తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మరాఠీ. ఆయన చెబుతున్నవి వింటుంటే చరిత్రలోకి మనం వెళ్లిపోతున్నాం అనిపిస్తుంది. తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలు తనదైన భాషలో చెబుతూ , దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు అనేక మంది కాంగ్రెస్ వారిని ఆయన ఏకిపారేశారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా విమర్శలు చేసినా, ఈసారి ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీపైనే దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అది దర్పణం పడుతుందనిపిస్తుంది. మరో మూడు , నాలుగు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు.
శాసనసభ సమావేశాలలో ఆయన ఉపన్యాసం ఇవ్వడం ఎప్పుడూ జరిగేదే కాని, ఈసారి చేసిన ప్రసంగానికి నేపధ్యం వచ్చే ఎన్నికలే అని వేరే చెప్పనవసరం లేదు. ఈ టరమ్ కు అసెంబ్లీలో ఇదే చివరి స్పీచ్ కావచ్చు. అందుకే ఆయన కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదునైన విమర్శలతో ఒక రకంగా విరుచుకుపడ్డారని చెప్పాలి.
కొంతకాలం క్రితం వరకు ఆయన బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రెండు ఉప ఎన్నికలలో బిజెపి గెలవడం, ఒక ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలవడానికి చాలా కష్టపడాల్సిరావడం వంటి కారణాలతో అప్పట్లో తెలంగాణలో బిజెపి బాగా పుంజుకుంటుందని చాలామంది భావించారు.
కాని కర్నాటక శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడం, తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఆశించిన రీతిలో క్యాడర్ ను తయారు చేసుకోలేకపోవడం, పార్టీలో చోటు చేసుకున్న విబేధాలు తదితర కారణాలతో బిజెపి వెనుకబడిపోతోందన్న అభిప్రాయం ఏర్పడింది. అదే టైమ్ లో కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలకు జోష్ పెరిగింది.
అంతవరకు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినా, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీనిని గమనించిన కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రగతి పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి పురోగతి సాధించింది వివరించడంతో పాటు అసలు తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని ఆయన సూత్రీకరించారు.
ఇందుకోసం 1956లో ఉమ్మడి ఎపి రాష్ట్రం ఏర్పాటుకు ముందునుంచి జరిగిన ఆయా రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో తెలియచేశారు. చరిత్రను ఎవరు ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఒక కోణం ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసినవారిలో కెసిఆర్ ఒకరు.
తెలంగాణను తెచ్చిందెవరు అన్నది పక్కనబెడితే, తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, దానికి నెహ్రూ నిర్ణయమే కారణమని ఆయన స్పష్టం చేశారు. 1956కి ముందు ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం. అంటే తెలంగాణ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలలో రాష్ట్రం ఉండేది.
తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశం దేశవ్యాప్తంగా బలీయంగా వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలోకాని, తెలంగాణలో కాని తెలుగువారంతా ఒకటికావాలన్న ఆకాంక్ష ఉండేది. తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన మాట నిజం. జవహర్ లాల్ నెహ్రూ ఆశ్చర్యంగా ఒకసారి తెలంగాణకు అనుకూలంగా, మరోసారి సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ప్రసంగాలు చేశారు.
హైదరాబాద్ శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఓకే చేశారు. ఆంధ్ర శాసనసభతో పాటు, తెలంగాణ అసెంబ్లీ అభిప్రాయాల ఆధారంగా ఉమ్మడి ఎపి ఏర్పడింది. తదుపరి ఎన్నో పరిణామాలు, 1969 లో ఉద్యమం రావడం, కాని 1972 నాటికి అది పూర్తిగా తగ్గిపోవడం, టిపిఎస్ పక్షాన గెలిచిన ఎంపీలంతా కాంగ్రెస్‌లో కలిసిపోవడం వంటివి జరిగాయి.
అయినా కొందరిలో తెలంగాణ ఆకాంక్ష పోలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా వారు దానిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. కాందరు నేతలు ఆ నినాదాన్ని తమ పదవీ రాజకీయాలకు వాడుకున్నది కూడా వాస్తవం. కెసిఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీలో తెలంగాణ డిమాండ్ చేయలేదు.
అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకసారి మంత్రి పదవి ఇచ్చి , 1999 ఎన్నికలలో తిరిగి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా ఉప సభాపతి పదవి ఇచ్చి అవమానించారన్న భావన ఆయనలో ఏర్పడి, తెలంగాణ మేధావులతో, ప్రత్యేక రాష్ట్ర వాదులతో ఆయన సమావేశాలు జరిపి ఒక అవగాహనకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆ నినాదాన్ని వదులుకోని మాట నిజం. అప్పడప్పుడు ఆశ, నిరాశలు ఎదురైనా , అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి ఆయన తెలంగాణ తెచ్చిన సారధిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, ముఖ్యమంత్రి కూడా అయి తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలన సాగిస్తున్నారు.
ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఉంది. ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించి ఆమె తెలంగాణను వ్యతిరేకించారని చెప్పారు. అందులో వాస్తవం లేకపోలేదు. కాని అదే సమయంలో ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి మాట్లాడకపోవడం వ్యూహాత్మకం అనుకోవాలి.
తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో ఇదే శాసనసభలో సోనియాగాంధీని ఆయన ప్రశంసించారు. కాని ఇప్పుడు ఆ ఊసే ఎత్తినట్లు కనిపించలేదు. తెలుగుదేశం పాలన, చంద్రబాబు టైమ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం తదితర అంశాలను ఆయన చెబుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం గమనించవలసిన అంశమే.
వైఎస్ అభిమానులను ఆయన దూరం చేసుకోదలచుకోలేదని అర్ధం అవుతుంది. వైఎస్ కుమారుడు జగన్ ను కాంగ్రెస్ వేదించిన సన్నివేశాన్ని వివరించి, ఆంధ్రలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది కాబట్టి, తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణలో అయినా పార్టీని నిలబెట్టుకోవాలని మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది తప్ప చిత్తశుద్ది లేదని కెసిఆర్ వాదించారు.
చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు అంటే పొక్లెయినర్‌తో గోకుడు, అవుతలపడుడు. ఇక కాంగ్రెసోళ్లు కాల్వంటూ గెల్కుడు, ఇడ్సిపెట్టుడు అంటూ నాటి నీటిపారుదల ప్రాజెక్టులపై ఎద్దేవ చేశారు. అయితే ఎనభై వేల కోట్లు వ్యయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తన ప్రసంగంలో అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు.
మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. తెలంగాణ తలసరి ఆదాయం 3.12 లక్షల రూపాయలుగా ఉన్న విషయం వాస్తవమే అయినా, పొరుగు రాష్ట్రంతో పోల్చుకోవడం సరికాకపోవచ్చు. ఎందుకంటే పొరుగు రాష్ట్రానికి హైదరాబాద్ వంటి నగరం లేదన్న సంగతి మర్చిపోకూడదు.
తన ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, దళిత బంధు, తదితర సంక్షేమ పధకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించి మళ్లీ వచ్చే ఎన్నికలలో గెలిచేది తామేనని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం ద్వారా ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోను, పార్టీ క్యాడర్ లోను ఒక ధీమా కల్పించే యత్నం చేశారు. ఇంతవరకు ఆయన సఫలీకతృతమైనట్లే అని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment