నాందేడ్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఈ కోవలోకే వస్తుంది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలోని వాగ్దారి గ్రామం. ఈ గ్రామంలో 300 జనాభా ఉంది. భూ రెవెన్యూ మ్యాప్‌లో ఈ గ్రామం పేరు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఈ గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు.
తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు తొలిసారిగా తమ గ్రామంలో ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ఓటర్లు సమీపంలోని పోలింగ్ కేంద్రమైన జలధారకు వెళ్లేవారు. వీరు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టేది. అయితే అడవి గుండా వెళ్లాల్సిన రావడంతో క్రూర మృగాల భయం వారిని వెంటాడేది. తాజాగా
కిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ గ్రామంలోని 190 మంది ఓటర్లు స్థానికంగానే ఓటు వేయనున్నారు. గ్రామానికి పోలింగ్ బూత్ రావడంతో త్వరలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలోని చారిత్రక సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని భూమికి కొలతలు నిర్వహించి, పూణేలోని అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో గ్రామస్తులకు భూమి యాజమాన్యపు రుజువు లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గ్రామస్తుల్లో కొత్త ఆశను నింపింది. ఎన్నికల్లో తమ గళం వినిపించాలని, అప్పుడే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీరుస్తుందని గ్రామస్తులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..
Comments
Please login to add a commentAdd a comment