ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మాట జవదాటలేదని అందుకే పార్టీని చీల్చాల్సి వచ్చిందని నాపై చేస్తున్న ఆరోపణ పరమదుర్మార్గం. నాకు అధికార కాంక్షే ఉన్నట్లయితే, ఎన్టీఆర్ నా మాట ప్రకారమే నడుచుకుని ఉంటే, నేను ఎన్నికల్లో పోటీ చేసి ఉండేదాన్ని కదా. వదినమ్మకు పార్టీలో, ప్రభుత్వంలో ఏదైనా స్థానం కల్పిస్తే బాగుంటుందని మోహన్ బాబు స్వయంగా ఎన్టీఆర్‌తో చెప్పారు. చివరకు తనకు ఆరోగ్యం బాగాలేదని, నా తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను కాబట్టి ఏదైనా మంత్రి పదవిలో చేరు అని ఎన్టీఆర్ స్వయంగా చెప్పినా నేను ముందుకు రాలేదు. ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ఇన్నేళ్లుగా ఏ ఒక్కరూ వీటిని బయటకు చెప్పకపోవడమే నా దురదృష్టం.
తెలుగు దేశం పార్టీని పెంచి పోషించిన నందమూరి తారకరామారావుకు వ్యతిరేకంగా పార్టీలోపల సాగించిన సకల కుట్రలకూ ఆయన అల్లుడు చంద్రబాబునాయుడే సూత్రధారి అని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన ఇష్టంతో, సమ్మతితో ప్రవేశించిన విషయాన్ని దాటవేయడమే కాకుండా, లక్ష్మీపార్వతి కారణంగా టీడీపీ గెలవదనీ, ప్రజలు ఆ వివాహాన్ని ఆమోదించరని, ఆడవాళ్లు చాలా కోపంగా ఉన్నారని పత్రికలలో ప్రచారం చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తీరా, ప్రభంజనం సృష్టించి 1994 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే, తనపై రాజ్యాంగేతర శక్తి అనే ముద్రవేసి అతి స్వల్ప కాలం లోనే కనీవినీ ఎరుగని కుట్రలకు పాల్పడి ఎన్టీఆర్‌ని గద్దె దింపి, ఆయన మరణానికి కూడా కారణమయ్యారని చెబుతున్న లక్ష్మీపార్వతి అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
మీ సుదీర్ఘ అనుభవంలో ప్రస్తుత వ్యవస్థపై, రాజకీయాలపై మీ అభిప్రాయం?
1993 నుంచి ఎన్టీఆర్‌తో వివాహం తర్వాత వ్యక్తిగత జీవిత పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ వెంటనే రాజకీయ సమస్యలు ఎదురయ్యాయి. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టింది కాబట్టి ఇక తెలుగుదేశం గెలవదు. ద్వితీయ వివాహం చేసుకున్నారు కనుక ప్రజలు ఎవ్వరూ ఆమోదించరు. ఈ పరిణామంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఆడవాళ్లయితే ఇంకా కోపంగా ఉన్నారు. ఈ వయసులో ఈ పని చేయడం ఏమిటి అని ఇలాంటి పుకార్లు వచ్చాయి. వీటిని ఎవరు వ్యాపింపజేస్తున్నారో నాకయితే అర్థమయ్యేది కాదు. తెల్లారిలేచి పేపర్ చూడాలంటేనే భయమేసేది. ఎన్టీఆర్ అయితే పేపర్ చూడరు కాబట్టి ఇబ్బందే లేదు. కానీ నాకయితే పేపర్ రోజూ చదవటం అలవాటు. పేపర్ చదవడం నేను బాధపడటం.. ఏమైంది పేపర్ చదివావా అని ఆయన అడగటం. అవునండీ అంటే చాలు.. అందుకే చెప్పాను కదా.. పేపర్లను పక్కన పడేయి. లేకుంటే నీకు తలనొప్పి తప్పదు అనేవారు. కానీ నాకయితే అన్నీ తెలుసుకోవాలి అనిపించే పేపర్లు తప్పకుండా చదివేదాన్ని. పెళ్లి చేసుకున్నారు కనుక పార్టీ ఓడిపోతుంది అని ప్రచారం చేశారు.
మీరు పెళ్లి చేసుకుంటే పార్టీ ఓడిపోతుందని భయపడ్డవారెవరు?
ఈ నాటకానికి మూలకారకుడు మా చిన్నల్లుడు చంద్రబాబునాయుడే. బాబు కుట్ర ఎలా ప్రారంభమైందో ఇటీవలే నేను రాసిన ‘తెలుగుతేజం’ పుస్తకంలో పొందుపర్చాను. కానీ, ఎన్టీఆర్ జీవితంలోకి నేను ప్రవేశించక ముందునుంచే ఆయన్ను పదవిలోకి రాకుండా చేసి తాను గద్దెనెక్కాలనే ఉద్దేశం బాబులో ఉండేదని ఎన్టీఆర్ బహిరంగంగా కూడా చెప్పారు. 1994లో జరిగే ఎన్నికల్లో ఎన్టీఆర్ కాకుండా చంద్రబాబు పదవిలోకి రావాలనే కుతంత్రం జరిగింది. అంతకుముందు నుంచే ఎన్టీఆర్‌కి ఒక పత్రికాధిపతికి పొసగలేదు. 1989 ఎన్నికల్లో కూడా ఆయన ఎన్టీఆర్‌కి మద్దతివ్వలేదు. ఏ పేపర్ అయితే ఎన్టీఆర్‌ని అంటకాగి భుజాన పెట్టుకుని మోసిందో అదే పత్రికాధిపతి ఎన్టీఆర్‌ని పక్కనపెట్టి తన చెప్పుచేతల్లో ఉండే వ్యక్తిని సీఎంగా చేయాలని ప్లాన్ చేశారు. ఎన్నికలకు ముందే ఎన్టీఆర్‌తోపాటు నేను కూడా వెళ్లి రామోజీరావును కలిశాను. మీ పార్టీ ఎన్నికల్లో గెలవటం కష్టం. గెలిచినా పెద్దగా మెజార్టీ రాదు ఒక వేళ కాంగ్రెస్‌ను తట్టుకుని బయటపడ్డా ఎన్టీఆర్ మాత్రం సీఎం కాలేరు అని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఎన్టీఆర్‌తో మీ పెళ్లి పట్ల ఆయన కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?
ఈరోజు నేను చెబుతున్న ప్రతిమాట కూడా భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. ఇప్పటికీ నమ్మని జనం కోసం కూడా మరోసారి చెబుతున్నాను. ఒకరోజు నాచారం స్టూడియోలో బల్లముందు కూర్చుని తాను చెబుతున్న వివరాలు రాసుకుంటూ ఉంటే ఆయనే అడిగారు. ‘లక్ష్మీ, నువ్వు కూడా ఒంటరిగా ఉంటున్నావు కదా. నేను ఒంటరినే. మనిద్దరి మధ్య ఒక ఆత్మీయత అంటూ ఏర్పడింది. మరి మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు’’ అని తొలిసారి ఆయనే ప్రపోజ్ చేశారు. కాస్త సమయం అడిగాను. రెండు రోజుల తర్వాత ఆయన ఫోన్ చేస్తే నా తొలిభర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నాను ఆ తర్వాతే నా నిర్ణయం చెబుతానని తెలిపాను. ఆ తర్వాత ఆయన కుమారులు, కుమార్తెలు, కోడళ్లు అందరినీ పిలిచి పెళ్లి విషయం చెప్పారు. షాక్ అయినా వారేమీ బయటకు చెప్పలేదు. ఈలోగా ఎన్టీఆర్ ఒక లెక్చరర్‌ని పెళ్లి చేసుకున్నారు అని నాటి కాంగ్రెస్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పేపర్లో వార్త ఇచ్చేశారు. అది సంచలనం అయిపోయింది. తర్వాత ఎన్టీఆర్ ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఆయన కుమారులందరూ వచ్చారు. ‘నాన్నకు మీ వ్యవహారం బాగా అప్రతిష్ట కలిగిస్తోంది. మళ్లీ ఆయన ఇంటికి వచ్చారంటే బాగుండదు’ అంటూ హెచ్చరించారు. తన కుటుంబం మొత్తంగా నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన క్షణాల్లో కూడా ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు. ఒక సాధారణ స్త్రీని అయిన నన్ను ఆయన ఎందుకు కోరుకున్నారంటే.. ఆయనకు నచ్చిన లక్షణాలు కొన్ని నాలో ఉండటమే. ఈ ప్రపంచం ఆయన వైపు నుంచి ఎందుకు ఈ విషయాన్ని చూడలేదు? నా
గుణగుణాలను ఎందుకు చూడరు?
బాబుకు మీరు పోటీ కాబోతున్నందునే ఎన్టీఆర్‌పై తిరుగుబాటు జరిగిందా?
తనను మళ్లీ సీఎంగా రానివ్వకూడదనే కుట్ర 1994 ఎన్నికలకు ముందే ప్రారంభమైపోయిందని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. మా పెళ్లి అయిన తర్వాత ఆ కుట్రకు నన్ను సాకుగా చూపి ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టాలనుకున్నారు. 1993 సెప్టెంబర్ 11న మా పెళ్లి జరగ్గా మూడోరోజే ఇక లక్ష్మీపార్వతి గ్రూప్ తయారైపోతుందని ప్రకటనలకు దిగిపోయారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆ నాటికి టీడీపీలో ఎవరు ఉన్నారనేది కూడా నాకు తెలీదు. ఎన్టీఆర్ ఒకమాట చెప్పారు. నాకు ఇద్దరు భార్యలు. నా ఇద్దరు అల్లుళ్లే నా ఇద్దరు పెళ్లాలు అన్నారు చమత్కారంగా. ఒకరంటే మరొకరికి పడదు. ఎప్పుడూ ఒక చోట కూర్చునేవారు కాదు. వీళ్లు ఎన్నటికీ కలవరు. అందుకే పార్టీ ఓడిపోయిందని చెప్పారు. ఆ నేపథ్యంలో ‘లక్ష్మీ నాకు ఒక సహాయం చేయాలి. ఇకనుంచి పార్టీ వ్యవహారాలను పూర్తిగా నేనే చూసుకోవాలనుకుంటున్నాను. జిల్లాల నుంచి రిపోర్టులన్నింటినీ నువ్వే సేకరించి నాకు ఇవ్వు’ అన్నారు. ఆయన మాట ప్రకారమే మూడు జిల్లాలకు చెందిన పార్టీ సమాచారాన్ని తెప్పించి ఆయనకు అందించాను. కానీ ఆ వ్యక్తులు ముందు బాబు వద్దకు వెళ్లి విషయం చెప్పి ఆ తర్వాత మా వద్దకు వచ్చారని తర్వాత తెలిసింది. టీడీపీని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలువకుండా చేయాలని కుట్రలు జరుగుతున్న విషయం కూడా ఆయనకు తెలుసు. ఎన్నికలకు ముందు దాసరి నారాయణరావు గారితో కలసి వేరే పార్టీ పెట్టడానికి కూడా బాబు సిద్ధమైపోయారని తెలిసింది. దాసరిగారే ఈ విషయాన్ని ఆ తర్వాత చెప్పారు. ఇలాంటి వార్తలన్నీ దృష్టికి వస్తుండటంతో ఎన్టీఆర్‌కి పార్టీ వ్యవహారాలనుతానే చూసుకోవాలనిపించింది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలా ఉండేవారు?
ఆయన చాలా విషయాల్లో మంచివారండీ. బాబుతో పోల్చి చూస్తే చాలావరకు పెద్ద మనిషి. కానీ ఆయనది ఒక చేతకాని పెద్దరికం. మొదటినుంచి ఆయన ఎన్టీఆర్ పక్షంలోనే ఉండి సమర్థంగా వ్యవహరించి ఉంటే బాబుకు అవకాశమే వచ్చి ఉండేది కాదు. బాబు లాంటి జిత్తులమారితనం నాకు తెలిసినంతవరకు దగ్గుబాటిలో లేదు. కాకపోతే చేతకానితనం చాలా ఉంది. దాంతోనే ఆయన మామగారితో సహా అన్నింటినీ పోగొట్టుకున్నారు.
చంద్రబాబును ఎన్టీఆర్ ఎందుకు అంతగా నమ్మారు?
నమ్మటం కాదండి. ఒకదశలో బాబును ఆయన పార్టీలోంచే పంపించేశారు. ఆ సందర్భంలోనే బాబు ఒకచోట మాట్లాడుతూ గత్యంతరం లేక లక్ష్మీపార్వతి వద్దకు వెళ్లాల్సి వచ్చిందని ఒప్పుకున్నారు కూడా. రామచంద్రరాజు, బాబు ఇద్దరూ వచ్చి నన్ను కలిశారు. ‘ఎన్టీఆర్ నన్ను పార్టీలోంచి వెళ్లిపోమంటున్నారు. ఏదైనా వ్యాపారం చేసుకోమంటున్నారు. కానీ మీ పెళ్లిని నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను’ అని బాబు నాతో స్వయంగా అన్నారు. దాంతో చాలా సంతోషమేసింది.
బాబుకు, వైఎస్ జగన్‌కి పోలికలు ఏమిటి?
బాబు ఎప్పుడూ కుట్రదారుడే. పైగా తాను నేరుగా ఎన్నడూ రాజకీయాల్లో పోటీ చేసి అధికారాన్ని గెలవలేదు. నాకు తెలిసి బాబు చాలా చెడ్డ పాలకుడు జీవితమంతా కుట్రలు, కుయుక్తులు, మేనేజ్ చేసుకుంటూ అడ్డదారిలో వచ్చిన వ్యక్తి బాబు. తనతో పోలిస్తే జగన్‌లో ఆ దుర్గుణాలు ఏవీ లేవు. చిన్నవాడు. ఏదో చేయాలనే ఆదర్శంతో వచ్చాడు. తండ్రి ఆశయాలను నిలబెట్టాలనే కదా సోనియాగాంధీని సైతం వ్యతిరేకించాడు. కుయుక్తులను తిప్పికొట్టే సామర్థ్యం, తెలివితేటలు జగన్ నేర్చుకుంటే చాలు. తనకు ఇంకేమీ అక్కర్లేదు.
మీకు మంత్రి పదవి వద్దన్నారు. ఇప్పుడేమో లోకేశ్‌కి మంత్రి పదవి ఇచ్చారే?
నేను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం వల్ల, ఈ మహానుభావుడు పార్టీని కాపాడటానికి ఆరోజు ఎన్టీఆర్ నుంచి పదవి కాజేశారట. ఎన్టీఆర్‌ని గద్దె దింపడానికి అప్పట్లో నాపై రాజ్యాంగేతర శక్తిని అని ముద్రవేశారు. కానీ ఈ రోజు లోకేశ్ ప్రవర్తన, వ్యవహారం చూస్తే చంద్రబాబును ఎన్నిసార్లు పదవినుంచి దింపాలండీ. అన్యాయాలు, అక్రమాలు, అవినీతి.. ఇవే బాబు తన కొడుక్కి ఇచ్చిన వారసత్వం. ‘ఆస్తులు సంపాదించరా... ఇంకేమీ అక్కరలేదు’ అన్నాడు బాబు. లోకేశ్ కూడా తండ్రి నుంచి అదొక్కటే నేర్చుకున్నాడు. ఇప్పుడంటే మంత్రిని చేశారు. అంతకుముందు ఇదే లోకేశ్ టీడీపీ మంత్రులతో భేటీలు జరిపాడు. అధికారుల దగ్గరకు వెళతాడు. వారి చాంబర్లలో కూర్చుం టాడు. అధికారుల సమావేశాల్లో పాల్గొంటాడు. అదంతా
రాజ్యాంగేతర శక్తి వ్యవహారం కాదా?
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఇంతవరకు వర్మ మీతో మాట్లాడలేదా?
మాట్లాడలేదు. మాట్లాడకపోవడమే మంచిది. ఆయన సేకరించే చరిత్ర.. వాస్తవాలను బయటపెట్టగలిగితే మంచిదే కదా. లేకపోతే లక్ష్మీపార్వతి చెప్పిన విషయాలనే ఆయన తీశారు అనే మాట వర్మ ఎందుకు పడాలి? ఆయన ఇష్టప్రకారమే తీయనివ్వండి. ఎన్టీఆర్ ఆరోజు చెప్పిన సాక్ష్యాలు చాలు కదా. వాటిని చెప్పడానికి, తీయడానికి లక్ష్మీపార్వతి ఎందుకు? వర్మ సినిమాపై చంద్రబాబే స్పందించి అలా మాట్లాడుతున్నారంటే తాను ఎంత భయపడుతున్నాడో తెలుస్తూనే ఉంది. ఒక చిన్న పోస్టర్‌తోనే ఇంత సంచలనం రేగింది. మంచిదే. ఒక్క మనిషి కోసం ఈ సమాజంలో 20 ఏళ్లుగా పోరాడుతున్నాను. పత్రికల్లో ఒక్కరైనా నిజాలు మాట్లాడుతున్నారా? పడితే ఆమే కదా పడుతుంది. తిడితే ఆమెనే కదా తిడుతున్నారు అనుకుంటున్నారు. అలాగే నడిచింది కూడా. కానీ ఇన్నేళ్లకు రాంగోపాల్ వర్మ ముందుకువచ్చారు. వాస్తవానికి ఇవన్నీ చెప్పగలిగితే సినిమాగా తీయగలిగితే వర్మ నిజంగా గ్రేట్ అంటాను.
వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి?
నూటికి నూరు శాతం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. నన్ను పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారని ఇలా చెప్పడం లేదు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం ఆ స్థాయిలో ఉంది. ఊరికే పూత పూస్తున్నారు. ఒక్క వానకే అదంతా కొట్టుకుపోతుంది. తాత్కాలికంగా ఆ పథకం, ఈ పథకం అని ప్రకటించినప్పటికీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. చంద్రబాబు అదృష్టం ఏమిటంటే ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి. రబీకి సమస్య లేకపోవచ్చు. కానీ రుణమాఫీ, డ్వాక్రా, నిరుద్యోగ సమస్య అన్నీ అలాగే ఉన్నాయి. ఐఐ టీలు చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగే ఉన్నాయి. రాజధానిని చూస్తే బురదలో కూరుకుపోతోంది.
(లక్ష్మీపార్వతితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/aTL6oY
https://goo.gl/57j99M
Comments
Please login to add a commentAdd a comment