ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే ఊపందుకుంటోంది కానీ కేరళ రాష్ట్రం కన్నూర్‌లోని నడువిల్ గ్రామ వాసులు మాత్రం ప్రచారానికి నో చెబుతున్నారు. కారణం అధ్వాన్నమైన రోడ్లు. మెరుగైన రోడ్లు వేయనందుకు నిరసనగా తమ గ్రామంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికి అనుమతించబోమని ఆ గ్రామస్తులు ప్రకటించారు.
తమ ప్రాంతానికి ఓట్లు అడగడానికి అభ్యర్థులెవరూ రాకూడదంటూ వివిధ చోట్ల ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారు. నడువిల్లి పంచాయతీ పరిధిలోని 9, 10, 11, 12 వార్డుల్లోని నాలుగు ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్ల మరమ్మతులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు అధ్వానంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో తమ గ్రామానికి డ్రైవర్లు ఎవరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహిస్తున్నారు.
"ఎన్నో ఏళ్లుగా ఈ బూటకపు వాగ్దానాలు వింటూనే ఉన్నాం. వారి మాటలను ఇకపై విశ్వసించం. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వక హామీ ఇస్తేనే ఈ ఎన్నికల్లో పాల్గొంటాం. లేకపోతే అన్ని ఓట్లు నోటా వేసేస్తాం" అని నడువిల్లి గ్రామస్తులు తెగేసి చెప్పేస్తున్నారు. కాగా ఇటీవలే రెండు రోడ్లకు నిధులు కేటాయించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment