హైదరాబాద్: 'ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024' కార్యక్రమంతో తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్ స్ఫూర్తి ప్రతిధ్వనించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంతో గ్రామ పంచాయితీల పరిధిలో 44 మంది ఆవిష్కర్తలకు గుర్తింపు దక్కింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది. 2023 ఏడాదికి 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమం కింద టీఎస్‌ఐసీ ద్వారా స్థానిక ఆవిష్కర్తలకు గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సన్మానాలు అందించారు. ఈ కార్యక్రమం స్థానికంగా సవాళ్లను గుర్తించి పరిష్కరించడంలో గ్రామస్తులను ప్రోత్సహించడమే కాకుండా యువ తరాలకు స్ఫూర్తినిస్తుంది.
44 మంది ఆవిష్కర్తల్లో గృహిణులు, పాఠశాల పిల్లలు, కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారి వినూత్న సహకారానికి నేడు(జనవరి 26)న అవార్డులు లభించాయి. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఉజ్వల భవిష్యత్తు వైపు తమ సొంత మార్గాన్ని రూపొందించుకోవడానికి సమాజాన్ని చైతన్యపరుస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 'విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులు' అందించారు.
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఆహార సాంకేతికత, పర్యావరణం, ఆటోమొబైల్స్, ఆక్వాకల్చర్, సాంకేతికత, పారిశుధ్యం వంటి వివిధ రంగాలలో విస్తృతమైన ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే అద్భుతమైన సాధనాల నుండి నీటి సంరక్షణ కోసం తెలివిగల పరిష్కారాల వరకు, సమస్యలను పరిష్కరించడంలో అట్టడుగు స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం గుర్తిస్తుంది.
"ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024" ద్వారా కేవలం ఆవిష్కర్తల గుర్తింపు మాత్రమే కాదు.. సమాజాన్ని పురోగతి వైపు నడిపించే స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని టీఎస్‌ఐసీ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ అన్నారు. ప్రతి గ్రామం సృజనాత్మకతతో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మూసీ సుందరీకరణే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment