సౌర విద్యుత్ వినియోగం దిశగా రాష్ట్రం అడుగులు
మోడల్ సోలార్ విలేజ్‌లుగా మూడు గ్రామాల ఎంపిక
కొండారెడ్డిపల్లి, సిరిపురం, వెలగనూరు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు
ఈ గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతోనే సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటు
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా అమలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/మధిర: గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. పర్యావరణ హితమైన సౌర విద్యుత్‌ను అందరూ వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు గ్రామాలను పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని, జనాభా ఎంత, గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని, సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్‌టాప్‌లు అనుకూలంగా ఉన్నాయా.. తదితర అంశాలపై విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. టెండర్లు పిలిచిన అనంతరం టీజీ రెడ్‌కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
మోడల్ సోలార్ విలేజ్..
గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రం మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని తీసుకుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతీ ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా అన్నింటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెలగనూరు, ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మండలం సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ మూడు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల సర్వే పూర్తయింది.
అంతా సోలార్‌మయం
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు గ్రామాల్లో గృహ, వ్యవసాయ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఉదయం సమయంలో సౌర విద్యుత్, రాత్రి సమయాన సాధారణ విద్యుత్‌ను వినియోగిస్తారు. గృహాలపై సోలార్ రూఫ్ టాప్‌లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో వీటి ఏర్పాటులో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంతేకాక మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు యజమానులే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కో ఇంటిపై 2 నుంచి 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు.. వ్యవసాయ పంపుసెట్లకు 5 హెచ్‌పీ మోటారుకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానల్‌ను అమరుస్తారు.
బహుళ ప్రయోజనాలు..
సోలార్ విద్యుత్ వినియోగంతో బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి వీలవుతుంది. మిగులు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా స్థానికులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగం ద్వారా పర్యావరణానికి హాని కలగడమే కాకుండా.. ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇలాంటి దుష్పరిణామాలను నివారించడానికి సౌరవిద్యుత్ దోహదం చేస్తుంది.
సిరిపురంలో సర్వే పూర్తి
మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 4న సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలు నిమిత్తం విద్యుత్‌శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అంతేకాక గ్రామస్తులు, రైతులకు పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. సర్వే అనంతరం సిరిపురం వచ్చిన ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించారు. ఈ గ్రామంలో మొత్తం 5,428 మంది జనాభా ఉండగా, 1,024 గృహ సర్వీసులు, 510 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్‌ను 1,007 మంది 200 యూనిట్లలోపు వినియోగిస్తున్నారు.
సోలార్ విద్యుత్.. రైతులకు ఉపయోగం
మా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటుతో వ్యవసాయ పంపు సెట్లు ఉన్న రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అవగాహన కల్పించారు. అధికారులు కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. మిగులు విద్యుత్‌కు డబ్బు చెల్లిస్తారని తెలిసింది. విద్యుత్ ఉన్నా, లేకున్నా సోలార్ విద్యుత్ పంపుసెట్లతోపంట సాగుకు ఇబ్బంది ఉండదు. – వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా
బిల్లుల భారం తగ్గి, ఆదాయం వస్తుంది..
ప్రభుత్వం 200 యూనిట్లలోపు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు సోలార్ విద్యుత్ వల్ల బాధలు తప్పుతాయి. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. సోలార్ విద్యుత్‌తో బిల్లుల భారం తగ్గి, ఆదాయం కూడా వస్తుంది. – చీదిరాల వెంకటేశ్వరరావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా
రుణపడి ఉంటాం..
మా గ్రామంలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉంటాయి. సోలార్ విద్యుత్‌ను గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకో వడం వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకునే అవకాశం ఉండటం సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం. ఇప్పటికే రోడ్లు, వైరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. – నండ్రు విజయారావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మంజిల్లా
Comments
Please login to add a commentAdd a comment