బెనిన్ | Benin world view | Sakshi
Sakshi News home page

బెనిన్

Published Sat, Jan 10 2015 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

బెనిన్

బెనిన్

ప్రపంచవీక్షణం

చూడదగిన ప్రదేశాలు
 
బెనిన్ దేశంలో పర్యాటక పరిశ్రమ పెద్దగా అభివృద్ధి చెందలేదు. అయినప్పటికీ, ప్రకృతి రమణీయత వల్ల  ప్రతి ఏటా దాదాపు లక్షా ఏభై వేల పర్యాటకులు వస్తూ ఉంటారు. అబోమీ, రాజధాని పోర్టోనోవో, పెండ్‌జారి జాతీయ పార్కు, డబ్ల్యు జాతీయ పార్కు, కొటోనోవ్ నగరం చూడదగ్గ ప్రదేశాలు.
 
నైసర్గిక స్వరూపం
 
వైశాల్యం: 1,14,763 చదరపు కిలోమీటర్లు  జనాభా: 1,03,23,000  ప్రభుత్వం: ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్   రాజధాని:  పోర్టో-నోవో కరెన్సీ: సిఎఫ్‌ఎ ఫ్రాంక్

భాషలు: అధికారిక భాష - ఫ్రెంచ్, ఫాన్, యోరుబా, ఇతర ఆఫ్రికా భాషలు
 
మతం: 70% అనిమిస్ట్, 15% క్రైస్తవ , 13% ముస్లిములు  వాతావరణం: ఆగస్ట్‌లో 23 డిగ్రీలు, మార్చిలో 28 డిగ్రీలు  పంటలు: కస్సావా, యామ్స్, మొక్కజొన్న, గోధుమ, కాఫీ, పత్తి, పామ్, వేరుశనగ, చిలగడదుంపలు పరిశ్రమలు: వ్యవసాయాధారిత పరిశ్రమలు, పామ్ ఆయిల్, దుస్తులు, కాటన్ జిన్నింగ్, కోకో   సరిహద్దులు: నైగర్, బుర్కినా, టోగో, నైజీరియా   స్వాతంత్య్ర దినోత్సవం: 1960, ఆగష్టు 1.
 
పరిపాలనా పద్ధతులు: పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 12 భాగాలుగా విభజించారు. ఈ విభాగాలను డిపార్టుమెంట్‌లు అంటారు. ఈ డిపార్టుమెంట్‌లు తిరిగి 77 కమ్యూన్‌లుగా విభజింపబడ్డాయి. పన్నెండు డిపార్టుమెంట్‌లు ఇవి - అలిచోరి, అటకోరా, అట్లాంటిక్, బోర్గు, కోలిన్స్, డోంగో, కౌఫో, లిట్టోరల్, మోనో, ఓవుమి, ప్లాటూ, జోవ్. బెనిన్ దేశంలో ప్రజలు ఎక్కువగా దేశపు దక్షిణ భాగంలోనే నివసిస్తారు. జనాభాలో అత్యధిక శాతం యువత ఉంది. దాదాపు 42 ఆఫ్రికన్ తెగలు ఈ దేశంలోనే ఉన్నాయి. యోరుబా, డెండి, బారిబా, ఫులా, బేటమ్మా రిబే, సోంబా, ఫాన్, అబోమీ, మీనా, జూడా, అజా తెగలు దేశంలో ప్రముఖమైనవి. ఈ దేశంలో  భారతీయులు కూడా వివిధ వ్యాపార రంగాలలో ఉన్నారు.
 
పోర్టో-నోవో: బెనిన్ దేశానికి పోర్టోనోవో రాజధాని. ఈ నగరాన్ని హాగ్‌బోనోవ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ దహోమీకి రాజధానిగా ఉండేది. ఈ నగరం ఒక డిపార్టుమెంటు, మరియు కమ్యూన్‌గా ఉంది.  దీని వైశాల్యం 110 చదరపు  కిలోమీటర్లు. ఈ నగరంలోనే శాసనసభ ఉంది. ఈ నగర పరిసరాలలో  పామ్ ఆయిల్ తోటలు, పత్తి పంటలు ఎక్కువ.  ఈ నగరంలో పోర్టోనోవో మ్యూజియం ఉంది. ఇందులో గత కాలపు రాజులు ఉపయోగించిన అనేక వస్తువులు, దుస్తులు ఉన్నాయి. టోఫా రాజ భవనం కూడా ఇక్కడ ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా  గుర్తించింది.ఈ ప్రాంతపు మొట్టమొదటి రాజు విగ్రహం ఈ నగరంలో ఉంది. గవర్నర్ రాజభవనం ఒక విశాలమైన భవనం. ప్రస్తుతం ఈ భవనమే శాసనసభా భవనంగా
 ఉపయోగపడుతోంది. పోర్టోనోవో మసీదు మరో చూడదగిన పెద్ద భవనం.
 
ప్రజలు - సంస్కృతి- ఆహారం


యువతీ యువకులు పాశ్చాత్యశైలి దుస్తులు ధరిస్తారు. గ్రామీణ ప్రాంత మహిళలు షర్టు, స్కర్టు ధరిస్తారు. తలకు టోపీ లాంటిది పెట్టుకుంటారు. కుటుంబంలో మహిళలకు ప్రాముఖ్యత ఇస్తారు. వీరు వ్యవసాయ పనుల్లో ముందుంటారు. మార్కెట్లు, షాపులను బాగా నడుపుతారు. వివాహ సమయంలో వధువు ప్రత్యేకమైన దుస్తులు తొడుక్కోవడంతోపాటు రకరకాల పూసల దండలను మెడలోనూ, తలకు ధరిస్తారు. పట్టణాలలో నివసించేవారు ప్యాంటు, షర్టు ధరిస్తారు.

దేశంలో తీరప్రాంతాల ప్రజలు జలచరాలను ముఖ్యంగా రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలను ఇష్టంగా తింటారు. ఇతర ప్రాంతాలలో మొక్కజొన్నపిండి, టమోటారసం, పామోలిన్ నూనె ఎక్కువగా వాడుతారు. కొన్నిప్రాంతాలలో వరి అన్నం కూడా తింటారు. నారింజ, అరటి, అనాస పళ్లు తింటారు. ఆవుపాలతో చేసిన పదార్థాన్ని వాగాసి అంటారు. ఇంకా అలోకో, ఫు-ఫు, గర్రె, మోమో అమివో, అక్‌పాన్, అకస్సా పేర్లు గలిగిన ఆహారాన్ని తింటారు. చేకాచి అనే పేరుగల మిల్లెట్ బీరు తాగుతారు.
 
కొటోనోవ్ నగరం: ఇది బెనిన్ దేశంలో అతి పెద్ద నగరం. నగరంలో దాదాపు 8 లక్షల జనాభా ఉంది. ఇది అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ ఓడరేవు కూడా ఉంది. ఈ నగరం ఆర్థిక రాజధానిగా ఉండడం వల్ల ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. దేశం మొత్తానికి ఇదే పెద్ద ఓడరేవు పట్టణం. ఎగుమతులు, దిగుమతులు అన్నీ ఇక్కడి నుండే జరుగుతాయి. ఈ నగరంలో ఫ్రెండ్‌షిప్ స్టేడియం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇంకా కొటోనోవ్ కాథెడ్రల్, కొటోనోవ్ సెంట్రల్ మాస్క్, పురాతన  బెనిన్ జాతీయ విశ్వవిద్యాలయం ఉన్నాయి.
 
ఈ నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణ - మోటారు సైకిల్ టాక్సీలు లభించడం. పూర్వం ఈ నగరాన్ని దమోమీ రాజులు పరిపాలించారు. 1851లో ఫ్రెంచ్‌వాళ్లు దీనిని ఆక్రమించారు.
 
పెండ్‌జారి జాతీయ పార్కు: ఈ జాతీయ పార్కు దేశానికి ఉత్తర- పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఇది పెండ్ జారీ నది తీరంలో ఉండడం వల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో కొండలు, కోనలు, రాతి పర్వతాలు ఉన్నాయి. ఎంతో సహజమైన పార్కుగా ఇది పేరు గాంచింది. ఈ పార్కులో అనేక రకాల జంతుజాలాలు ఉన్నాయి. సవన్నా గడ్డి మైదానాలు కూడా ఈ పార్కులో ఉన్నాయి. ఆఫ్రికన్ చీతాలు, ఆఫ్రికన్ సింహాలు, వేటాడే కుక్కలు, చిరుత పులులు, మచ్చల హైనాలు, చారల నక్కలు, ఆఫ్రికన్ కెవెట్‌లు ఉన్నాయి. ఈ పార్కులో దాదాపు 800 ఏనుగులు ఉన్నాయి. అలాగే హిప్పోలు వేలాదిగా ఉన్నాయి. ఇంకా అడవి దున్నలు, ఆంటిలోప్‌లు, బబూన్‌లు, కోతులు వేల సంఖ్యలో ఉన్నాయి. అలాగే వందలాది పక్షి జాతులు కూడా ఈ జాతీయ పార్కులో ఉన్నాయి.
 
అబోమీ నగరం: ఈ నగ రాన్ని 17-19 శతాబ్దాల మధ్యన ఫాన్ తెగ రాజులు పరిపాలించారు. నగరం చుట్టూ మట్టి గోడ కట్టి ఉంటుంది. దీని చుట్టుకొలత దాదాపు ఆరు మైళ్లు ఉంటుంది. మట్టిగోడకు ఆరు చోట్ల ఆరు గేట్లు ఉన్నాయి. ఈ గోడ బయటి భాగంలో లోతైన కందకం ఉంటుంది. దీనిలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి.  ఈ కందకంలో తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి ఉంటాయి. నగరం అంతా విచిత్రంగా విభజింపబడి ఉంటుంది. అనేక రాజభవనాలు, ప్రజలకు గ్రామాలు, మార్కెట్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని యునెస్కో ్రపపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. క్రీ.శ. 1625 నుండి క్రీ.శ.1900 వరకు ఈనగరాన్ని రాజధానిగా చేసుకుని దాదాపు 12 మంది రాజులు పరిపాలన చేశారు.
 
 
చరిత్ర: బెనిన్ దేశాన్ని 1975 వరకు దహోమీ అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుండి బానిసలను కొని ఇతర దేశాలకు తరలించేవారు. ఇక్కడే పూడూ తెగవాళ్లు మనుషులను బలి ఇచ్చే సాంప్రదాయం కొనసాగింది. 18, 19 శతాబ్దాల కాలంలో ఇతర ఆఫ్రికన్ రాజులు ఈ దేశంపై ఆధిపత్యం వహించారు. 1892లో ఫ్రాన్స్ దేశం దీనిని తన అధీనంలోకి తెచ్చుకుంది. 1904 వరకు ఇది ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికాగా పరిగణించబడింది. ఇప్పటికీ ప్రజల్లో దాదాపు 50 శాతం ఫ్రెంచ్ భాషనే మాట్లాడతారు. 1960లో ఫ్రాన్స్ నుండి బెనిన్‌కు స్వతంత్రం లభించింది. అప్పటి నుండి 1972 వరకు దేశంలో అంతర్గత యుద్ధాలు చెలరేగాయి. 1990 మార్చి 1న రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌గా అధికారికంగా పేరు నిర్ధారించారు. ఐస్‌క్రీమ్ కోన్‌ను నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉండే బెనిన్ దేశం పశ్చిమ ఆఫ్రికా దక్షిణ భాగం ఉంది. ఉండడానికి చిన్న దేశమే అయినా ప్రకృతి పరంగా ఒక గొప్పదేశం. సముద్రతీర ప్రాంతంలో నోకౌ, పోర్టోనోవో లాంటి గొప్ప సరస్సులు ఉన్నాయి. నలుచదరంగా ఉండే ఇళ్లు చూపరులను ఎంతో ఆశ్చర్యపరుస్తాయి.  ఈ సరస్సులకు ఉత్తర భాగంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. వీనిని టెర్రె డి బర్రె నేలలు అంటారు. దేశానికి ఉత్తర భాగంలో అటకోరా పర్వతాలు, పచ్చని గడ్డితో నిండిన సవన్నా పీఠభూములు దర్శనమిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement