి జాతీయ పార్కు, డబ్ల్యు జాతీయ పార్కు, కొటోనోవ్ నగరం చూడదగ్గ ప్రదేశాలు. నైసర్గిక స్వరూపం వైశాల్యం: 1,14,763 చదరపు కిలోమీటర్లు జనాభా: 1,03,23,000 ప్రభుత్వం: ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ రాజధాని: పోర్టో-నోవో కరెన్సీ: సిఎఫ్ఎ ఫ్రాంక్ భాషలు: అధికారిక భాష - ఫ్రెంచ్, ఫాన్, యోరుబా, ఇతర ఆఫ్రికా భాషలు మతం: 70% అనిమిస్ట్, 15% క్రైస్తవ , 13% ముస్లిములు వాతావరణం: ఆగస్ట్‌లో 23 డిగ్రీలు, మార్చిలో 28 డిగ్రీలు పంటలు: కస్సావా, యామ్స్, మొక్కజొన్న, గోధుమ, కాఫీ, పత్తి, పామ్, వేరుశనగ, చిలగడదుంపలు పరిశ్రమలు: వ్యవసాయాధారిత పరిశ్రమలు, పామ్ ఆయిల్, దుస్తులు, కాటన్ జిన్నింగ్, కోకో సరిహద్దులు: నైగర్, బుర్కినా, టోగో, నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం: 1960, ఆగష్టు 1. పరిపాలనా పద్ధతులు: పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 12 భాగాలుగా విభజించారు. ఈ విభాగాలను డిపార్టుమెంట్లు అంటారు. ఈ డిపార్టుమెంట్లు తిరిగి 77 కమ్యూన్లుగా విభజింపబడ్డాయి. పన్నెండు డిపార్టుమెంట్లు ఇవి - అలిచోరి, అటకోరా, అట్లాంటిక్, బోర్గు, కోలిన్స్, డోంగో, కౌఫో, లిట్టోరల్, మోనో, ఓవుమి, ప్లాటూ, జోవ్. బెనిన్ దేశంలో ప్రజలు ఎక్కువగా దేశపు దక్షిణ భాగంలోనే నివసిస్తారు. జనాభాలో అత్యధిక శాతం యువత ఉంది. దాదాపు 42 ఆఫ్రికన్ తెగలు ఈ దేశంలోనే ఉన్నాయి. యోరుబా, డెండి, బారిబా, ఫులా, బేటమ్మా రిబే, సోంబా, ఫాన్, అబోమీ, మీనా, జూడా, అజా తెగలు దేశంలో ప్రముఖమైనవి. ఈ దేశంలో భారతీయులు కూడా వివిధ వ్యాపార రంగాలలో ఉన్నారు. పోర్టో-నోవో: బెనిన్ దేశానికి పోర్టోనోవో రాజధాని. ఈ నగరాన్ని హాగ్‌బోనోవ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ దహోమీకి రాజధానిగా ఉండేది. ఈ నగరం ఒక డిపార్టుమెంటు, మరియు కమ్యూన్‌గా ఉంది. దీని వైశాల్యం 110 చదరపు కిలోమీటర్లు. ఈ నగరంలోనే శాసనసభ ఉంది. ఈ నగర పరిసరాలలో పామ్ ఆయిల్ తోటలు, పత్తి పంటలు ఎక్కువ. ఈ నగరంలో పోర్టోనోవో మ్యూజియం ఉంది. ఇందులో గత కాలపు రాజులు ఉపయోగించిన అనేక వస్తువులు, దుస్తులు ఉన్నాయి. టోఫా రాజ భవనం కూడా ఇక్కడ ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.ఈ ప్రాంతపు మొట్టమొదటి రాజు విగ్రహం ఈ నగరంలో ఉంది. గవర్నర్ రాజభవనం ఒక విశాలమైన భవనం. ప్రస్తుతం ఈ భవనమే శాసనసభా భవనంగా ఉపయోగపడుతోంది. పోర్టోనోవో మసీదు మరో చూడదగిన పెద్ద భవనం. ప్రజలు - సంస్కృతి- ఆహారం యువతీ యువకులు పాశ్చాత్యశైలి దుస్తులు ధరిస్తారు. గ్రామీణ ప్రాంత మహిళలు షర్టు, స్కర్టు ధరిస్తారు. తలకు టోపీ లాంటిది పెట్టుకుంటారు. కుటుంబంలో మహిళలకు ప్రాముఖ్యత ఇస్తారు. వీరు వ్యవసాయ పనుల్లో ముందుంటారు. మార్కెట్లు, షాపులను బాగా నడుపుతారు. వివాహ సమయంలో వధువు ప్రత్యేకమైన దుస్తులు తొడుక్కోవడంతోపాటు రకరకాల పూసల దండలను మెడలోనూ, తలకు ధరిస్తారు. పట్టణాలలో నివసించేవారు ప్యాంటు, షర్టు ధరిస్తారు. దేశంలో తీరప్రాంతాల ప్రజలు జలచరాలను ముఖ్యంగా రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలను ఇష్టంగా తింటారు. ఇతర ప్రాంతాలలో మొక్కజొన్నపిండి, టమోటారసం, పామోలిన్ నూనె ఎక్కువగా వాడుతారు. కొన్నిప్రాంతాలలో వరి అన్నం కూడా తింటారు. నారింజ, అరటి, అనాస పళ్లు తింటారు. ఆవుపాలతో చేసిన పదార్థాన్ని వాగాసి అంటారు. ఇంకా అలోకో, ఫు-ఫు, గర్రె, మోమో అమివో, అక్పాన్, అకస్సా పేర్లు గలిగిన ఆహారాన్ని తింటారు. చేకాచి అనే పేరుగల మిల్లెట్ బీరు తాగుతారు. కొటోనోవ్ నగరం: ఇది బెనిన్ దేశంలో అతి పెద్ద నగరం. నగరంలో దాదాపు 8 లక్షల జనాభా ఉంది. ఇది అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ ఓడరేవు కూడా ఉంది. ఈ నగరం ఆర్థిక రాజధానిగా ఉండడం వల్ల ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. దేశం మొత్తానికి ఇదే పెద్ద ఓడరేవు పట్టణం. ఎగుమతులు, దిగుమతులు అన్నీ ఇక్కడి నుండే జరుగుతాయి. ఈ నగరంలో ఫ్రెండ్షిప్ స్టేడియం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇంకా కొటోనోవ్ కాథెడ్రల్, కొటోనోవ్ సెంట్రల్ మాస్క్, పురాతన బెనిన్ జాతీయ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణ - మోటారు సైకిల్ టాక్సీలు లభించడం. పూర్వం ఈ నగరాన్ని దమోమీ రాజులు పరిపాలించారు. 1851లో ఫ్రెంచ్‌వాళ్లు దీనిని ఆక్రమించారు. పెండ్‌జారి జాతీయ పార్కు: ఈ జాతీయ పార్కు దేశానికి ఉత్తర- పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది పెండ్ జారీ నది తీరంలో ఉండడం వల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో కొండలు, కోనలు, రాతి పర్వతాలు ఉన్నాయి. ఎంతో సహజమైన పార్కుగా ఇది పేరు గాంచింది. ఈ పార్కులో అనేక రకాల జంతుజాలాలు ఉన్నాయి. సవన్నా గడ్డి మైదానాలు కూడా ఈ పార్కులో ఉన్నాయి. ఆఫ్రికన్ చీతాలు, ఆఫ్రికన్ సింహాలు, వేటాడే కుక్కలు, చిరుత పులులు, మచ్చల హైనాలు, చారల నక్కలు, ఆఫ్రికన్ కెవెట్లు ఉన్నాయి. ఈ పార్కులో దాదాపు 800 ఏనుగులు ఉన్నాయి. అలాగే హిప్పోలు వేలాదిగా ఉన్నాయి. ఇంకా అడవి దున్నలు, ఆంటిలోప్‌లు, బబూన్లు, కోతులు వేల సంఖ్యలో ఉన్నాయి. అలాగే వందలాది పక్షి జాతులు కూడా ఈ జాతీయ పార్కులో ఉన్నాయి. అబోమీ నగరం: ఈ నగ రాన్ని 17-19 శతాబ్దాల మధ్యన ఫాన్ తెగ రాజులు పరిపాలించారు. నగరం చుట్టూ మట్టి గోడ కట్టి ఉంటుంది. దీని చుట్టుకొలత దాదాపు ఆరు మైళ్లు ఉంటుంది. మట్టిగోడకు ఆరు చోట్ల ఆరు గేట్లు ఉన్నాయి. ఈ గోడ బయటి భాగంలో లోతైన కందకం ఉంటుంది. దీనిలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. ఈ కందకంలో తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి ఉంటాయి. నగరం అంతా విచిత్రంగా విభజింపబడి ఉంటుంది. అనేక రాజభవనాలు, ప్రజలకు గ్రామాలు, మార్కెట్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని యునెస్కో ్రపపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. క్రీ.శ. 1625 నుండి క్రీ.శ.1900 వరకు ఈనగరాన్ని రాజధానిగా చేసుకుని దాదాపు 12 మంది రాజులు పరిపాలన చేశారు. చరిత్ర: బెనిన్ దేశాన్ని 1975 వరకు దహోమీ అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుండి బానిసలను కొని ఇతర దేశాలకు తరలించేవారు. ఇక్కడే పూడూ తెగవాళ్లు మనుషులను బలి ఇచ్చే సాంప్రదాయం కొనసాగింది. 18, 19 శతాబ్దాల కాలంలో ఇతర ఆఫ్రికన్ రాజులు ఈ దేశంపై ఆధిపత్యం వహించారు. 1892లో ఫ్రాన్స్ దేశం దీనిని తన అధీనంలోకి తెచ్చుకుంది. 1904 వరకు ఇది ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికాగా పరిగణించబడింది. ఇప్పటికీ ప్రజల్లో దాదాపు 50 శాతం ఫ్రెంచ్ భాషనే మాట్లాడతారు. 1960లో ఫ్రాన్స్ నుండి బెనిన్‌కు స్వతంత్రం లభించింది. అప్పటి నుండి 1972 వరకు దేశంలో అంతర్గత యుద్ధాలు చెలరేగాయి. 1990 మార్చి 1న రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌గా అధికారికంగా పేరు నిర్ధారించారు. ఐస్‌క్రీమ్ కోన్‌ను నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉండే బెనిన్ దేశం పశ్చిమ ఆఫ్రికా దక్షిణ భాగం ఉంది. ఉండడానికి చిన్న దేశమే అయినా ప్రకృతి పరంగా ఒక గొప్పదేశం. సముద్రతీర ప్రాంతంలో నోకౌ, పోర్టోనోవో లాంటి గొప్ప సరస్సులు ఉన్నాయి. నలుచదరంగా ఉండే ఇళ్లు చూపరులను ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఈ సరస్సులకు ఉత్తర భాగంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. వీనిని టెర్రె డి బర్రె నేలలు అంటారు. దేశానికి ఉత్తర భాగంలో అటకోరా పర్వతాలు, పచ్చని గడ్డితో నిండిన సవన్నా పీఠభూములు దర్శనమిస్తాయి.