పాట్నా: వడగాల్పులు ఉత్తరాదిని వణికిస్తుండగా.. ప్రస్తుతం మరో సమస్య వచ్చి పడింది. తీవ్రమైన ఎండలతో ఉత్తరప్రదేశ్, బిహార్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న వడదెబ్బ బాధితులకు తోడు స్మాల్ ఫాక్స్(మసూచి) బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ హెచ్చవుతోంది. బిహార్‌లో ఓ గ్రామంలో దాదాపుగా సగం జనాభాకు ఈ వ్యాధి సోకడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
సాపౌల్ జిల్లాలోని త్రివేణిగంజ్ గ్రామంలో 100 మందికి స్మాల్ ఫాక్స్ సోకింది. కేవలం 35 కుటుంబాల నుంచే ఇంత మంది బాధితులు ఉండటం గమనార్హం. అయితే.. గత మూడు నెలల నుంచి వ్యాధి ప్రబలుతున్నప్పటికీ ఇప్పటి వరకు వైద్య అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. వ్యాధి వ్యాపించిన తొలినాళ్లలోనే ఫిర్యాదు చేసినప్పటికీ తమ విన్నపాలను పెడచెవిన పెట్టారని చెబుతున్నారు. తమకు తెలిసిన వైద్యాన్ని చేస్తున్నట్లు చెప్పారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెలుతున్నట్లు పేర్కొన్నారు.
తాజాగా మంగళవారం ఆ గ్రామాన్ని వైద్య అధికారులు పరిశీలించారు. రోగులను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమకు విషయం తెలియగానే ఆ గ్రామాన్ని సందర్శించామని జిల్లా వైద్య అధికారి మిహిర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున స్మాల్ ఫాక్స్ సోకడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. వేసవి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: Video: గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. 5 కి.మీ మేర ట్రాఫిక్
Comments
Please login to add a commentAdd a comment