సాక్షి, ములుగు జిల్లా: వరదలతో ములుగు జిల్లాలో 8 మంది మృతి చెందగా, మరో 8 మంది గల్లంతయ్యారు. జంపన్న వాగు వరద ఉధృతితో కొండాయి గ్రామం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గ్రామంలోని 150 మందికి హెలికాఫ్టర్ ద్వారా ఆహారం, మెడిసిన్ సరఫరా చేశారు.
వరద ఉధృతితో కొండాయి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. గుండ్లవాగు వద్ద జాతీయ రహదారిపై బిడ్జ్రి కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రికార్డు స్థాయిలో వెంకటాపూర్ మండలంలో 70 సెం.మీ వర్షపాతం నమోదైంది. జంపన్న వాగు దాటే క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. ఐదుగురిని ఎన్డీఆర్‌ఎఫ్ కాపాడారు.
వర్షం, వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అపారనష్టం మిగిల్చింది. 14 మంది మృతి చెందగా మరో 8 మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 40 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వర్షం, వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ లో పలు కాలనీలు నీటమునగడానికి కబ్జాలు అక్రమ నిర్మాణాలే కారణమని మంత్రి అన్నారు.
చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉధృతంగా నీరు రావడంతో ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచిస్తున్నారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చెయొద్దని, అత్యవసరమైతే కంట్రోల్ రూంలకు కాల్ చేయాలన్నారు. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలని, జలాశయాల వద్దకు ప్రజలు రావద్దని సూచించారు. వరద నిలిచిన రహదారుల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లను అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రియాంక.
Comments
Please login to add a commentAdd a comment