అనగనగా ఒక ఊరు.. | Each Town Has A Different Nature Sakshi Funday Cover Story | Sakshi
Sakshi News home page

అనగనగా ఒక ఊరు..

Published Sun, Jun 30 2024 12:18 AM | Last Updated on Sun, Jun 30 2024 12:12 PM

Each Town Has A Different Nature Sakshi Funday Cover Story

మన మూలం చెప్పేది ఊరే! అందుకే మన పరిచయం ఊరి నుంచే మొదలవుతుంది! ఒక్కో ఊరుది ఒక్కో స్వభావం! సంస్కృతీసంప్రదాయాల నుంచి అభివృద్ధిబాట దాకా! ఆ భిన్నత్వాన్నే చెబుతోందీ ‘అనగనగా ఒక ఊరు’!

అన్యులను అంటుకోని మలాణా (హిమాచల్‌ ప్రదేశ్‌)
మన దేశంలోని అతి పురాతన గ్రామం ఇది. కులు, పార్వతి లోయల మధ్యలో సముద్రమట్టానికి 2,652 మీటర్ల (8,701 అడుగుల) ఎత్తులో.. మలాణా నది ఒడ్డున కొలుౖవై ఉంది. ప్రకృతి అందాలకు ఆలవాలం. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది. మలాణీయులకు భారతీయ పోలికలకన్నా మెడిటరేనియన్‌ పోలికలే ఎక్కువ. బహుశా ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు! స్థానిక భాష కనాశీ. ఆధునిక ఛాయలకు దూరంగా ప్రాచీన సంస్కృతీ సంప్రదాయలకు నిలయంగా ఉంటుంది.

జమదగ్నిని వీళ్లు జమ్లు దేవతగా కొలుస్తారు. ఆయననే తమ గ్రామ రక్షకుడిగా భావిస్తారు. జమదగ్నికి ఇక్కడ గుడి ఉంటుంది. మలాణీయులది ఫ్రెండ్లీ నేచరే కానీ మలాణీయేతరులెవరైనా వీళ్లకు అస్పృశ్యులే! వీరి అనుమతి లేకుండా పరాయి వాళ్లెవరూ వీరిని అంటుకోకూడదు. దూరం నుంచే మాట్లాడాలి. నడిచేప్పుడు వాళ్ల ఇంటి గోడలను కూడా తాకకూడదు. ఇక్కడి కొట్లలో పర్యాటకులు ఏమైనా కొనుక్కుంటే ఆ వస్తువులను చేతికివ్వరు కౌంటర్‌ మీద పెడతారు. అలాగే పర్యాటకులూ డబ్బును కౌంటర్‌ మీదే పెట్టాలి.

పొరపాటున తాకితే వెంటనే స్నానం చేయడానికి పరుగెడ్తారు. ఈ ఊరిలో పోలీసులకు ప్రవేశం లేదు. మన రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఈ ఊరికి ప్రత్యేకమైన న్యాయవ్యవస్థ ఉంది. ప్రాచీన ప్రజాస్వామ్యం గల ఊరు అని దీనికి పేరు. వీరి ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్యాన్ని పోలి ఉంటుందట! వీళ్ల ప్రధాన ఆర్థిక వనరు గంజాయి. ఎక్కడపడితే అక్కడ గంజాయి వనాలు కనిపిస్తుంటాయి. బ్యాన్‌ అయినప్పటికీ ‘మలాణా క్రీమ్‌’ పేరుతో ఇక్కడి గంజాయి దేశంలో ప్రసిద్ధి. ఉత్పత్తిలో మహిళలే అగ్రగణ్యులు. వంట పని నుంచి సాగు, మార్కెటింగ్‌ దాకా అన్ని బాధ్యతలూ మహిళలవే. మగవాళ్లు గంజాయి మత్తులో నిద్రపోతుంటారని మలాణా సందర్శకుల పరిశీలన. ఇక్కడ వెహికిల్స్‌ వెళ్లేంత రోడ్లు ఉండవు. వీళ్ల రోజువారీ రవాణాకు కేబుల్‌ కార్లే మార్గం.

లక్షాధికారుల హివ్రే బాజార్‌ (మహారాష్ట్ర)
తన తలరాతను తానే తిరగరాసుకుని అత్యధిక మిలయనీర్లున్న విలేజ్‌గా వాసికెక్కిందీ ఊరు. మరాఠ్వాడా ప్రాంతం, అహ్మద్‌నగర్‌ జిల్లాలోని హివ్రే బాజార్‌ ఒకప్పుడు దట్టమైన అడవి, పంటపొలాలతో అలరారిన గ్రామం. అడవిలోని చెట్లు వేటుకు గురై, వర్షాభావ స్థితులు ఏర్పడి.. చెరువులు కూడుకుపోయి.. భూగర్భ జలాలు అడుగంటి.. బావులు ఎండిపోయి.. కరవు కాటకాలకు నిలయమైంది. తాగుడు, క్రైమ్‌కు బానిసైంది. ఒకానొక దశలో సారా కాయడం, నేరాలే హివ్రే బాజార్‌కు ఉపాధిగా మారాయన్నా విస్తుపోవాల్సిన పనిలేదు. 90 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయి, ఇక ఆ ఊరికి ఉనికిలేదనే పరిస్థితికి చేరిపోయింది. ప్రభుత్వోద్యోగులకైతే పనిష్మంట్‌ బదిలీ కేంద్రంగా మారింది.

వలస వెళ్లిన వాళ్లు పోనూ.. మిగిలిన జనం తమ ఊరు అలా అయిపోవడానికి కారణాలు వెదుక్కున్నారు. ఆ అన్వేషణలోనే పరిష్కారమూ తట్టింది గ్రామ పెద్దలకు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న ‘ఉపాధి హామీ’ పథకంతో అడవిని, చెరువులను పునరుద్ధరించుకోవచ్చనీ, వాన నీటిని సంరక్షించుకోవచ్చనీ అనుకున్నారు. తమ ఊరికే ప్రత్యేకమైన పంచవర్ష ప్రణాళికను వేసుకున్నారు. దాని ప్రకారం జనాలు నడుం కట్టారు. తొలకరికల్లా అడవుల సంరక్షణ, ప్లాంటేషన్, చెరువులు, బావుల పూడికతీత, వాటర్‌ షెడ్ల నిర్మాణం పూర్తిచేశారు.

పడిన ప్రతి వానబొట్టునూ ఒడిసి పట్టుకున్నారు. అయిదేళ్లూ కష్టాన్ని పంటికింద బిగబట్టారు. శ్రమ ఫలించసాగింది. నాటిన మొక్కలు ఎదిగాయి. అడవి పచ్చగా కళకళలాడింది. భూగర్భజల స్థాయి పెరిగింది. చెరువులు, బావుల్లోకి నీరు చేరింది. పంటలు లాభాలు పండించలేకపోయినా తిండిగింజలకు కొదువ లేకుండా చేశాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ ఊరి వాతావరణం మారసాగింది. వర్షపాతం పెరిగింది. నీళ్లొస్తే జీవకళ వచ్చినట్టే కదా! ప్రకృతిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవడం మొదలుపెట్టారు హివ్రే బాజార్‌ వాసులు. వలస వెళ్లిన వాళ్లంతా మళ్లీ సొంతూరుకి చేరిపోయారు. మద్యాన్ని మరచిపోయారు. ఆదాయం తద్వారా జీవన ప్రమాణం పెరిగాయి.

మూత బడిన బడులు తెరుచుకున్నాయి. 30 శాతానికి పడిపోయిన అక్షరాస్యత క్రమంగా 69 శాతానికి పెరిగింది. యువతలోంచి టీచర్లు, ఇంజినీర్లు వస్తున్నారు. ఇప్పుడక్కడ రైతు నెలసరి సగటు ఆదాయం 30 వేలు. 235 కుటుంబాల్లోకి 60 మంది రైతులు (ఫిబ్రవరి, 2024 నాటికి) లక్షాధికారులు. అలా దారిద్య్రం నుంచి అభివృద్ధి పథంలోకి నడిచిన ఈ ఊరు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోంది.

శుచీశుభ్రతల చిరునామా మావల్యాన్నాంగ్‌ (మేఘాలయా)
స్వచ్ఛభారత్‌ కంటే ముందే 2003లోనే ఆరువందల జనాభా గల ఈ చిన్న ఊరు ఆసియాలోకెల్లా క్లీనెస్ట్‌ విలేజ్‌గా కీర్తి గడించింది. ఇక్కడ అయిదేళ్ల పిల్లాడి నుంచి పళ్లూడిపోయిన వృద్ధుల వరకు అందరూ సామాజిక బాధ్యతతో మెలగుతారు. మావల్యాన్నాంగ్‌ పిల్లలంతా ఉదయం ఆరున్నరకల్లా లేచి చీపుర్లు పట్టుకుని వీథుల్లోకి వచ్చేస్తారు. వీథులన్నీ శుభ్రం చేస్తారు. డస్ట్‌బిన్స్‌లోంచి ఆర్గానిక్‌ చెత్తను వేరుచేసి మట్టి గుంతలో వేసి కప్పెట్టి, మిగిలిన చెత్తను కాల్చేస్తారు. తర్వాత ఇళ్లకు వెళ్లి రెడీ అయ్యి స్కూల్‌ బాటపడతారు.

ఇది వారి రోజువారీ కార్యక్రమం. ఆ ఊరి బాటల వెంట పూల మొక్కలను పెంచడం, పచ్చదనాన్ని సంరక్షించడం పెద్దల పని. ఇక్కడ ప్రతి ఇంటికీ టాయ్‌లెట్‌ ఉంటుంది. ప్రతి ఇల్లూ అద్దంలా మెరుస్తూంటుంది. రోజూ చేసే ఈ పనులే కాకుండా ప్రతి శనివారం చిన్నాపెద్దా అందరూ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీకి సంబంధించిన స్పెషల్‌ అసైన్‌మెంట్స్‌నూ  చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా  ప్లాస్టిక్‌ అనేది పెద్ద సమస్యగా మారిందని వాళ్ల బాధ. తాము ప్లాస్టిక్‌ని నివారించినా.. పర్యాటకుల వల్ల ఆ సమస్య ఏర్పడుతోందని వాళ్ల ఫిర్యాదు. ‘రీసైకిల్‌ చేయగలిగిన వాటితో ఇబ్బంది లేదు.. చేయలేని ప్లాస్టికే పెద్ద ప్రాబ్లం అవుతోంది.

వాటిని కాల్చలేం.. పూడ్చలేం. పర్యాటకులు కూడా పర్యావరణ స్పృహతో ఉంటే బాగుంటుంది’ అని మావల్యాన్నాంగ్‌ వాసుల సూచన. మీ ఊరికి ఇంత శుభ్రత ఎప్పటి నుంచి అలవడిందని అడిగితే ‘130 ఏళ్ల కంటే ముందు.. కలరా ప్రబలినప్పటి నుంచి అని మా పెద్దవాళ్లు చెబుతుంటే విన్నాం’ అంటారు. శుభ్రత ముందు పుట్టి తర్వాత మావల్యాన్నాంగ్‌ పుట్టిందనడం సబబేమో ఈ ఊరి విషయంలో!

పొదుపు, మదుపుల మాధాపార్‌ (గుజరాత్‌)
కచ్‌ జిల్లాలోని ఈ ఊరిలో మొత్తం 7, 600 (2021 నాటి లెక్కల ప్రకారం) ఇళ్లు ఉన్నాయి. వీళ్లలో యూకే, అమెరికా, కెనడాల్లో నివాసముంటున్నవారే ఎక్కువ. మాధాపార్‌లో మొత్తం 17 బ్యాంకులున్నాయి. విదేశాల్లో ఉంటున్న మాధాపార్‌ వాసులు ఈ బ్యాంకుల్లోనే తమ డబ్బును డిపాజిట్‌ చేస్తున్నారు. అలా వాళ్లు డిపాజిట్‌ చేసిన మొత్తం రూపాయలు (2021 లెక్కల ప్రకారం) అయిదువేలకోట్లు. దీంతో మాధాపార్‌ దేశంలోకెల్లా ధనికగ్రామంగా పేరొందింది. ఈ ఎన్‌ఆర్‌ఐలు 1968లోనే లండన్‌లో ‘మాధాపార్‌ విలేజ్‌ అసోసియేన్‌’ను స్థాపించుకున్నారు. దీని ఆఫీస్‌ను మాధాపార్‌లోనూ ప్రారంభించి ఊరి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఊరి అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. వ్యవసాయపరంగానూ మాధాపార్‌ ముందు వరుసలోనే ఉంది. వీరి వ్యవసాయోత్పత్తులు ముంబైకి ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఆటస్థలాలు, మంచి విద్యాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, చెరువులు, చెక్‌ డ్యామ్‌లకు కొదువలేదు.

మోడర్న్‌ విలేజ్‌ పున్సరీ (గుజరాత్‌)
మామూలుగా ఊరు అనగానే .. మట్టి ఇళ్లు, మంచి నీటి కొరత, కరెంట్‌ కోత, మురికి గుంతలు, ఇరుకు సందుల ఇమేజే మెదులుతుంది మదిలో! కానీ సబర్‌కాంతా జిల్లా.. అహ్మదాబాద్‌కి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని పున్సరీ మాత్రం ఆ ఇమేజ్‌కి భిన్నం! ఇక్కడ 24 గంటల మంచినీటి, కరెంట్‌ వసతి ఉంటుంది. టాయ్‌లెట్‌ లేని ఇల్లుండదు. రెండు ప్రైమరీ స్కూళ్లు, ఒక ప్రైమరీ హెల్త్‌ సెంటర్, స్ట్రీట్‌ లైట్స్, డ్రైనేజీ సిస్టం.. మాత్రమే కాదు ఊరంతటికీ  వైఫై, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు, 140 లౌడ్‌ స్పీకర్లతో దేశానికే మోడల్‌ విలేజ్‌గా విరాజిల్లుతోంది. అంతేకాదు ఇది స్కూల్‌ డ్రాపౌట్స్‌ లేని గ్రామం కూడా. దీని అభివృద్ధి కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీ నిరంతరం శ్రమిస్తోంది. అందులో అయిదుగురు మహిళలున్నారు. ఈ గ్రామాభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 300కు పైగా అధికారులు ఈ ఊరును సందర్శించారు.

మత్తూర్‌ (కర్ణాటక) సంస్కృతి
సంస్కృతం పండిత భాషగానే బతికి కనుమరుగైపోయింది. కానీ షిమోగా జిల్లాలోని మత్తూర్‌లో ఆ భాష నేటికీ వినపడుతుంది. పండితుల నోటెంటే కాదు అక్కడి ఇంటింటా! ఆ గ్రామవాసులు తమ మూలాలను,  సంస్కృతీసంప్రదాయాలనూ పరిరక్షించు కోవాలనే దృఢనిశ్చయంతో ఆ భాష ఉనికిని కాపాడుకుంటున్నారు. అందుకే మత్తూర్‌లో సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా మార్చేసుకున్నారు.

పెళ్లి పీటలెక్కని బర్వాకలా (బిహార్‌) 
కైమూర్‌ హిల్స్‌లోని ఈ ఊరు.. గుజరాత్‌ బెస్ట్‌ విలేజ్‌ పున్సరీకి భిన్నం. కనీస వసతులకు కడు దూరం. ఇక్కడ తాగునీటి సరాఫరా లేదు. కరెంట్‌ కనపడదు. టాయ్‌లెట్లు, డ్రైనేజ్‌ల గురించి అడగనే వద్దు. రోడ్లూ ఉండవు. ఈ స్థితి వల్ల ఈ ఊరు వార్తల్లోకి ఎక్కలేదు. ఈ స్థితి వల్ల ఇక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. సుమారు 50 ఏళ్లుగా ఈ ఊళ్లో మంగళ వాయిద్యాల మోగడం లేదు. కనీస అవసరాలు లేని ఆ ఊరికి మా అమ్మాయిని ఎలా ఇస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులంతా తమ మాట్రిమోనీ లిస్ట్‌లోంచి బర్వాకాలాను డిలీట్‌ చేసేశారు. కనాకష్టంగా 2017లో ఒక్కసారి మాత్రం ఇక్కడ పెళ్లి హడావిడి కనిపించింది. ఎందుకూ.. ఊరి ప్రజలంతా కష్టపడి రోడ్డు వేసుకోవడం వల్ల! ఇంకేం ఆ పెళ్లితో ఊరి కళ మారి తమకూ కల్యాణ ఘడియలు వచ్చేస్తాయని అక్కడి బ్రహ్మచారులంతా సంబరపడ్డారట. అది అత్యాశే అయింది. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇదిగో ఈ నేపథ్యం వల్లే ఆ ఊరు పేరు వైరల్‌ అయింది.

ద్వారాలు కనపడని శని శింగణాపూర్‌ (మహారాష్ట్ర)
శిరిడీని దర్శించిన చాలామందికి శనైశ్చరుడి ఊరు శని శింగణాపూర్‌ సుపరిచితమే. శనైశ్చరుడి ఆలయం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ ఊళ్లో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. చెప్పుకోవాల్సిన ప్రత్యేకత అదే.  ఇక్కడుండే ఆఫీస్‌ బిల్డింగ్స్, రిసార్ట్స్‌ వంటి వాటికి, ఆఖరకు పోలీస్‌ స్టేషన్‌కి కూడా తలుపులు ఉండవు. కొన్నిళ్లల్లో మాత్రం ట్రాన్స్‌పరెంట్‌ కర్టెన్స్‌ కనపడ్తాయి తలుపుల స్థానంలో. దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ ఊరు అప్పటి నుంచీ ఇంతే అట!

పాములను పెంచుకునే  శెట్పాల్‌ (మహారాష్ట్ర)
ఈమధ్య.. హైదరాబాద్, మణికొండ ప్రాంతంలోని నివాసాల మధ్య నాగుపాము కనపడిందని సోషల్‌ మీడియాలో ఒకటే గోల. అలాంటిది శెట్పాల్‌ గ్రామమే నాగుపాముల మయమని తెలిస్తే వీడియోల కోసం ఆ ఊరికి క్యూ కడతారో.. భయంతో బిగుసుకుపోతారో!  శెట్పాల్‌లో ఈ ఇల్లు.. ఆ ఇల్లు అనే భేదం లేకుండా ఏ ఇంటినైనా చుట్టొస్తాయట నాగుపాములు. వాటిని చూసి అక్కడివాళ్లు ఆవగింజంతైనా భయపడకపోగా కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను ముద్దు చేసినట్టుగా ముద్దు చేస్తారట. ఆ పాములూ అంతే.. శెట్పాల్‌ వాసులను సొంతవాళ్లలాగే భావిస్తాయిట. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ పాములు విసుగుతోనో.. కోపంతోనో.. చిరాకేసో.. ఏ ఒక్కరినీ కాటేసిన సందర్భం ఒక్కటీ లేదని స్థానికుల మాట. అందుకేనేమో శెట్పాల్‌æ జనాలు ఈ పాములను తమ ఇలవేల్పుగా కొలుస్తారు!

కవలల్ని కనే కొడిన్హీ (కేరళ)
మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు అంటారు. కానీ ఒకే ఊళ్లో డజన్లకొద్దీ కనిపిస్తే! అవునా.. నిజమా.. అని హాశ్చర్యపోయే పనిలేదు. నిజమే! ఆ దృశ్యం కొడిన్హీలో కనిపిస్తుంది. ఈ ఊళ్లో దాదాపు రెండువేల కుటుంబాలు ఉంటాయి. దాదాపు అయిదు వందల కవల జంటలు కనిపిస్తాయి. ఈ విశేషంతో అత్యధిక కవలల రేటు నమోదైన ఊళ్ల సరసన కూడా చేరింది కొడిన్హీ. ఇక్కడ ఇంతమంది కవలలు పుట్టడానికి కారణమేం ఉండొచ్చని పలు అధ్యయనాలూ జరిగాయి. ప్చ్‌.. ఏమీ తేలలేదు!

రెండు పౌరసత్వాల లోంగ్వా (నాగాలాండ్‌)
మోన్‌ జిల్లాలోని ఈ ఊర్లో కొన్యాక్‌ నాగా జాతి ప్రజలు ఉంటారు. ఆ జిల్లాలోని పెద్ద గ్రామాల్లో ఇదీ ఒకటి. ఆ ఊరి వాసులకు రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. దానికి కారణం ఆ ఊరి పెద్ద నివాసమే. అతని ఇంటిని మన దేశంతో పాటు మయన్మార్‌ కూడా పంచుకుంటుంది. అంటే అతనిల్లు సరిగ్గా ఈ రెండు దేశాల సరిహద్దు మీద ఉంటుంది. డీటేయిల్‌గా చెప్పాలంటే ఆ ఇంటి పడకగది ఇండియాలో ఉంటే వంటగది మయన్మార్‌లో ఉంటుంది. దీనివల్ల ఆ ఊరు ఈ రెండు దేశాల హద్దులోకి వస్తుందని ఇటు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుంది.. అటు మయన్మార్‌ కూడా లోంగ్వా వాసులకు తమ సిటిజ¯Œ షిప్‌ని మంజూరు చేస్తుంది. మన దేశంలో రెండు పౌరసత్వాలు కలిగి ఉండటంలో ఈ ఊరి ప్రజలకు మాత్రమే మినహాయింపు ఉంది.

చెప్పులొదిలి వెళ్లాల్సిన వెళ్లగవి (తమిళనాడు)
కొడైకెనాల్‌ దగ్గర్లోని చిన్న తండా ఇది. వంద కుటుంబాలుంటాయి. మూడు వందల ఏళ్ల నాటి ఈ తండాకు రోడ్డు లేదు. ట్రెక్కింగ్‌ ఒక్కటే మార్గం. ఇక్కడ చెప్పుల జాడలు కనిపించవు. ఊరి పొలిమేరల్లో బోర్డ్‌ కూడా ఉంటుంది.. ‘దయచేసి మీ పాదరక్షలను ఇక్కడే వదిలేయండి’ అని! ఎందుకంటే ఇక్కడ ఇళ్లకన్నా గుళ్లు ఎక్కువ. లెక్కకు మించిన గుడులైతే ఉన్నాయి కానీ ఒక్క బడీ లేదు. అంతెందుకు ఒక్క ప్రాథమిక కేంద్రం కూడా లేదు. ఒక టీ కొట్టు, చిన్న కిరాణా కొట్టు తప్ప ఇంకే కనీస సౌకర్యాలూ వెళ్లగవిని చేరలేదు. రోజువారీ అవసరాలకు ఈ తండా వాసులు కొడైకెనాల్‌ దాకా నడిచివెళ్తారు.

దయ్యాల కొంప కుల్‌ధారా (రాజస్థాన్‌)
జైసల్మేర్‌ జిల్లాలోని ఈ ఊరు 13వ శతాబ్దం నాటిది. ఇప్పుడు మొండి గోడలతో.. నిర్మానుష్యంగా కనిపించే కుల్‌ధారా ఒకప్పుడు పాలీవాల్‌ బ్రాహ్మణులకు నిలయం. ఒక మంత్రగాడి శాపంతో రాత్రికి రాత్రే ఆ ఊరు మాయమైందని ఒక కథ, భూస్వాముల దాష్టీకాలను తట్టుకోలేక ఆ బ్రాహ్మణులంతా కుల్‌ధారా వదిలి వెళ్లిపోయారని ఇంకో కథ ప్రచారంలో ఉంది. కారణం ఏదైనా మనుషుల ఆనవాళ్లు లేక ఇది ఘోస్ట్‌ విలేజ్‌గా పేరు తెచ్చుకుంది. పాలీవాల్‌ బ్రాహ్మణుల ఆత్మలు నేటికీ ఆ ఊరిలో తిరిగుతుంటాయనే ప్రచారమూ ఉంది. రాజస్థాన్‌ ప్రభుత్వం కుల్‌ధారాను పర్యాటక కేంద్రంగా మలచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

పోర్చ్‌గీస్‌ జాడ.. కోర్లాయీ (మహారాష్ట్ర)
అలీబాగ్‌కి గంట దూరంలో ఉన్న ఈ ఊరిని పోర్చ్‌గీస్‌ వాళ్లు నిర్మించారు. అందుకే ఒకప్పుడు దీన్ని పోర్చ్‌గీస్‌లో ‘మరో డి చాల్‌’ అనేవారట. అంటే ‘గుండ్రని చిన్న కొండ’ అని అర్థం. ప్రస్తుతం ఇక్కడి వాళ్లు పోర్చ్‌గీస్‌ క్రీయోల్‌ (యాస) ‘క్రిస్టీ’లో మాట్లాడుతారు. అంతేకాదు ఇక్కడ పేర్లన్నీ పోర్చుగీస్‌వే ఉంటాయి. పోర్చ్‌గీస్‌ ఫుడ్డే తింటారు. క్రీయోల్‌ అనే పదమే రూపాంతరం చెంది కోర్లాయీగా స్థిరపడింది.

ఆఫ్రికన్‌ విలేజ్‌ ఆఫ్‌ గుజరాత్‌ జాంబుర్‌
గిర్‌కి సమీపంలో ఉన్న ఈ ఊరును ‘ఆఫ్రికన్‌ విలేజ్‌ ఆఫ్‌ గుజరాత్‌’ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుజరాతీ భాషను మాట్లాడుతూ, గుజరాతీ పద్ధతులను పాటించే ఆఫ్రికన్స్‌ ఉంటారు కాబట్టి. ఆఫ్రో– అరబ్‌ వారసులైన వీళ్లను సిద్దీస్‌ అంటారు. బానిసలుగా అరబ్‌ షేక్‌ల ద్వారా ఇక్కడికి వచ్చారు. దాదాపు 200 ఏళ్ల నుంచి వాళ్లు ఈ ఊరిలోనే జీవిస్తున్నారు.

సోలార్‌ తొలి వెలుగు ధర్నాయీ (బిహార్‌)
జహానాబాద్‌ జిల్లాలో, బో«ద్‌ గయాకు దగ్గర్లో ఉంటుందీ ఊరు. దీని జనాభా 2,400. ఒకప్పుడు విద్యుత్‌ సౌకర్యం లేక చీకట్లో మగ్గింది. కానీ కొన్నేళ్ల కిందట. ఆ ఊరి ప్రజలే పూనుకొని సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. ఇది 450 ఇళ్లకు, 50 వాణిజ్య సముదాయాలకు ఎలాంటి కోతల్లేని కరెంట్‌ని అందిస్తోంది. ధర్నాయీ వాసుల ఈ సాహసం ఆ ఊరిని.. దేశంలో పూర్తిగా సోలార్‌ విద్యుత్‌నే వాడుతున్న తొలి గ్రామంగా నిలబెట్టింది. ఇప్పడు ఆ ఊర్లో ఇప్పుడు పిల్లలు చదువును కేవలం పగటి పూటకే పరిమితం చేసుకోవడం లేదు. స్త్రీలు రాత్రివేళల్లో గడపదాటడానికి భయపడటమూ లేదు.

ఇవేకాక ఫస్ట్‌ విలేజ్‌ మానా, బ్యూటిఫుల్‌ విలేజ్‌ చిరాపూంజీ, వలస పక్షుల ఆత్మహత్యలకు కేంద్రం జతింగా, ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్‌ ప్లేస్‌ కుంబలంగీ, బార్టర్‌ సిస్టమ్‌ అమల్లో ఉన్న జూన్‌ బేల్‌ మేల (అసోం) లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఊర్ల జాబితా చాంతాడంత పెద్దది. సమయం చిక్కినప్పుడల్లా వాటి గురించి తెలుసుకుంటూ.. డబ్బు వెసులుబాటైనప్పుడల్లా చుట్టిరావడమే! ప్రస్తుతం ఈ వివరాలతో వెరీ నెక్స్‌›్ట వెకేషన్‌కి డిస్టినేషన్‌ని టిక్‌ చేసేసుకోండి మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement