సాక్షి, అమరావతి: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం షెకావత్ రాసిన లేఖకు జగన్ నేడు సమాధానమిచ్చారు. ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న షెకావత్ రాసిన లేఖ కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. (కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు)
కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతోందని సీఎం జగన్ ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు సంబంధించి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ రెండు ప్రాజెక్ట్‌లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయన్నారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందన్నారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించాను అన్నారు. కానీ రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment