ప్రకృతి సాగుతో ప్రపంచ దృష్టికి.. | World Focus on Nature Nature Farming | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగుతో ప్రపంచ దృష్టికి..

Published Sun, Nov 17 2024 2:44 AM | Last Updated on Sun, Nov 17 2024 2:44 AM

World Focus on Nature Nature Farming

అది కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామం. ఒక మారుమూల పల్లె. అదిప్పుడు చరిత్రకెక్కుతోంది. పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని, ఈ ఊరు చేపట్టిన సేంద్రియ సాగు విధానాలు రైతు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. పాడిపంట అనే పదానికి అసలైన అర్థం చెబుతున్నారు ఇక్కడి రైతులు. రసాయనాల వల్ల కలుషితమవుతున్న సాగు నేలకు పునర్జీవం తీసుకొస్తున్నారు. ఆ ఊరి పురుషులు పొలాలను పర్యావరణహితంగా మారుస్తుంటే.. మహిళలు ఇంటి పరిసరాలను పచ్చదనంతో నింపి అటు ఆదాయానికి, ఇటు ఆరోగ్యానికి లోటు లేకుండా చేస్తున్నారు. దేశానికే ఇంకా చెప్పాలంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. 
పూర్వం ఈ గ్రామాన్ని దుర్గా ఊడ, దుర్గా వాహిని అనే పేర్లతో పిలిచేవారు. 

ప్రాచీన కవి పుల్ల కవి 15వ శతాబ్దంలో ఇక్కడ నివసించారన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్‌ పాలనకు సంబంధించిన స్మారక చిహ్నాలు, భవనాలు కనిపిస్తాయిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొట్టి మిర్చి విత్తన తయారీ నుంచి అంతా ఇక్కడే పండిస్తారు. ఈ ఊళ్లో 50 శాతానికి పైగా ప్రజలకు వ్యవసాయమే ఆధారం. రైతులు తాము వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. భారతీయ రైల్వే, సాఫ్ట్‌వేర్, బ్యాకింగ్, టీచింగ్‌ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, చార్టర్డ్‌ అకౌటెంట్లు, ఇంజినీర్లు ఉన్నారు. అతి పురాతన ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు గ్రామ దేవత వేగుళ్లమ్మ ఆలయం, మసీదు, చర్చిలతో మతసామరస్యానికి పెట్టింది పేరుగా ఉంది ఈ ఊరు.  

కరోనా చూపించిన దారి
దుర్గాడలో ఎటు చూసినా పచ్చని పొలాలే. ప్రతి ఇంటా గోవులు దర్శనమిస్తాయి. ధాన్యం నుంచి కూరగాయలు, పళ్లు అన్నీ తామే పండించుకుంటూ ఆదాయాన్నే కాదు ఆరోగ్యాన్నీ పెంచుకుంటున్నారు. ఇక్కడ నదులు, కాలువలు లేకపోవడంతో భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడే సాగు సాగుతోంది. సన్నకారు రైతులే ఎక్కువ. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మామిడికాయ పచ్చళ్లు, కూరగాయలు, మిర్చి వ్యాపారాలూ అధికమే! అయితే కరోనా ముందు వరకు ఇక్కడ రసాయన ఎరువులనే వాడేవారు. కరోనా వల్ల సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం, ఆం్ర«ధప్రదేశ్‌లో అప్పుడున్న ప్రభుత్వమూ సేంద్రియ సాగుకు పెద్దపీట వేయడంతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిందీ ఊరు. తొలుత ఒక ఇంట్లో మొదలైన ఈ ఉద్యమం అనతి కాలంలోనే పల్లె అంతా విస్తరించింది. సేంద్రియ ఎరువుల ద్రావణాల తయారీ ఇక్కడ ఓ కుటీరపరిశ్రమగా మారిపోయింది. 

ఏటీఎం విధానంలో సాగు
వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న భరోసా లేదు. ప్రకృతి దయ.. రైతుల ప్రాప్తం అన్నట్టు ఉంటుంది. దుక్కి దున్నిన నాటి నుంచి పంట కోసి, ధాన్యాన్ని ఎండబెట్టి మార్కెట్‌కి తీసుకెళ్లే వరకు ఆదాయం ఉండదు. ఈలోపు ప్రకృతి కన్నెర్రజేస్తే అంతే సంగతులు. అందుకే వ్యవసాయం గాలిలో దీపం లాంటిది అంటారు. అలాకాకుండా నారు వేసిన పదిహేను రోజుల నుంచి రోజూ ఆదాయాన్ని పొందే మార్గాన్ని పట్టుకున్నారు దుర్గాడ రైతులు. దాన్నే ఏటీఎం అంటే ఎనీ టైమ్‌ మనీ సాగు అంటున్నారు. ఇందులో ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల చేత శిక్షణ  తీసుకున్నారు. కొంత నేలను సిద్ధం చేసుకుని అందులో ఒకేసారి.. కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు.. పూలు ఇలా 30 రకాలను వేస్తారు. పదిహేను రోజుల తర్వాత నుంచి ఏదో ఒక కాయగూరో.. ఆకు కూరో.. దుంపలో.. పూలో..  కోతకు వచ్చేస్తాయి. దాంతో ప్రతిరోజూ వాటిని కోసి అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. అలా ఏటీఎం సాగు పద్ధతిలో రోజూ ఆదాయాన్ని ఆర్జిస్తూ జనాలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. దీనికయ్యే పెట్టుబడి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ సాగు మీదే పెట్టుబడిగా పెడుతున్నారు చాలామంది రైతులు. కోసిన పంట స్థానంలో మళ్లీ విత్తనాలు వేస్తూ! ఇలా కాలంతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి, నిత్యాదాయం.. వైవిధ్యమైన పంటలుగా  సాగుతోంది ఏటీఎం పద్ధతి.

చేపలతో చేలకు వైద్యం..
వ్యర్థ పదార్థాలతో పంటకు బలాన్నిచ్చే రసాయనాలను తయారు చేయడంలో దుర్గాడ రైతులకు సాటి,పోటీ లేదు. మత్స్యకారులు పక్కన పడేసిన కుళ్లిపోయిన చేపలతో చేలకు చేవనిచ్చే మీనామృతాన్ని తయారు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేసే ఈ మీనామృతం కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. దీనిని మొక్కల ఎదుగుదలకు, పూత, పిందె బలంగా మారడానికి వాడుతున్నారు. ఎకరానికి ఒక లీటరు సరిపోతుంది. దీన్ని తయారీదారులు లీటరు రూ.120 ధరకు విక్రయిస్తున్నారు.  

పురుగులు, తెగుళ్లపై యుద్ధం
పంటలపై దాడి చేసే పురుగులు, తెగుళ్లపై నీమాస్త్రం, బ్రహ్మాస్త్రాలతో ఇక్కడి రైతులు యుద్ధం చేస్తున్నారు. ఆ అస్త్రాలన్నీ ఆకులు అలములే! నీమాస్త్రంతో చిన్న చిన్న పురుగులు చనిపోతే, బ్రహ్మాస్త్రంతో ఎంతటి తెగులైనా, పురుగైనా పరారవుతుంది. అంతేకాదు ఉల్లి, మిరప, మజ్జిగ, బెల్లం, గోమూత్రం వంటి వాటితో కషాయాలనూ తయారుచేస్తూ పలు ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. 
ఇలా పర్యావరణహితమైన ప్రయోగాలు, ప్రయత్నాలతో నిరంతర ఆదాయాన్ని గడిస్తూ ప్రకృతి సాగులో ప్రపంచానికి స్ఫూర్తి పంచుతోందీ గ్రామం.  

వ్యవసాయ పాఠశాలగా 
దుర్గాడ గ్రామం ప్రకృతి సాగుకు పాఠశాలగా మారింది. వ్యవసాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను బ్యాచులుగా విభజించి.. వ్యవసాయ క్షేత్రాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాల్లోని రైతులతో వారికి ప్రకృతి సాగులో శిక్షణనిప్పిస్తున్నారు.

గోమయంతో ప్రమిదల తయారీ..
గోమూత్రంతో కషాయాలు, గోమయంతో ఘన జీవామృతంలాంటి ఔషధాలు తయారు చేస్తున్న దుర్గాడ రైతులు దేశీ ఆవుపేడతో ప్రమిదలు ధూప్‌స్టిక్స్‌ వంటివీ తయారుచేసి విక్రయిస్తున్నారు. ఈ ప్రమిదలలో ఆవునేతితో దీపం వెలిగిస్తే పరిసరాల్లో క్రిమి కీటకాలు నశిస్తాయి. స్వచ్ఛమైన గాలితో  ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందంటున్నారు.

తయారవుతున్న సేంద్రియ ఎరువులు
బీజామృతం, జీవామృతం, మీనామృతం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, చిల్లి స్పెషల్‌ కషాయం మొదలైనవి.

పండిస్తున్న పంటలు 
ఉల్లి, బురియా మిర్చి (పొట్టి మిర్చి, చిన్న రౌండ్‌ బెల్‌ రకం మిర్చి), చెరకు, కొబ్బరి, ఆయిల్‌ పామ్, మామిడి, బొప్పాయి, మినప, పెసర, శనగ, అరటి, వరి, కూరగాయలు, పుచ్చ, నువ్వులు, మునగ మొదలైనవి.

మా ఇంటి పంట పదిళ్లకు వంట
మా పెరట్లోని ఒక సెంటు స్థలంలో ఏటీఎం పద్ధతిలో 20 రకాల కూరగాయలు, పండ్ల సాగు మొదలుపెట్టాను. నాట్లేసిన పదిహేను రోజుల నుంచి ఫలసాయం మొదలైంది. ఖర్చు తగ్గడం, నా ఆదాయానికి గ్యారంటీ ఉండటం, మా ఇంటి పంట చుట్టుపక్కల పదిళ్లకు వంట అవటం చూసి మా ఊళ్లోని చాలామంది మహిళలు నాలా ఇంటి పంటను మొదలుపెట్టారు. 
– ఆకుల కనక సూర్యలక్ష్మి, రైతు, దుర్గాడ.

ఆన్‌లైన్‌ ద్వారా అమ్ముతున్నాను..
ప్రకృతి వ్యవసాయం మీదున్న ఆసక్తితో ఆరెకరాల పొలంలో సేంద్రియ సాగు స్టార్ట్‌ చేశాను. ఒకపక్క వ్యవసాయం చేస్తూనే ఇంటర్‌ పూర్తి చేశాను. నా పొలంలోని సేంద్రియ సాగు ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా అమ్ముతున్నాను. వీటికి మంచి గిరాకీ ఉంది. 
– జీలకర్ర భాను, యువ రైతు, దుర్గాడ

పరిశీలిస్తున్నారు.. తెలుసుకుంటున్నారు
గత ఐదేళ్లలో ఇక్కడ ప్రకృతి సాగు బాగా పెరిగింది. ఇక్కడి రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరారు. ఎంతోమంది ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ రైతులు దుర్గాడకు వచ్చి ప్రకృతి సాగును పరిశీలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, ద్రావణాల తయారీని తెలుసుకుంటున్నారు. 
– ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖాధికారి, కాకినాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement