అనంతపురం(తాడిపత్రి రూరల్): శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ బుధవారం సూర్యుడు ఉదయించక ముందే తాడిపత్రి మండలం తలారి చెరువు మొత్తం ఖాళీ అయింది. ‘అగ్గి పాడు’ ఆచారం పేరుతో ఇంటిలోని విద్యుత్ దీపాలను పూర్తిగా ఆర్పి, నిప్పు సైతం వెలిగించలేదు. పశువుల పాక ల్లోని పేడకళ్లతో పాటు ఇళ్లలోని కసువూ శుభ్రం చేయలేదు. కట్టెలు, వంట సామగ్రి, పాత్రలను మూటగట్టుకుని ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లపై వేసుకుని, ఇళ్లకు తాళం వేసి దర్గా వద్దకు చేరుకున్నారు.
రాత్రి వరకూ అక్కడే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. చీకటి పడిన తర్వాత ఇళ్లకు చేరుకుని ఆరుబయటనే భోజనాలు ముగించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఇంటి గడపకూ టెంకాయ కొట్టి లోపలకు ప్రవేశించారు. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయని గ్రామస్తుల నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment