ఈనాడు మీడియా, దాని అధినేత రామోజీరావు బరి తెగించారు. అది కూడా నడి రోడ్డుపై బట్టలు ఊడదీసుకుని తిరగడానికి సిగ్గుపడని విధంగా. నిత్యం నీచ కథనాలు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈనాడు, ఆ ప్రక్రియలో మరో లెవెల్‌కు దిగజారింది. ఏపీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కిన తీరు చూస్తే ఏపీ ప్రజలు ఇంకా ఈ పత్రికను ఎలా భరిస్తున్నారా? అనే అభిప్రాయం కలుగుతుంది.
పార్టీలకు అతీతంగా ఈనాడును అసహ్యించుకునే పరిస్థితి తెచ్చిపెట్టుకుంటున్నారు. తెలుగుదేశం గెలవాలని, తమ ఎదుట చేతులు కట్టుకుని కూర్చునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరిక ఉంటే ఉండవచ్చు. కానీ, అందుకోసం ఈనాడు పత్రికను, టీవీ ని ఇంత ఘోరంగా తాకట్టు పెట్టాలా? తన భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు.. ఏపీ ప్రజలు తనను చీదరించుకున్నా పర్వాలేదు.. ఏపీపై మాత్రం పగపట్టిన విషపురుగు మాదిరి వ్యవహరించాల్సిందేనని రామోజీరావు భావిస్తున్నట్లుగా ఉంది. లేకుంటే బుధవారం నాడు ఈనాడు దినపత్రికలో వలంటీర్లపై రాసిన ఈ కథనం చదివితే, కాస్త విజ్ఞత ఉన్న ఎవరికైనా ఒళ్లు మండుతుంది. ఆ పత్రికను వెంటనే చెత్తబుట్టలో వేయాలనిపిస్తుంది.
88 ఏళ్ల వయసులో ఉన్న రామోజీరావు కోట్లు ఉన్నాయన్న అహంకారంతో, కొండమీద కూర్చున్నా తనకు పనిచేసేవారు ఉంటారన్న అహంభావంతో నిరుపేదలను ఈసడించుకుంటున్నారు. పేదరికంలో మగ్గుతూ ఉండే వృద్ధులు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ను జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తమ ఇళ్ల వద్దే అందుకుంటున్న తీరు చూసి రామోజీ అసూయతో కుళ్లుతున్నారు. తన పెత్తందారి బుద్ధితో తక్కువ వేతనంతో గౌరవ వలంటీర్లుగా సమాజానికి సేవ చేస్తున్న అల్పజీవులపై కూడా పడి ఏడుస్తున్నారు. పాపం, పుణ్యం వంటి వాటితో నిమిత్తం లేకుండా రామోజీ బృందం ఇంత దారుణంగా ఏపీ సమాజాన్ని తన పత్రిక, టీవీ ద్వారా పీడిస్తోంది. తెల్లవారే సరికి కొన్ని లక్షల పేపర్లను తెలుగుదేశం కరపత్రికల కన్నా హీనంగా మార్చి ప్రజలపై దాడి చేస్తోంది. అవసరమైతే ఉచితంగా కూడా పత్రికను పంచిపెట్టడానికి రామోజీరావు సిద్దం అయ్యారంటేనే ఆయన మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంతకీ జగన్ చేసిన తప్పేమిటి? పేద ప్రజలకు అండగా నిలబడడమేనా! వలంటీర్ల తప్పు ఏమిటి? జగన్ ప్రభుత్వం కోరిన విధంగా ప్రజలందరికీ పౌర సేవలు అందించడమేనా? నెల మొదటి తేదీ వస్తే చాలు వృద్ధుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మూడువేల రూపాయలు చేతికి ఇస్తున్న వైనాన్ని ఈనాడు రామోజీరావుకు కనబడకపోవచ్చు. ఎందుకంటే ఆయన కొండపై ఉంటారు కనుక. ఆయన వద్ద పనిచేసే సంపాదకులకు, జర్నలిస్టులకు ఏమైంది? పచ్చి అబద్ధాలు రాయడానికి సిగ్గుపడడం లేదంటే ఇదంతా రామోజీ ఇచ్చే నాలుగు జీతపు రాళ్లకు ఆశపడేకదా! ఈనాడు జర్నలిస్టులు కాస్త అయినా ఆత్మగౌరవంగా బతకలేకపోతున్నారని ఈ కథనం చదివితే అర్థమైపోతుంది. వలంటీర్లు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను ఇళ్లవద్దకే చేర్చుతున్న సంగతి ఈనాడు ప్రతినిధులకు తెలియదా? దాని గురించి ఒక్క ముక్క ఏనాడైనా రాశారా? రామోజీరావు ఆదేశాల మేరకు మంచి విషయాలు రాయడం లేదా? మంచి రాయవద్దు, మంచి వినవద్దు, మంచి చూడవద్దు అన్న చందంగా వీరు వ్యవహరిస్తున్నారు.
నిజానికి ఆ కోతులే బెటర్. తనపై ఎవరైనా ఒత్తిడి చేస్తే ఎదురుతిరుగుతాయి. కానీ, ఈనాడు జర్నలిస్టులు మాత్రం వెన్నుముఖ లేకుండా పనిచేస్తున్నారనిపిస్తుంది. ఈ మధ్య ఒక సీఎం వద్ద గతంలో పనిచేసిన సీపీఆర్ఓ ఒకరు కలిశారు. ఆయన శ్రీకాకుళం జిల్లా వాసి. ఆయన అమెరికాలో ఉంటున్న తన కుమార్తె గ్రీన్ కార్డు అవసరం నిమిత్తం తన గ్రామంలో పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం వలంటీర్ ద్వారా దరఖాస్తు చేశారు. కనీసం ఒక వారం అయినా పడుతుందేమో అని ఆయన అనుకున్నారు. కాని ఆయన ఆశ్చర్యపోయే విదంగా సాయంత్రానికి బర్త్‌డే సర్టిఫికెట్లను వలంటీర్‌ను తెచ్చి ఇచ్చారు. ఆ విషయాన్ని నాతో పంచుకుని వలంటీర్లు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పారు. కానీ, ఈనాడు రామోజీరావు మాత్రం వారిపై విషం కక్కుతున్నారు. చివరికి ఏ స్థాయికి వెళ్లారంటే వారిని గూఢచారులతో పోల్చి అవమానించారు. జగన్ ప్రభుత్వం తను అమలు చేస్తున్న స్కీములతో కాకుండా, వలంటీర్లతోనే గెలిచేస్తున్నట్లు రామోజీ భయపడుతున్నారు. వారిని సంఘ విద్రోహ శక్తులుగా, మానభంగాలు చేసేవారిగా ప్రొజెక్టు చేస్తూ ఈనాడు రాసిన తీరు గమనిస్తే ఇంత ఘోరంగా రామోజీ, ఆయన బృందం నిస్సిగ్గుగా నడిబజారులో బట్టలు ఊడదీసుకుని తిరగాలా ? అనిపిస్తుంది.
తెలుగుదేశం వద్ద పాజిటివ్ ఎజెండా లేకపోవడం వల్లే ఈనాడుమీడియా ఈ అరాచకపు రాతలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ చీకటి వ్యవహారాలకు వలంటీర్లు సహకరిస్తున్నారట!. ప్రజల వద్దకు వలంటీర్లను పంపించి, వారి అవసరాలను తీర్చడం చీకటి పని అట!.. మరి ఈనాడు రామోజీ వార్తలు సేకరించవలసిన విలేకరులను జనంమీదకు పంపి ఎందుకు ఇతర పనులు చేయించుకుంటున్నారు? ఎంతమంది ఈనాడు విలేకరులు అవినీతికి పాల్పడుతున్నారు? ఎక్కడ ఏచిన్న గొడవ జరిగినా సైంధవుల్లా ఈనాడు విలేకరులు తయారై, ఆ గొడవను వైసిపికి పులిమే పనిలో ఉంటూ ఛండాలంగా వ్యవహరిస్తున్నారు. మరి వారందరి గురించి ఎప్పుడైనా రామోజీ ఆలోచించారా? ఎవరో కొద్ది మంది వలంటీర్లు తప్పు చేస్తే మొత్తం వ్యవస్థనంతటిని తప్పు పడతారా? సమాజంలో అనేక నేరాలు జరుగుతుంటాయి. వాటికి ఎవరు బాధ్యత వహించాలి.
కొంతకాలం క్రితం విజయవాడలో ఒక టీడీపీ నాయకుడికి రేప్ కేసులో శిక్ష పడింది. అందువల్ల టీడీపీలో అంతా రేపిస్టులే అని అంటారా! అంతదాకా ఎందుకు? రామోజీ ఫిలిం సిటీలో వందల ఎకరాలు రామోజీ ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపిస్తూ కొన్ని డాక్యుమెంట్లు కూడా చూపుతుంటారు. మరి రామోజీ తాను కబ్జాదారుడినని అంగీకరిస్తారా? మార్గదర్శిలో వందల కోట్ల నల్లధనాన్ని మళ్లించారని ఏపీ సిఐడి ఆరోపిస్తోంది. దానిని ఒప్పుకుంటారా? తన వద్ద డిపాజిట్ చేసిన వారి వివరాలను పారదర్శకంగా ఇవ్వడానికి రామోజీ ఎందుకు వెనుకాడుతున్నారు.
అసలెందుకు! మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాను స్వయంగా రామోజీని కలుస్తానని, తను ఆయనపై వేసిన కేసులో పూర్తి వివరాలు ఇచ్చి తనను సంతృప్తి వరిస్తే తన ఆరోపణలను ఉపసంహరించుకుంటానని పలుమార్లు ప్రకటించినా ఎందుకు నోరు విప్పడం లేదు?న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి, ఉండవల్లి వేసిన కేసులో ఆయనకు తెలియకుండానే తీర్పు తెప్పించుకున్నారే? ఇది ఏపాటి నీతో రామోజీనే చెప్పాలి. తనకు లీజుకు ఇచ్చిన పాపానికి స్థలాల యజమానులను ముప్పుతిప్పలు పెట్టిన రామోజీ రాసే చెత్త రాతలను ప్రజలు ఎలా నమ్మాలి? తెల్లవారి లేస్తే వాళ్ల మీద, వీళ్ల మీద ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తూ ప్రజలను పీడిస్తున్న ఈనాడు, ఆ మీడియా అధిపతి రామోజీరావు ఉన్మాదులుగా మారారంటే ఆశ్చర్యం కాదు. నిజానికి ఇలా రాయడం బాధగానే ఉంటుంది. అయినా నిజం నిప్పులాంటిది. అలాంటివాటిని మాబోటి వాళ్లు కూడా రాయకపోతే ఈనాడు అరాచకాలకు అంతే ఉండదు. మా బోటివాళ్లం ఎంత చెప్పినా, ఏ మాత్రం సిగ్గుపడకుండా చెత్తా, చెదారం రాసి పాఠకుల మీద వదలుతున్నారు.
వలంటీర్లు గూఢచారులుగా పనిచేస్తున్నారా? లేక ఈనాడు విలేకరులు పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారా? కల్పిత కధనాలతో ప్రజలలో జగన్ ప్రభుత్వంపై విద్వేషం నింపడానికి వారు చేస్తున్న ప్రయత్నం అందరికి తెలుసిపోతోంది. ఈనాడు రామోజీరావుకు ధైర్యం ఉంటే ఒక మాట చెప్పాలి. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి కమిటీలు మంచివని, వారు అవినీతికి పాల్పడినా, ప్రజలను వేధించినా, ఆ వ్యవస్థే మంచిదని మొదటి పేజీలో రాయాలి. అప్పట్లో జరిగిన జన్మభూమి కమిటీల అరాచకాల గురించి ఎన్నడైనా ఈ పత్రిక వార్త ఇచ్చిందా? అప్పుడేమో అలాంటి అక్రమాలన్నిటిని భుజాన వేసుకుని, ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తున్న వలంటీర్లపై పడి ఏడుస్తారా? ఎవరైనా ఒకరిద్దరు వలంటీర్లు తప్పు చేస్తే మొత్తం అందరిపై బురద జల్లుతారా? రామోజీపై ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా! వాటికి ఆయన ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. కేవలం జగన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో ఉండడాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇవన్ని కాదు! రామోజీ ఏమి చెబితే అది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేస్తారు కదా? ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అవుతారు కదా! అందుకే వారితో ఈ వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటన ఇప్పించాలి. ఇకపై వృద్దులు పాతపద్దతిలోనే కిలోమీటర్ల దూరం డేక్కుంటూ వెళ్లి పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిందే. అవసరమైన సర్టిఫికెట్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో కాకుండా మండల ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిందే అని రామోజీ చెబుతారా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వలంటీర్లను అవమానించినవారే. కాని ఇప్పుడు ఆయన స్వరం మార్చి తాను అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తానని ప్రచారం చేస్తున్నారని, దానిని నమ్మవద్దని అంటున్నారు కదా!
వలంటీర్లను కొనసాగిస్తానని ఆయన నమ్మబలికే యత్నం ఎందుకు చేస్తున్నారు? పవన్ కల్యాణ్ అయితే ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం కంటే ఇంకా ఎక్కువే ఇస్తానని ఎందుకు చెబుతున్నారు? వారిని రామోజీ ఎందుకు నిలదీయరు? వారిద్దరూ ఏమి చేసినా రామోజీకి కమ్మగా ఉంటుందా? రామోజీ, చంద్రబాబులు ఇద్దరు కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబేమో తాను వలంటీర్లను కొనసాగిస్తానంటారు.. రామోజీనేమో వారిపై విషం చిమ్ముతారు.. తద్వారా వీరిద్దరూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. కాని వలంటీర్ల సేవలను పొందుతున్న సాధారణ ప్రజానీకం వీరి ఆటలను సాగనిస్తుందా!
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment