సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో లేఔట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొత్తగా గ్రామాలను చేర్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే పలు ఫామ్‌హౌస్‌లకు గ్రామ పంచాయితీలు అనుమతులు ఇచ్చాయి. జాన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లకు గ్రామ పంచాయితీ అనుమతినిచ్చింది. హైడ్రా తెర మీదకు రావడంతో గ్రామ పంచాయితీల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సర్కార్ నిర్ణయించింది.
కాగా, వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది.
దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు.
ఇదీ చదవండి: ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్
నగదు అవసరమైనప్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment