Kommineni
-
40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం
ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్‌లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది. కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది. చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
ఏదో మతలబు.. జనసైనికులకు పవన్ వెన్నుపోటు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచేలా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరు తెన్నులపై తీవ్ర విమర్శలు కురిపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో సరెండర్ అవడానికి సిద్దపడుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు ఏమి చెబితే దానికి కట్టుబడి పనిచేయడానికి పవన్ రెడీ అవుతున్న తీరు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలో కూడా ఆశ్చర్యకరమైన అధ్యాయంగా కనిపిస్తుంది. దేశంలో ఏ పార్టీ కూడా తనకంటూ ఒక లక్ష్యం లేకుండా పనిచేయదు. తనతో ఉన్నవారిని కాదని, వేరే పార్టీవారిని అందలం ఎక్కించే ప్రయత్నం చేయదు. తనతో పాటు మిగిలిన సొంత పార్టీవారంతా లొంగిపోవాలన్నట్లుగా వ్యవహరించదు. వీటన్నింటికి విరుద్ధంగా పవన్ తీరు కనిపిస్తోంది. ఈ శాసనసభ ఎన్నికలలో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశాన్ని పట్టించుకోవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో వంతు పదవులు తీసుకుందామని నమ్మబలుకుతున్నారు. దీనిని జనసైనికులు నమ్ముతారా? మహా అయితే ఆయన నటుడు కాబట్టి సినిమా పరంగా వచ్చే కొంతమంది అభిమానులు.. దేనికైనా ఊ కొట్టవచ్చేమోకాని, కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరూ దీనిని నమ్మరు. అసలు ఆత్మాభిమానం ఉన్న జనసైనికులు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలను ఒప్పుకోరు. ఎన్నికలలో పోటీచేయడానికి అడిగిన సీట్లే ఇవ్వని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఒకవేళ అధికారంలోకి వస్తే మూడో వంతు పదవులను జనసేనకు ఇస్తారా? ఒకవేళ ఇస్తానని ఇప్పుడు చెప్పినంత మాత్రానా.. ఆయన వెన్నుపోటు ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అది జరిగే పని కాదని అర్ధం అవుతుంది. జనసేనకు 60 అసెంబ్లీ సీట్లు అయినా ఇవ్వాలని కాపు సంక్షేమ సేన నేత చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. జనసేనకు ఇవ్వదగిన సీట్లను కూడా ఆయన సూచించారు. అక్కడ పోటీచేయదగిన జనసేన అభ్యర్దుల పేర్లను కూడా వెల్లడించారు. అంటే ఏమిటి దాని అర్ధం? జనసేనకు కనీసం 60 సీట్లలో పోటీచేసే సామర్ద్యం సత్తా ఉందనే కదా! దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టుబట్టలేదు? ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండాలని పవన్ ఎందుకు చెప్పడం లేదు? పైగా చంద్రబాబు కుమారుడు లోకేష్ తన పరువు తీసేలా అనుభవలేమి, అసమర్ధత గురించి ప్రస్తావించినా పవన్ ఎందుకు భరించారు? అంటే దీనంతటిలో ఏదో మతలబు ఉన్నట్లు అనిపించడం లేదా? ముఖ్యమంత్రి పదవికి తాను అనర్హుడనని పవన్ కళ్యాణ్ నేరుగానే ఒప్పుకున్నట్లేనా? తద్వారా తనను సీఎంగా చూడాలనుకుంటున్నవారిని మరింత అవమానించినట్లు కాలేదా! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి... కొన్ని రాష్ట్రాలలో చిన్న చిన్న పార్టీల నేతలు కూడా ఇలా ఇతర పార్టీలకు ఎలాంటి కండిషన్లు లేకుండా లొంగిపోలేదు. పైగా తమ డిమాండ్లు సాధించుకుని ముఖ్యమంత్రులయ్యారు. ఇతరత్రా పలు పదవులు సాధించుకున్నారు. రాజకీయాలలో అదొక ప్రక్రియ. ఎవరికైనా ప్రజాసేవ కాంక్ష ఉంటే వారు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంతే తప్ప వేరేవారి పల్లకి మోయడానికి సిద్దపడరు. పదవికన్నా మించిన ప్రయోజనం ఉంటే తప్ప! కొన్ని ఉదాహరణలు చూద్దాం. జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం పార్టీల కూటములకు ఒకసారి కూడా మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్ గా ఎన్నికైన మధు కోడా మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పరచే పరిస్థితి నెలకొంది. దానిని సదవకాశంగా తీసుకుని మధు కోడా ఏకంగా ముఖ్యమంత్రి పదవినే డిమాండ్ చేయడం, JMM కూటమి అంగీకరించడం జరిగింది. ఎందుకంటే వారు అధికారంలోకి రావాలంటే మధు కోడా మద్దతు అవసరం అయింది కనుక ఆయన షరతులకు ఒప్పుకోక తప్పలేదు. కర్నాటకలో 2013 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాలేదు. అప్పుడు JDS కీలకం అయింది. ఆ పార్టీ నేత కుమారస్వామి తనకు సీఎం పదవి ఇస్తేనే జతకడతానని స్పష్టం చేశారు. దాంతో కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన్ను ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. అంతకుముందు మరోసారి బీజేపీ కూడా ఆయన సీఎం అభ్యర్ధిత్వాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. చిన్న పార్టీ అయినా రాజకీయ వ్యూహం పన్ని తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఎవరైనా చూస్తారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీని, క్యాడర్‌ను వేరే పార్టీ ప్రయోజనం కోసం జనసేనను తనఖా పెట్టేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు పదో, పరకో సీట్లను టీడీపీ ఇచ్చినా తీసుకోవాలని, త్యాగాలకు సిద్దం అవ్వాలని పవన్ కళ్యాణ్ తరచుగా తన పార్టీవారికి సముదాయిస్తున్నారు. టీడీపీతో సంప్రదింపులు జరపకుండానే, బేషరతుగా రాజమండ్రి జైలు వద్ద పొత్తు ప్రకటన చేసి, తన పార్టీని అలాగే సైకిల్ పార్టీ వారిని విస్తుపరిచారు. అదే లైన్లో రాజకీయం చేస్తూ, ఇప్పుడు పోటీ చేయడానికి సీట్లు లేకపోయినా టీడీపీని మోయాలని సూచిస్తున్నారు. ఈ ప్రకటన చూసిన జనసేన కార్యకర్తలకు ఒక్కసారే గుండె ఆగినంత పనై ఉంటుంది. ఈయనేదో కాసిన్ని ఎక్కువ సీట్లు తీసుకుని తమందరికి అవకాశాలు ఇస్తారని అనుకుంటే పూర్తిగా చేతులెత్తేశారని, ఇప్పుడే ఇలా చేస్తే, భవిష్యత్తులో అధికారంలోకి ఒకవేళ వచ్చినా చంద్రబాబు ఎందుకు పట్టించుకుంటారన్న డౌట్‌ను వ్యక్తం చేస్తున్నారు. 2014లో టీడీపీకి జనసేన పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక్క సీటుకు కూడా పోటీచేయకుండా, పవన్ కల్యాణ్ పక్క పార్టీకి ప్రచారం చేశారు. మరి అప్పుడు జనసేనకు ఎన్ని పదవులు ఇచ్చారు? అసలు ఆ దిశగా చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏదో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడు ఒకరికి టీటీడీ పదవి.. అది కూడా సభ్యుడి పదవి ఇప్పించుకోవడం మినహాయించి. అప్పుడు ఎందుకు జనసేనకు మూడో వంతు పదవులు కోరలేదు? కేవలం చంద్రబాబు పంపించే ప్రత్యేక విమానాలలో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లి.. సన్మానాలు చేయించుకున్నారే తప్ప కార్యకర్తలు, నేతల గురించి పవన్ పట్టించుకున్నారా! నిజానికి 2014లో పవన్ కళ్యాణ్ గ్లామర్ కొంత పనిచేసింది. ఆ తర్వాత ఈయన తీరును గమనించిన ప్రజలు, జనసేన కార్యకర్తలు రియలైజ్ అయి పార్టీకి దూరం అయ్యారు. 2019లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. అదేమిటంటే జనసేన కార్యకర్తలను బలిచేసి, తాను ఒక్కడినైనా గెలవాలన్నది ఆయన ఉద్దేశం. ఆ మాట పైకి చెప్పకుండా ఎన్నికల తర్వాత మూడో వంతు పదవులు అంటూ కొత్త ఆశలు కల్పించాలని యత్నిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చే పరిస్తితి లేదు. ఒకవేళ పొరపాటున వచ్చినా, జనసేనపై ఆదారపడే పరిస్తితి లేకపోతే టీడీపీ వీరికి ఎందుకు పదవులు ఇస్తుంది. ఏదో ముష్టి వేసినట్లు ఒకటి, అరా తప్ప పదవులు రావు. ఎందుకంటే ఐదేళ్లుగా టీడీపీ నేతలే పదవులు లేకుండా ఆవురావురు మంటున్నారు. వాళ్లకు పదవులు ఇవ్వకుండా జనసేనకు మూడో వంతు పదవులు కట్టబెడితే టీడీపీ పని గోవింద అవుతుంది. ఆ సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. నిజంగానే చంద్రబాబుకు అంత త్యాగబుద్ది ఉంటే ఇప్పుడే జనసేనకు అరవై సీట్లు ఇవ్వవచ్చు కదా! లేదూ కనీసం నలభై నుంచి ఏభై సీట్లు ఇవ్వవచ్చు కదా! రెండు పార్టీలకు భలం ఉందనుకుంటే జనసేన పోటీచేసే చోట్ల టీడీపీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వవచ్చు కదా! జనసేన సపోర్టు కావాలి? జనసేనకు మాత్రం బలం లేని చోట్ల టీడీపీ మద్దతు ఇచ్చి గెలిపించలేదన్నమాట. దీనిని బట్టే ఏమి అర్ధం అవుతుంది. త్యాగాలు జనసైనికులవి. గెలిస్తే పదవులు, భోగాలు టీడీపీ వారివి అన్నమాట. ఈ సంగతి పైకి చెప్పకుండా పవన్ కళ్యాణ్ కొత్త డ్రామాకు తెరదీశారన్నమాట. పైగా పదేళ్లపాటు పొత్తు ఉంటుందని ఇప్పటికే చెప్పారు. అంటే దీని ప్రకారం జనసైనికులు ఎప్పటికీ టీడీపీ సేవకులుగానే మిగిలి ఉండాలన్నమాట. ఈ రకంగా జనసేన భవిష్యత్తుకు పార్టీ అధినేతే సీల్ వేసేశారన్నమాట. ఈ మొత్తం ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలిస్తే జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడవడానికి సిద్దపడ్డారని అనుకోవచ్చు. కాగా టీడీపీ వారితో పొత్తు బీజేపీకి ఇష్టం లేదని, తనుఒత్తిడి చేసి పొత్తు కుదుర్చుతున్నానని పవన్ అన్నారట. అంటే ఆయన రాజకీయ దళారిగా మద్యవర్తిత్వం చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని, వారితో కాపురం చేయకుండా టీడీపీ వద్దకు వెళ్లి రాజకీయ సంసారం చేస్తూ, రాజకీయాలలో కూడా అక్రమ సంబంధాలు నెరపవచ్చని పవన్ కళ్యాణ్ కొత్త సూత్రం తయారు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సాగుతున్న ఈ అక్రమ, అనైతిక రాజకీయ సంబంధాలు దేశంలో మరెక్కడ చూడబోం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తీరుతెన్నులు తన పార్టీవారిని అవమానపరచేవిగా ఉన్నాయని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
దిగజారుడుతనానికి కేరాఫ్ చంద్రబాబే
'తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజంగానే తన వయసుకు తగ్గట్లు మాట్లాడడం లేదు. ఏదేదో, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి తీసుకు వెళుతున్నారు. రా.. కదలిరా..! అంటూ జరుపుతున్న సభలలో ఎందుకు ప్రజలు కదలి రావాలో చెప్పకుండా, ఎంత సేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను దూషించే పనిలో ఉంటున్నారు దీంతో టీడీపీ క్యాడర్ ఇంతకీ చంద్రబాబు ఏమి చెప్పారన్న సంశయంలో పడిపోతున్నారు.' కొద్ది రోజుల క్రితం ఇంకొల్లులో జరిగిన సభలో ఆయన తన వయసు, తాను గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించానన్న సంగతిని విస్మరించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను నోటికి వచ్చినట్లు తిట్టడం శోచనీయం అని చెప్పాలి. ఈ దిగజారుడు మాటల్లో హైలైట్ ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి అవసరానికి కాళ్లు పట్టుకుంటాడు.. తర్వాత కాళ్లు లాగేస్తాడు.. అని చంద్రబాబు అనడం. ఇది తన గురించి తాను చెప్పుకోబోయి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నింద మోపినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన ఎవరి కాళ్లు పట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో ఒక్కశాతం కూడా ఓట్లు లేని బీజేపీతో పొత్తుకోసం ఎవరు కాళ్లా, వేళ్ల పడుతున్నది ఏపీ ప్రజలందరికీ తెలుసు. జనసేన సీట్లు, టీడీపీ సీట్లు, అభ్యర్దులను ఖరారు చేయకుండా దేవుడా, దేవుడా అంటూ ప్రార్ధన చేస్తూ కూర్చున్న చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. తాను చేసే పనులను ఎదుటివారిపై నెట్టడంలో సిద్దహస్తుడైన చంద్రబాబు గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లు ప్రధాని మోదికి దత్తపుత్రులు అని, మోది అంటే భయపడుతున్నారని రంకెలు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చేవారు. చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీకి సరెండర్ అవుతున్నారు? మరి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడైనా తనకు బీజేపీతో పొత్తు కావాలని మోదిని కాని, అమిత్‌షాను కాని బతిమలాడారా? లేదే! అయినా చంద్రబాబు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పడం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు పిలుస్తారా.. అన్నట్లుగా, ఆయన కంటి చూపు పడితే చాలు.. అన్నట్లుగా చకోర పక్షిలా వేచి ఉన్న చంద్రబాబు ఎదుటివారిపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. చంద్రబాబు బీజేపీని అవసరమైనప్పుడు కాళ్లావేళ్లపడి బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారిని చీ కొట్టి, అవమానించి విడిపోయారు. దానిని కదా అనాల్సింది. అవసరమైతే జుట్టు.. లేకుంటే కాళ్లు అని.. అయినా ఆయన దబాయించి ఎదుటివారిపై నోరుపారేసుకుంటున్నారు.తాను స్కిల్ స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పుడు తన కుమారుడు లోకేష్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వద్దకు ఎందుకు చంద్రబాబు పంపించారు. కాళ్లు పట్టుకోవడానికా? లేక అమిత్‌షా చొక్కా పట్టుకోవడానికా? ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం స్వయంగా చంద్రబాబే ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో సరదా కబుర్లు చెప్పి వచ్చారా? లేక ఆయన వద్ద చేతులు కట్టుకుని కూర్చుని కాళ్లా, వేళ్లాపడి పొత్తు ప్లీజ్ అని బతిమలాడారా? ఏదో తన బినామీ పత్రికలు ఉన్నాయి కదా అని అమిత్‌షానే రమ్మంటే వెళ్లానని ప్రచారం చేసుకున్నారు. అదే మాట 'షా' తో ఎందుకు చెప్పించలేకపోయారు! తనను కలిసిన పదిరోజులు దాటినా, పొత్తు గురించి చంద్రబాబు ఎదురుచూసేలా అమిత్‌షా చేశారంటే ఏమిటి దాని అర్ధం!. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ మసీదులు కూల్చేపార్టీ అని ప్రచారం చేశారు. 1998 ఎన్నికల తర్వాత వారి గూట్లో చేరిపోయారు. 2004లో ఓటమి తర్వాత ముస్లీంలకు ద్రోహం చేసే బీజేపీతో కలిసి తప్పు చేశానని, జీవితంలో ఎప్పుడూ కలవబోనని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదిని నరహంతకుడు అనే వరకు వెళ్లారు. ఆ తర్వాత పార్లమెంటులో దీనికి సంబంధించి ఓటింగ్ జరిగినప్పుడు తన ఎంపీలు జారుకునేలా చేశారు. దీనిని కాళ్లబేరం అని కదా అనాల్సింది. 2009లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసిపొత్తు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత వాళ్లను గాలికి వదలివేసి మళ్లీ బీజేపీ వైపు పరుగులు తీశారు. ఏ మోదినైతే తిట్టారో తిరిగి ఆయన దేశంలో ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బాబ్బాబు.. ప్లీజ్.. ఈ ఒక్కసారి మన్నించండని కోరింది చంద్రబాబు కాదా! మళ్లీ 2018 నాటికి మోదిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చివరికి మోదిని ఉగ్రవాది అని కూడా దూషించిన చరిత్ర చంద్రబాబుది. దానిని కాళ్లులాగడమంటే అనేది. అవన్ని ఎందుకు! చంద్రబాబుకు పిల్లను ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు నిత్యం పాద నమస్కారాలు చేస్తున్నట్లు నటించి, లటక్కున ఆయనను కుర్చీ నుంచి లాగిపారేసింది చంద్రబాబే కదా! దానిని కదా కాళ్లు లాగేడయమనేది. ఆ దెబ్బకే కదా ఎన్టీఆర్ గుండె ఆగి మరణించింది! అయినా చంద్రబాబు అవేమీ జరగనట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడైనా ఎవరి కాళ్లమీదైనా పడ్డారా? కాళ్లు పట్టుకుని లాగారా? లేదే! ఆయన శంషేర్‌గా దేశంలోనే అత్యంత శక్తిమంతురాలిగా ఉన్న సోనియాగాంధీని, కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్న చంద్రబాబును ఎదుర్కుని, వారు పెట్టిన అక్రమ కేసులను భరించి జైలుకు వెళ్లి, తదుపరి ఎన్నికలలో నిలబడి గెలిచిన ధీశాలి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న సంగతి అందరికి తెలిసిందే. అందువల్ల చంద్రబాబు తన చరిత్ర ఎవరికి తెలయదనుకుని భ్రమపడి ఏదిపడితే అది మాట్లాడితే , ప్రజలకు పాత చరిత్ర గుర్తుకు వస్తుందని మర్చిపోకూడదు. చంద్రబాబు దెబ్బకు వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడ్డాడట. ఇదొక వండర్! ఇలాంటి మాటలు చెప్పడం అంటే వినేవాడు వెర్రివాడులే అన్న ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. డెబ్బై నాలుగేళ్ల వయసులో ప్రజలను మద్యం తాగవద్దు అని చెప్పకుండా, మంచి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను.. నాకే ఓటేయండని ఆయన పిలుపు ఇస్తున్నారంటే ఇంతకంటే అద్వాన పరిస్థితి ఉంటుందా! ఎవరు అడ్డువచ్చిన తొక్కివేస్తారట! ఇదేమి గోలో అర్థం కాదు. ఎవరిని తొక్కుతారు! అసలు చంద్రబాబును ఎవరైనా ఎందుకు అడ్డుకుంటారు? తెలుగుదేశంకు అంత సీన్ ఉందా! అని చర్చించుకుంటున్న తరుణంలో ఆయనకు ఆయనే బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. దానివల్ల రాజకీయంగా ఆయనకు జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి తన ముందు బచ్చా అని చంద్రబాబు అనడం మరో పిచ్చి వ్యాఖ్య. రాజకీయాలలో బచ్చా, బడా అని ఉండరు. ఎన్టీ రామారావు ముందు ఈయన బచ్చానే కదా! ఆయనను ఎందుకు కుర్చీనుంచి లాగి పారేశారు. 2019లో చంద్రబాబును ఎన్నికలలో ఓడించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బచ్చా ఎలా అవుతారు! హీరో అవుతారు కాని. ఒంటరిగా పోటీచేయడానికి సిద్ధం అవుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బచ్చా అవుతారా? లేక తాను వాళ్ల మద్దతు, వీళ్ల మద్దతు లేకపోతే ఎన్నికలలో నిలబడలేనని భయపడుతున్న చంద్రబాబు బచ్చా అవుతారా! ఇలాగే ఆయన స్పీచ్‌లు కొనసాగిస్తే.., మతి స్థిమితం లేని మాటలు చంద్రబాబు నోట పదే, పదే వస్తున్నాయని జనం, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ అనుకుంటారు. ఆ విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. మరో వైపు ఆయనకు రాజగురువునని భావించే రామోజీరావు అంతకన్నా మతిలేని వార్తలు రాస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం కక్కుతున్నారు. నిజానికి ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాదు విషం చిమ్ముతున్నది. ఏపీ ప్రజలపైన అని చెప్పాలి. ఉన్నవి, లేనివి కల్పించి అబద్దాలు సృష్టించి నానా చెత్త అంతా పోగు చేసి ప్రజలను మోసం చేయాలని రామోజీ చేస్తున్న వికృతచర్యలు కచ్చితంగా ప్రజలందరు అసహ్యించుకునే దశకు చేరుకున్నాయి. చివరికి తెలుగుదేశం క్యాడర్ కూడా చీదరించుకునే పరిస్థితిని రామోజీ తెచ్చుకున్నారు. రామోజీనేమో తన పిచ్చి రాతలతో, చంద్రబాబేమో తన పిచ్చి మాటలతో ఏపీ ప్రజలను విసిగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిస్తే కానీ, వారి పిచ్చి కుదరదేమో! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
రామోజీ మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే..
ఈనాడు మీడియా, దాని అధినేత రామోజీరావు బరి తెగించారు. అది కూడా నడి రోడ్డుపై బట్టలు ఊడదీసుకుని తిరగడానికి సిగ్గుపడని విధంగా. నిత్యం నీచ కథనాలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈనాడు, ఆ ప్రక్రియలో మరో లెవెల్‌కు దిగజారింది. ఏపీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కిన తీరు చూస్తే ఏపీ ప్రజలు ఇంకా ఈ పత్రికను ఎలా భరిస్తున్నారా? అనే అభిప్రాయం కలుగుతుంది. పార్టీలకు అతీతంగా ఈనాడును అసహ్యించుకునే పరిస్థితి తెచ్చిపెట్టుకుంటున్నారు. తెలుగుదేశం గెలవాలని, తమ ఎదుట చేతులు కట్టుకుని కూర్చునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరిక ఉంటే ఉండవచ్చు. కానీ, అందుకోసం ఈనాడు పత్రికను, టీవీ ని ఇంత ఘోరంగా తాకట్టు పెట్టాలా? తన భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు.. ఏపీ ప్రజలు తనను చీదరించుకున్నా పర్వాలేదు.. ఏపీపై మాత్రం పగపట్టిన విషపురుగు మాదిరి వ్యవహరించాల్సిందేనని రామోజీరావు భావిస్తున్నట్లుగా ఉంది. లేకుంటే బుధవారం నాడు ఈనాడు దినపత్రికలో వలంటీర్లపై రాసిన ఈ కథనం చదివితే, కాస్త విజ్ఞత ఉన్న ఎవరికైనా ఒళ్లు మండుతుంది. ఆ పత్రికను వెంటనే చెత్తబుట్టలో వేయాలనిపిస్తుంది. 88 ఏళ్ల వయసులో ఉన్న రామోజీరావు కోట్లు ఉన్నాయన్న అహంకారంతో, కొండమీద కూర్చున్నా తనకు పనిచేసేవారు ఉంటారన్న అహంభావంతో నిరుపేదలను ఈసడించుకుంటున్నారు. పేదరికంలో మగ్గుతూ ఉండే వృద్ధులు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ను జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తమ ఇళ్ల వద్దే అందుకుంటున్న తీరు చూసి రామోజీ అసూయతో కుళ్లుతున్నారు. తన పెత్తందారి బుద్ధితో తక్కువ వేతనంతో గౌరవ వలంటీర్లుగా సమాజానికి సేవ చేస్తున్న అల్పజీవులపై కూడా పడి ఏడుస్తున్నారు. పాపం, పుణ్యం వంటి వాటితో నిమిత్తం లేకుండా రామోజీ బృందం ఇంత దారుణంగా ఏపీ సమాజాన్ని తన పత్రిక, టీవీ ద్వారా పీడిస్తోంది. తెల్లవారే సరికి కొన్ని లక్షల పేపర్లను తెలుగుదేశం కరపత్రికల కన్నా హీనంగా మార్చి ప్రజలపై దాడి చేస్తోంది. అవసరమైతే ఉచితంగా కూడా పత్రికను పంచిపెట్టడానికి రామోజీరావు సిద్దం అయ్యారంటేనే ఆయన మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ జగన్ చేసిన తప్పేమిటి? పేద ప్రజలకు అండగా నిలబడడమేనా! వలంటీర్ల తప్పు ఏమిటి? జగన్ ప్రభుత్వం కోరిన విధంగా ప్రజలందరికీ పౌర సేవలు అందించడమేనా? నెల మొదటి తేదీ వస్తే చాలు వృద్ధుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మూడువేల రూపాయలు చేతికి ఇస్తున్న వైనాన్ని ఈనాడు రామోజీరావుకు కనబడకపోవచ్చు. ఎందుకంటే ఆయన కొండపై ఉంటారు కనుక. ఆయన వద్ద పనిచేసే సంపాదకులకు, జర్నలిస్టులకు ఏమైంది? పచ్చి అబద్ధాలు రాయడానికి సిగ్గుపడడం లేదంటే ఇదంతా రామోజీ ఇచ్చే నాలుగు జీతపు రాళ్లకు ఆశపడేకదా! ఈనాడు జర్నలిస్టులు కాస్త అయినా ఆత్మగౌరవంగా బతకలేకపోతున్నారని ఈ కథనం చదివితే అర్థమైపోతుంది. వలంటీర్లు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను ఇళ్లవద్దకే చేర్చుతున్న సంగతి ఈనాడు ప్రతినిధులకు తెలియదా? దాని గురించి ఒక్క ముక్క ఏనాడైనా రాశారా? రామోజీరావు ఆదేశాల మేరకు మంచి విషయాలు రాయడం లేదా? మంచి రాయవద్దు, మంచి వినవద్దు, మంచి చూడవద్దు అన్న చందంగా వీరు వ్యవహరిస్తున్నారు. నిజానికి ఆ కోతులే బెటర్. తనపై ఎవరైనా ఒత్తిడి చేస్తే ఎదురుతిరుగుతాయి. కానీ, ఈనాడు జర్నలిస్టులు మాత్రం వెన్నుముఖ లేకుండా పనిచేస్తున్నారనిపిస్తుంది. ఈ మధ్య ఒక సీఎం వద్ద గతంలో పనిచేసిన సీపీఆర్ఓ ఒకరు కలిశారు. ఆయన శ్రీకాకుళం జిల్లా వాసి. ఆయన అమెరికాలో ఉంటున్న తన కుమార్తె గ్రీన్ కార్డు అవసరం నిమిత్తం తన గ్రామంలో పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం వలంటీర్ ద్వారా దరఖాస్తు చేశారు. కనీసం ఒక వారం అయినా పడుతుందేమో అని ఆయన అనుకున్నారు. కాని ఆయన ఆశ్చర్యపోయే విదంగా సాయంత్రానికి బర్త్‌డే సర్టిఫికెట్లను వలంటీర్‌ను తెచ్చి ఇచ్చారు. ఆ విషయాన్ని నాతో పంచుకుని వలంటీర్లు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పారు. కానీ, ఈనాడు రామోజీరావు మాత్రం వారిపై విషం కక్కుతున్నారు. చివరికి ఏ స్థాయికి వెళ్లారంటే వారిని గూఢచారులతో పోల్చి అవమానించారు. జగన్ ప్రభుత్వం తను అమలు చేస్తున్న స్కీములతో కాకుండా, వలంటీర్లతోనే గెలిచేస్తున్నట్లు రామోజీ భయపడుతున్నారు. వారిని సంఘ విద్రోహ శక్తులుగా, మానభంగాలు చేసేవారిగా ప్రొజెక్టు చేస్తూ ఈనాడు రాసిన తీరు గమనిస్తే ఇంత ఘోరంగా రామోజీ, ఆయన బృందం నిస్సిగ్గుగా నడిబజారులో బట్టలు ఊడదీసుకుని తిరగాలా ? అనిపిస్తుంది. తెలుగుదేశం వద్ద పాజిటివ్ ఎజెండా లేకపోవడం వల్లే ఈనాడుమీడియా ఈ అరాచకపు రాతలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ చీకటి వ్యవహారాలకు వలంటీర్లు సహకరిస్తున్నారట!. ప్రజల వద్దకు వలంటీర్లను పంపించి, వారి అవసరాలను తీర్చడం చీకటి పని అట!.. మరి ఈనాడు రామోజీ వార్తలు సేకరించవలసిన విలేకరులను జనంమీదకు పంపి ఎందుకు ఇతర పనులు చేయించుకుంటున్నారు? ఎంతమంది ఈనాడు విలేకరులు అవినీతికి పాల్పడుతున్నారు? ఎక్కడ ఏచిన్న గొడవ జరిగినా సైంధవుల్లా ఈనాడు విలేకరులు తయారై, ఆ గొడవను వైసిపికి పులిమే పనిలో ఉంటూ ఛండాలంగా వ్యవహరిస్తున్నారు. మరి వారందరి గురించి ఎప్పుడైనా రామోజీ ఆలోచించారా? ఎవరో కొద్ది మంది వలంటీర్లు తప్పు చేస్తే మొత్తం వ్యవస్థనంతటిని తప్పు పడతారా? సమాజంలో అనేక నేరాలు జరుగుతుంటాయి. వాటికి ఎవరు బాధ్యత వహించాలి. కొంతకాలం క్రితం విజయవాడలో ఒక టీడీపీ నాయకుడికి రేప్ కేసులో శిక్ష పడింది. అందువల్ల టీడీపీలో అంతా రేపిస్టులే అని అంటారా! అంతదాకా ఎందుకు? రామోజీ ఫిలిం సిటీలో వందల ఎకరాలు రామోజీ ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపిస్తూ కొన్ని డాక్యుమెంట్లు కూడా చూపుతుంటారు. మరి రామోజీ తాను కబ్జాదారుడినని అంగీకరిస్తారా? మార్గదర్శిలో వందల కోట్ల నల్లధనాన్ని మళ్లించారని ఏపీ సిఐడి ఆరోపిస్తోంది. దానిని ఒప్పుకుంటారా? తన వద్ద డిపాజిట్ చేసిన వారి వివరాలను పారదర్శకంగా ఇవ్వడానికి రామోజీ ఎందుకు వెనుకాడుతున్నారు. అసలెందుకు! మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాను స్వయంగా రామోజీని కలుస్తానని, తను ఆయనపై వేసిన కేసులో పూర్తి వివరాలు ఇచ్చి తనను సంతృప్తి వరిస్తే తన ఆరోపణలను ఉపసంహరించుకుంటానని పలుమార్లు ప్రకటించినా ఎందుకు నోరు విప్పడం లేదు?న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి, ఉండవల్లి వేసిన కేసులో ఆయనకు తెలియకుండానే తీర్పు తెప్పించుకున్నారే? ఇది ఏపాటి నీతో రామోజీనే చెప్పాలి. తనకు లీజుకు ఇచ్చిన పాపానికి స్థలాల యజమానులను ముప్పుతిప్పలు పెట్టిన రామోజీ రాసే చెత్త రాతలను ప్రజలు ఎలా నమ్మాలి? తెల్లవారి లేస్తే వాళ్ల మీద, వీళ్ల మీద ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తూ ప్రజలను పీడిస్తున్న ఈనాడు, ఆ మీడియా అధిపతి రామోజీరావు ఉన్మాదులుగా మారారంటే ఆశ్చర్యం కాదు. నిజానికి ఇలా రాయడం బాధగానే ఉంటుంది. అయినా నిజం నిప్పులాంటిది. అలాంటివాటిని మాబోటి వాళ్లు కూడా రాయకపోతే ఈనాడు అరాచకాలకు అంతే ఉండదు. మా బోటివాళ్లం ఎంత చెప్పినా, ఏ మాత్రం సిగ్గుపడకుండా చెత్తా, చెదారం రాసి పాఠకుల మీద వదలుతున్నారు. వలంటీర్లు గూఢచారులుగా పనిచేస్తున్నారా? లేక ఈనాడు విలేకరులు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారా? కల్పిత కధనాలతో ప్రజలలో జగన్ ప్రభుత్వంపై విద్వేషం నింపడానికి వారు చేస్తున్న ప్రయత్నం అందరికి తెలుసిపోతోంది. ఈనాడు రామోజీరావుకు ధైర్యం ఉంటే ఒక మాట చెప్పాలి. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి కమిటీలు మంచివని, వారు అవినీతికి పాల్పడినా, ప్రజలను వేధించినా, ఆ వ్యవస్థే మంచిదని మొదటి పేజీలో రాయాలి. అప్పట్లో జరిగిన జన్మభూమి కమిటీల అరాచకాల గురించి ఎన్నడైనా ఈ పత్రిక వార్త ఇచ్చిందా? అప్పుడేమో అలాంటి అక్రమాలన్నిటిని భుజాన వేసుకుని, ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తున్న వలంటీర్లపై పడి ఏడుస్తారా? ఎవరైనా ఒకరిద్దరు వలంటీర్లు తప్పు చేస్తే మొత్తం అందరిపై బురద జల్లుతారా? రామోజీపై ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా! వాటికి ఆయన ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. కేవలం జగన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో ఉండడాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్ని కాదు! రామోజీ ఏమి చెబితే అది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేస్తారు కదా? ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అవుతారు కదా! అందుకే వారితో ఈ వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటన ఇప్పించాలి. ఇకపై వృద్దులు పాతపద్దతిలోనే కిలోమీటర్ల దూరం డేక్కుంటూ వెళ్లి పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిందే. అవసరమైన సర్టిఫికెట్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో కాకుండా మండల ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిందే అని రామోజీ చెబుతారా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వలంటీర్లను అవమానించినవారే. కాని ఇప్పుడు ఆయన స్వరం మార్చి తాను అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తానని ప్రచారం చేస్తున్నారని, దానిని నమ్మవద్దని అంటున్నారు కదా! వలంటీర్లను కొనసాగిస్తానని ఆయన నమ్మబలికే యత్నం ఎందుకు చేస్తున్నారు? పవన్ కల్యాణ్ అయితే ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం కంటే ఇంకా ఎక్కువే ఇస్తానని ఎందుకు చెబుతున్నారు? వారిని రామోజీ ఎందుకు నిలదీయరు? వారిద్దరూ ఏమి చేసినా రామోజీకి కమ్మగా ఉంటుందా? రామోజీ, చంద్రబాబులు ఇద్దరు కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబేమో తాను వలంటీర్లను కొనసాగిస్తానంటారు.. రామోజీనేమో వారిపై విషం చిమ్ముతారు.. తద్వారా వీరిద్దరూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. కాని వలంటీర్ల సేవలను పొందుతున్న సాధారణ ప్రజానీకం వీరి ఆటలను సాగనిస్తుందా! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మరాఠీ. ఆయన చెబుతున్నవి వింటుంటే చరిత్రలోకి మనం వెళ్లిపోతున్నాం అనిపిస్తుంది. తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలు తనదైన భాషలో చెబుతూ , దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు అనేక మంది కాంగ్రెస్ వారిని ఆయన ఏకిపారేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా విమర్శలు చేసినా, ఈసారి ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీపైనే దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అది దర్పణం పడుతుందనిపిస్తుంది. మరో మూడు , నాలుగు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. శాసనసభ సమావేశాలలో ఆయన ఉపన్యాసం ఇవ్వడం ఎప్పుడూ జరిగేదే కాని, ఈసారి చేసిన ప్రసంగానికి నేపధ్యం వచ్చే ఎన్నికలే అని వేరే చెప్పనవసరం లేదు. ఈ టరమ్ కు అసెంబ్లీలో ఇదే చివరి స్పీచ్ కావచ్చు. అందుకే ఆయన కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదునైన విమర్శలతో ఒక రకంగా విరుచుకుపడ్డారని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రెండు ఉప ఎన్నికలలో బిజెపి గెలవడం, ఒక ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలవడానికి చాలా కష్టపడాల్సిరావడం వంటి కారణాలతో అప్పట్లో తెలంగాణలో బిజెపి బాగా పుంజుకుంటుందని చాలామంది భావించారు. కాని కర్నాటక శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడం, తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఆశించిన రీతిలో క్యాడర్ ను తయారు చేసుకోలేకపోవడం, పార్టీలో చోటు చేసుకున్న విబేధాలు తదితర కారణాలతో బిజెపి వెనుకబడిపోతోందన్న అభిప్రాయం ఏర్పడింది. అదే టైమ్ లో కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలకు జోష్ పెరిగింది. అంతవరకు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినా, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీనిని గమనించిన కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రగతి పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి పురోగతి సాధించింది వివరించడంతో పాటు అసలు తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని ఆయన సూత్రీకరించారు. ఇందుకోసం 1956లో ఉమ్మడి ఎపి రాష్ట్రం ఏర్పాటుకు ముందునుంచి జరిగిన ఆయా రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో తెలియచేశారు. చరిత్రను ఎవరు ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఒక కోణం ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసినవారిలో కెసిఆర్ ఒకరు. తెలంగాణను తెచ్చిందెవరు అన్నది పక్కనబెడితే, తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, దానికి నెహ్రూ నిర్ణయమే కారణమని ఆయన స్పష్టం చేశారు. 1956కి ముందు ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం. అంటే తెలంగాణ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలలో రాష్ట్రం ఉండేది. తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశం దేశవ్యాప్తంగా బలీయంగా వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలోకాని, తెలంగాణలో కాని తెలుగువారంతా ఒకటికావాలన్న ఆకాంక్ష ఉండేది. తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన మాట నిజం. జవహర్ లాల్ నెహ్రూ ఆశ్చర్యంగా ఒకసారి తెలంగాణకు అనుకూలంగా, మరోసారి సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ప్రసంగాలు చేశారు. హైదరాబాద్ శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఓకే చేశారు. ఆంధ్ర శాసనసభతో పాటు, తెలంగాణ అసెంబ్లీ అభిప్రాయాల ఆధారంగా ఉమ్మడి ఎపి ఏర్పడింది. తదుపరి ఎన్నో పరిణామాలు, 1969 లో ఉద్యమం రావడం, కాని 1972 నాటికి అది పూర్తిగా తగ్గిపోవడం, టిపిఎస్ పక్షాన గెలిచిన ఎంపీలంతా కాంగ్రెస్‌లో కలిసిపోవడం వంటివి జరిగాయి. అయినా కొందరిలో తెలంగాణ ఆకాంక్ష పోలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా వారు దానిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. కాందరు నేతలు ఆ నినాదాన్ని తమ పదవీ రాజకీయాలకు వాడుకున్నది కూడా వాస్తవం. కెసిఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీలో తెలంగాణ డిమాండ్ చేయలేదు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకసారి మంత్రి పదవి ఇచ్చి , 1999 ఎన్నికలలో తిరిగి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా ఉప సభాపతి పదవి ఇచ్చి అవమానించారన్న భావన ఆయనలో ఏర్పడి, తెలంగాణ మేధావులతో, ప్రత్యేక రాష్ట్ర వాదులతో ఆయన సమావేశాలు జరిపి ఒక అవగాహనకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆ నినాదాన్ని వదులుకోని మాట నిజం. అప్పడప్పుడు ఆశ, నిరాశలు ఎదురైనా , అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి ఆయన తెలంగాణ తెచ్చిన సారధిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, ముఖ్యమంత్రి కూడా అయి తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఉంది. ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించి ఆమె తెలంగాణను వ్యతిరేకించారని చెప్పారు. అందులో వాస్తవం లేకపోలేదు. కాని అదే సమయంలో ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి మాట్లాడకపోవడం వ్యూహాత్మకం అనుకోవాలి. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో ఇదే శాసనసభలో సోనియాగాంధీని ఆయన ప్రశంసించారు. కాని ఇప్పుడు ఆ ఊసే ఎత్తినట్లు కనిపించలేదు. తెలుగుదేశం పాలన, చంద్రబాబు టైమ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం తదితర అంశాలను ఆయన చెబుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం గమనించవలసిన అంశమే. వైఎస్ అభిమానులను ఆయన దూరం చేసుకోదలచుకోలేదని అర్ధం అవుతుంది. వైఎస్ కుమారుడు జగన్ ను కాంగ్రెస్ వేదించిన సన్నివేశాన్ని వివరించి, ఆంధ్రలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది కాబట్టి, తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణలో అయినా పార్టీని నిలబెట్టుకోవాలని మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది తప్ప చిత్తశుద్ది లేదని కెసిఆర్ వాదించారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు అంటే పొక్లెయినర్‌తో గోకుడు, అవుతలపడుడు. ఇక కాంగ్రెసోళ్లు కాల్వంటూ గెల్కుడు, ఇడ్సిపెట్టుడు అంటూ నాటి నీటిపారుదల ప్రాజెక్టులపై ఎద్దేవ చేశారు. అయితే ఎనభై వేల కోట్లు వ్యయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తన ప్రసంగంలో అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. తెలంగాణ తలసరి ఆదాయం 3.12 లక్షల రూపాయలుగా ఉన్న విషయం వాస్తవమే అయినా, పొరుగు రాష్ట్రంతో పోల్చుకోవడం సరికాకపోవచ్చు. ఎందుకంటే పొరుగు రాష్ట్రానికి హైదరాబాద్ వంటి నగరం లేదన్న సంగతి మర్చిపోకూడదు. తన ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, దళిత బంధు, తదితర సంక్షేమ పధకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించి మళ్లీ వచ్చే ఎన్నికలలో గెలిచేది తామేనని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం ద్వారా ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోను, పార్టీ క్యాడర్ లోను ఒక ధీమా కల్పించే యత్నం చేశారు. ఇంతవరకు ఆయన సఫలీకతృతమైనట్లే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పనిలో ఉంటే మనసూ బాగుంటుంది
స్త్రీలకు రిటైర్మెంట్ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ‘కాని అలా ఉంటే బోర్. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి, సూపర్వైజర్గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది. కష్టమనుకుంటే కుదరదు ‘ఎ.ఎన్.ఎమ్‌గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్ఎమ్ నుంచి సూపర్వైజర్గా చేసి, రిటైర్ అయ్యాను’ అంటుందామె. ప్రయత్నాలు ఫలవంతం ‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను. పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె. మరవని సేవ.. ‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను. అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి. విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఎమ్మెల్యే నాపై కక్ష కట్టారు...
జామి: గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తనపై కక్ష కట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ విజినిగిరి సర్పంచ్ కొమ్మినేని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వేధింపులపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు చెందిన విజయనగరంలోని అశోక్ బంగ్లాలో మూడు పేజీల లేఖను అందజేశారు. ఎమ్మెల్యే నాయుడు, మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న గొర్రెపాటి శ్రీనువాసరావు కలసి తనను వేధిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేయడమే తప్పా అని ప్రశ్నించారు. పార్టీకి ఎన్నో సేవలందించిన తనపై ఎమ్మెల్యే కక్ష కట్టారని ఆరోపించారు. పార్టీలో వర్గాలు ఏర్పాటు చేసి నష్టం కలుగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా రూ.70లక్షల పనులను వేరే వారికి అప్పగించారని ఆరోపించారు. తన చెక్‌పవర్‌ను రద్దు చేయించి, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆవేదన చెందారు. -
సకల కుట్రలకూ చంద్రబాబే సూత్రధారి
ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మాట జవదాటలేదని అందుకే పార్టీని చీల్చాల్సి వచ్చిందని నాపై చేస్తున్న ఆరోపణ పరమదుర్మార్గం. నాకు అధికార కాంక్షే ఉన్నట్లయితే, ఎన్టీఆర్ నా మాట ప్రకారమే నడుచుకుని ఉంటే, నేను ఎన్నికల్లో పోటీ చేసి ఉండేదాన్ని కదా. వదినమ్మకు పార్టీలో, ప్రభుత్వంలో ఏదైనా స్థానం కల్పిస్తే బాగుంటుందని మోహన్ బాబు స్వయంగా ఎన్టీఆర్‌తో చెప్పారు. చివరకు తనకు ఆరోగ్యం బాగాలేదని, నా తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను కాబట్టి ఏదైనా మంత్రి పదవిలో చేరు అని ఎన్టీఆర్ స్వయంగా చెప్పినా నేను ముందుకు రాలేదు. ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ఇన్నేళ్లుగా ఏ ఒక్కరూ వీటిని బయటకు చెప్పకపోవడమే నా దురదృష్టం. తెలుగు దేశం పార్టీని పెంచి పోషించిన నందమూరి తారకరామారావుకు వ్యతిరేకంగా పార్టీలోపల సాగించిన సకల కుట్రలకూ ఆయన అల్లుడు చంద్రబాబునాయుడే సూత్రధారి అని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన ఇష్టంతో, సమ్మతితో ప్రవేశించిన విషయాన్ని దాటవేయడమే కాకుండా, లక్ష్మీపార్వతి కారణంగా టీడీపీ గెలవదనీ, ప్రజలు ఆ వివాహాన్ని ఆమోదించరని, ఆడవాళ్లు చాలా కోపంగా ఉన్నారని పత్రికలలో ప్రచారం చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తీరా, ప్రభంజనం సృష్టించి 1994 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే, తనపై రాజ్యాంగేతర శక్తి అనే ముద్రవేసి అతి స్వల్ప కాలం లోనే కనీవినీ ఎరుగని కుట్రలకు పాల్పడి ఎన్టీఆర్‌ని గద్దె దింపి, ఆయన మరణానికి కూడా కారణమయ్యారని చెబుతున్న లక్ష్మీపార్వతి అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... మీ సుదీర్ఘ అనుభవంలో ప్రస్తుత వ్యవస్థపై, రాజకీయాలపై మీ అభిప్రాయం? 1993 నుంచి ఎన్టీఆర్‌తో వివాహం తర్వాత వ్యక్తిగత జీవిత పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ వెంటనే రాజకీయ సమస్యలు ఎదురయ్యాయి. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టింది కాబట్టి ఇక తెలుగుదేశం గెలవదు. ద్వితీయ వివాహం చేసుకున్నారు కనుక ప్రజలు ఎవ్వరూ ఆమోదించరు. ఈ పరిణామంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఆడవాళ్లయితే ఇంకా కోపంగా ఉన్నారు. ఈ వయసులో ఈ పని చేయడం ఏమిటి అని ఇలాంటి పుకార్లు వచ్చాయి. వీటిని ఎవరు వ్యాపింపజేస్తున్నారో నాకయితే అర్థమయ్యేది కాదు. తెల్లారిలేచి పేపర్ చూడాలంటేనే భయమేసేది. ఎన్టీఆర్ అయితే పేపర్ చూడరు కాబట్టి ఇబ్బందే లేదు. కానీ నాకయితే పేపర్ రోజూ చదవటం అలవాటు. పేపర్ చదవడం నేను బాధపడటం.. ఏమైంది పేపర్ చదివావా అని ఆయన అడగటం. అవునండీ అంటే చాలు.. అందుకే చెప్పాను కదా.. పేపర్లను పక్కన పడేయి. లేకుంటే నీకు తలనొప్పి తప్పదు అనేవారు. కానీ నాకయితే అన్నీ తెలుసుకోవాలి అనిపించే పేపర్లు తప్పకుండా చదివేదాన్ని. పెళ్లి చేసుకున్నారు కనుక పార్టీ ఓడిపోతుంది అని ప్రచారం చేశారు. మీరు పెళ్లి చేసుకుంటే పార్టీ ఓడిపోతుందని భయపడ్డవారెవరు? ఈ నాటకానికి మూలకారకుడు మా చిన్నల్లుడు చంద్రబాబునాయుడే. బాబు కుట్ర ఎలా ప్రారంభమైందో ఇటీవలే నేను రాసిన ‘తెలుగుతేజం’ పుస్తకంలో పొందుపర్చాను. కానీ, ఎన్టీఆర్ జీవితంలోకి నేను ప్రవేశించక ముందునుంచే ఆయన్ను పదవిలోకి రాకుండా చేసి తాను గద్దెనెక్కాలనే ఉద్దేశం బాబులో ఉండేదని ఎన్టీఆర్ బహిరంగంగా కూడా చెప్పారు. 1994లో జరిగే ఎన్నికల్లో ఎన్టీఆర్ కాకుండా చంద్రబాబు పదవిలోకి రావాలనే కుతంత్రం జరిగింది. అంతకుముందు నుంచే ఎన్టీఆర్‌కి ఒక పత్రికాధిపతికి పొసగలేదు. 1989 ఎన్నికల్లో కూడా ఆయన ఎన్టీఆర్‌కి మద్దతివ్వలేదు. ఏ పేపర్ అయితే ఎన్టీఆర్‌ని అంటకాగి భుజాన పెట్టుకుని మోసిందో అదే పత్రికాధిపతి ఎన్టీఆర్‌ని పక్కనపెట్టి తన చెప్పుచేతల్లో ఉండే వ్యక్తిని సీఎంగా చేయాలని ప్లాన్ చేశారు. ఎన్నికలకు ముందే ఎన్టీఆర్‌తోపాటు నేను కూడా వెళ్లి రామోజీరావును కలిశాను. మీ పార్టీ ఎన్నికల్లో గెలవటం కష్టం. గెలిచినా పెద్దగా మెజార్టీ రాదు ఒక వేళ కాంగ్రెస్‌ను తట్టుకుని బయటపడ్డా ఎన్టీఆర్ మాత్రం సీఎం కాలేరు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్‌తో మీ పెళ్లి పట్ల ఆయన కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి? ఈరోజు నేను చెబుతున్న ప్రతిమాట కూడా భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. ఇప్పటికీ నమ్మని జనం కోసం కూడా మరోసారి చెబుతున్నాను. ఒకరోజు నాచారం స్టూడియోలో బల్లముందు కూర్చుని తాను చెబుతున్న వివరాలు రాసుకుంటూ ఉంటే ఆయనే అడిగారు. ‘లక్ష్మీ, నువ్వు కూడా ఒంటరిగా ఉంటున్నావు కదా. నేను ఒంటరినే. మనిద్దరి మధ్య ఒక ఆత్మీయత అంటూ ఏర్పడింది. మరి మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు’’ అని తొలిసారి ఆయనే ప్రపోజ్ చేశారు. కాస్త సమయం అడిగాను. రెండు రోజుల తర్వాత ఆయన ఫోన్ చేస్తే నా తొలిభర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నాను ఆ తర్వాతే నా నిర్ణయం చెబుతానని తెలిపాను. ఆ తర్వాత ఆయన కుమారులు, కుమార్తెలు, కోడళ్లు అందరినీ పిలిచి పెళ్లి విషయం చెప్పారు. షాక్ అయినా వారేమీ బయటకు చెప్పలేదు. ఈలోగా ఎన్టీఆర్ ఒక లెక్చరర్ని పెళ్లి చేసుకున్నారు అని నాటి కాంగ్రెస్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పేపర్లో వార్త ఇచ్చేశారు. అది సంచలనం అయిపోయింది. తర్వాత ఎన్టీఆర్ ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఆయన కుమారులందరూ వచ్చారు. ‘నాన్నకు మీ వ్యవహారం బాగా అప్రతిష్ట కలిగిస్తోంది. మళ్లీ ఆయన ఇంటికి వచ్చారంటే బాగుండదు’ అంటూ హెచ్చరించారు. తన కుటుంబం మొత్తంగా నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన క్షణాల్లో కూడా ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు. ఒక సాధారణ స్త్రీని అయిన నన్ను ఆయన ఎందుకు కోరుకున్నారంటే.. ఆయనకు నచ్చిన లక్షణాలు కొన్ని నాలో ఉండటమే. ఈ ప్రపంచం ఆయన వైపు నుంచి ఎందుకు ఈ విషయాన్ని చూడలేదు? నా గుణగుణాలను ఎందుకు చూడరు? బాబుకు మీరు పోటీ కాబోతున్నందునే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు జరిగిందా? తనను మళ్లీ సీఎంగా రానివ్వకూడదనే కుట్ర 1994 ఎన్నికలకు ముందే ప్రారంభమైపోయిందని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. మా పెళ్లి అయిన తర్వాత ఆ కుట్రకు నన్ను సాకుగా చూపి ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టాలనుకున్నారు. 1993 సెప్టెంబర్ 11న మా పెళ్లి జరగ్గా మూడోరోజే ఇక లక్ష్మీపార్వతి గ్రూప్ తయారైపోతుందని ప్రకటనలకు దిగిపోయారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆ నాటికి టీడీపీలో ఎవరు ఉన్నారనేది కూడా నాకు తెలీదు. ఎన్టీఆర్ ఒకమాట చెప్పారు. నాకు ఇద్దరు భార్యలు. నా ఇద్దరు అల్లుళ్లే నా ఇద్దరు పెళ్లాలు అన్నారు చమత్కారంగా. ఒకరంటే మరొకరికి పడదు. ఎప్పుడూ ఒక చోట కూర్చునేవారు కాదు. వీళ్లు ఎన్నటికీ కలవరు. అందుకే పార్టీ ఓడిపోయిందని చెప్పారు. ఆ నేపథ్యంలో ‘లక్ష్మీ నాకు ఒక సహాయం చేయాలి. ఇకనుంచి పార్టీ వ్యవహారాలను పూర్తిగా నేనే చూసుకోవాలనుకుంటున్నాను. జిల్లాల నుంచి రిపోర్టులన్నింటినీ నువ్వే సేకరించి నాకు ఇవ్వు’ అన్నారు. ఆయన మాట ప్రకారమే మూడు జిల్లాలకు చెందిన పార్టీ సమాచారాన్ని తెప్పించి ఆయనకు అందించాను. కానీ ఆ వ్యక్తులు ముందు బాబు వద్దకు వెళ్లి విషయం చెప్పి ఆ తర్వాత మా వద్దకు వచ్చారని తర్వాత తెలిసింది. టీడీపీని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలువకుండా చేయాలని కుట్రలు జరుగుతున్న విషయం కూడా ఆయనకు తెలుసు. ఎన్నికలకు ముందు దాసరి నారాయణరావు గారితో కలసి వేరే పార్టీ పెట్టడానికి కూడా బాబు సిద్ధమైపోయారని తెలిసింది. దాసరిగారే ఈ విషయాన్ని ఆ తర్వాత చెప్పారు. ఇలాంటి వార్తలన్నీ దృష్టికి వస్తుండటంతో ఎన్టీఆర్‌కి పార్టీ వ్యవహారాలనుతానే చూసుకోవాలనిపించింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలా ఉండేవారు? ఆయన చాలా విషయాల్లో మంచివారండీ. బాబుతో పోల్చి చూస్తే చాలావరకు పెద్ద మనిషి. కానీ ఆయనది ఒక చేతకాని పెద్దరికం. మొదటినుంచి ఆయన ఎన్టీఆర్ పక్షంలోనే ఉండి సమర్థంగా వ్యవహరించి ఉంటే బాబుకు అవకాశమే వచ్చి ఉండేది కాదు. బాబు లాంటి జిత్తులమారితనం నాకు తెలిసినంతవరకు దగ్గుబాటిలో లేదు. కాకపోతే చేతకానితనం చాలా ఉంది. దాంతోనే ఆయన మామగారితో సహా అన్నింటినీ పోగొట్టుకున్నారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఎందుకు అంతగా నమ్మారు? నమ్మటం కాదండి. ఒకదశలో బాబును ఆయన పార్టీలోంచే పంపించేశారు. ఆ సందర్భంలోనే బాబు ఒకచోట మాట్లాడుతూ గత్యంతరం లేక లక్ష్మీపార్వతి వద్దకు వెళ్లాల్సి వచ్చిందని ఒప్పుకున్నారు కూడా. రామచంద్రరాజు, బాబు ఇద్దరూ వచ్చి నన్ను కలిశారు. ‘ఎన్టీఆర్ నన్ను పార్టీలోంచి వెళ్లిపోమంటున్నారు. ఏదైనా వ్యాపారం చేసుకోమంటున్నారు. కానీ మీ పెళ్లిని నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను’ అని బాబు నాతో స్వయంగా అన్నారు. దాంతో చాలా సంతోషమేసింది. బాబుకు, వైఎస్ జగన్‌కి పోలికలు ఏమిటి? బాబు ఎప్పుడూ కుట్రదారుడే. పైగా తాను నేరుగా ఎన్నడూ రాజకీయాల్లో పోటీ చేసి అధికారాన్ని గెలవలేదు. నాకు తెలిసి బాబు చాలా చెడ్డ పాలకుడు జీవితమంతా కుట్రలు, కుయుక్తులు, మేనేజ్ చేసుకుంటూ అడ్డదారిలో వచ్చిన వ్యక్తి బాబు. తనతో పోలిస్తే జగన్‌లో ఆ దుర్గుణాలు ఏవీ లేవు. చిన్నవాడు. ఏదో చేయాలనే ఆదర్శంతో వచ్చాడు. తండ్రి ఆశయాలను నిలబెట్టాలనే కదా సోనియాగాంధీని సైతం వ్యతిరేకించాడు. కుయుక్తులను తిప్పికొట్టే సామర్థ్యం, తెలివితేటలు జగన్ నేర్చుకుంటే చాలు. తనకు ఇంకేమీ అక్కర్లేదు. మీకు మంత్రి పదవి వద్దన్నారు. ఇప్పుడేమో లోకేశ్‌కి మంత్రి పదవి ఇచ్చారే? నేను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం వల్ల, ఈ మహానుభావుడు పార్టీని కాపాడటానికి ఆరోజు ఎన్టీఆర్ నుంచి పదవి కాజేశారట. ఎన్టీఆర్‌ని గద్దె దింపడానికి అప్పట్లో నాపై రాజ్యాంగేతర శక్తిని అని ముద్రవేశారు. కానీ ఈ రోజు లోకేశ్ ప్రవర్తన, వ్యవహారం చూస్తే చంద్రబాబును ఎన్నిసార్లు పదవినుంచి దింపాలండీ. అన్యాయాలు, అక్రమాలు, అవినీతి.. ఇవే బాబు తన కొడుక్కి ఇచ్చిన వారసత్వం. ‘ఆస్తులు సంపాదించరా... ఇంకేమీ అక్కరలేదు’ అన్నాడు బాబు. లోకేశ్ కూడా తండ్రి నుంచి అదొక్కటే నేర్చుకున్నాడు. ఇప్పుడంటే మంత్రిని చేశారు. అంతకుముందు ఇదే లోకేశ్ టీడీపీ మంత్రులతో భేటీలు జరిపాడు. అధికారుల దగ్గరకు వెళతాడు. వారి చాంబర్లలో కూర్చుం టాడు. అధికారుల సమావేశాల్లో పాల్గొంటాడు. అదంతా రాజ్యాంగేతర శక్తి వ్యవహారం కాదా? ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఇంతవరకు వర్మ మీతో మాట్లాడలేదా? మాట్లాడలేదు. మాట్లాడకపోవడమే మంచిది. ఆయన సేకరించే చరిత్ర.. వాస్తవాలను బయటపెట్టగలిగితే మంచిదే కదా. లేకపోతే లక్ష్మీపార్వతి చెప్పిన విషయాలనే ఆయన తీశారు అనే మాట వర్మ ఎందుకు పడాలి? ఆయన ఇష్టప్రకారమే తీయనివ్వండి. ఎన్టీఆర్ ఆరోజు చెప్పిన సాక్ష్యాలు చాలు కదా. వాటిని చెప్పడానికి, తీయడానికి లక్ష్మీపార్వతి ఎందుకు? వర్మ సినిమాపై చంద్రబాబే స్పందించి అలా మాట్లాడుతున్నారంటే తాను ఎంత భయపడుతున్నాడో తెలుస్తూనే ఉంది. ఒక చిన్న పోస్టర్‌తోనే ఇంత సంచలనం రేగింది. మంచిదే. ఒక్క మనిషి కోసం ఈ సమాజంలో 20 ఏళ్లుగా పోరాడుతున్నాను. పత్రికల్లో ఒక్కరైనా నిజాలు మాట్లాడుతున్నారా? పడితే ఆమే కదా పడుతుంది. తిడితే ఆమెనే కదా తిడుతున్నారు అనుకుంటున్నారు. అలాగే నడిచింది కూడా. కానీ ఇన్నేళ్లకు రాంగోపాల్ వర్మ ముందుకువచ్చారు. వాస్తవానికి ఇవన్నీ చెప్పగలిగితే సినిమాగా తీయగలిగితే వర్మ నిజంగా గ్రేట్ అంటాను. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? నూటికి నూరు శాతం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. నన్ను పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారని ఇలా చెప్పడం లేదు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం ఆ స్థాయిలో ఉంది. ఊరికే పూత పూస్తున్నారు. ఒక్క వానకే అదంతా కొట్టుకుపోతుంది. తాత్కాలికంగా ఆ పథకం, ఈ పథకం అని ప్రకటించినప్పటికీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. చంద్రబాబు అదృష్టం ఏమిటంటే ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి. రబీకి సమస్య లేకపోవచ్చు. కానీ రుణమాఫీ, డ్వాక్రా, నిరుద్యోగ సమస్య అన్నీ అలాగే ఉన్నాయి. ఐఐ టీలు చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగే ఉన్నాయి. రాజధానిని చూస్తే బురదలో కూరుకుపోతోంది. (లక్ష్మీపార్వతితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/aTL6oY https://goo.gl/57j99M -
‘బెయిల్ రద్దు చేయండి’
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డికి గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ మంగళవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు డీఐజీ చంద్రశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోరడంతో విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి వాన్‌పిక్, ఇందూ టెక్‌జోన్ చార్జిషీట్లలో సాక్షిగా ఉన్న పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రమాకాంత్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వూ్యను సాక్షి టీవీలో ప్రసారం చేశారని, పేపర్లో ప్రచురించారని, ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. కొమ్మినేని... ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయితే, కొమ్మినేని శ్రీనివాసరావు తెలుగునాట ప్రముఖ జర్నలిస్టు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ5 వంటి మీడియా సంస్థలలో సుదీర్ఘకాలం పని చేసి ప్రస్తుతం సొంతంగా బ్లాగ్ నడుపుతున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కూడా ఉన్నారు. సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొమ్మినేని వారం వారం నిర్వహి స్తున్న ‘మనసులో మాట’ కార్యక్రమంలో భాగంగా రమాకాంత్‌రెడ్డిని ఇంటర్వూ్య చేశారు. ఈ ఇంటర్వూ్య పట్ల సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.