
గైర్హాజరీ వల్ల లాభమా.. నష్టమా?
సభలో సీఎం ప్రజెంటేషన్‌కు డుమ్మాపై కాంగ్రెస్ అంతర్గత మథనం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, ప్రభుత్వ జల విధానంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. బడ్జెట్ సమావేశాల చివరిరోజునాడు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. శాసనసభలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, చర్చకు అవకాశం లేకుండా సీఎం ఏకపక్షంగా చెప్పుకుంటూ పోతే సాధారణ ప్రేక్షకునిగా ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నించింది. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం సభ్యులందరికీ ఇవ్వాలనీ, సభలో కాకుండా మరెక్కడైనా నిర్వహించాలని స్పీకర్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. అయితే ఈ ప్రతిపాదనలు, అభ్యంతరాలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు.
రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితి, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అనుసరించిన విధానం, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్మించిన బ్యారేజీలు, వాటివల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం, ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైను మినహా ప్రత్యామ్నాయం లేదనే విధంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్‌పై పదునైన విమర్శలూ చేశారు. ఈ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ సీనియర్ సభ్యుల్లో పార్టీ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభలో పార్టీ వాదన సమర్థవంతంగా వినిపించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతుంటే, హాజరైతే టీఆర్‌ఎస్‌ను భవిష్యత్తులో ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామని మరికొందరు వాదిస్తున్నారు.
పార్టీ వాదన లేకుండా పోయింది...
సీఎం శాసనసభలో ఇచ్చిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నా, దోషిగా నిలబెట్టినా... సభకు హాజరు కాకపోవడం వల్ల వాటిని తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయిందని ఓ సీనియర్ సభ్యుడు వ్యాఖ్యానించారు. శాసనసభ నిబంధనలు, ఆడియో, వీడియో డిస్‌ప్లే వంటివాటిని సామాన్య ప్రజలు ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కాంగ్రెస్‌కి అవినాభావ సంబంధముందని, అత్యంత కీలకమైన అంశంలో పార్టీని దోషిగా నిలబెట్టేలా సాగిన ప్రసంగం వల్ల దీర్ఘ కాలంలో పార్టీకి నష్టం కాదా అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. తెలంగాణ వద్దని సంతకాలు పెట్టిన సీపీఎం, మజ్లిస్ వంటి పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వినిపించాయని మరొక సభ్యుడు వాపోయారు. సభలో పాల్గొని చర్చకు పెట్టి, సాగు నీటి రంగంలో కాంగ్రెస్ చేసిందేమిటో, సీఎం కేసీఆర్ మార్చిన డిజైన్ వల్ల నష్టం ఏమిటో వివరించి ఉంటే బాగుండేదన్నారు.
భవిష్యత్తులో ఇదే లాభం...
కేసీఆర్ ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని కొందరు సీనియరు సభ్యులు వాదిస్తున్నారు. ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప నిర్దిష్టంగా ఏ కార్యక్రమాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయిందంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, జల విధానంలో లోపాల వల్ల ఆచరణలో చాలా సమస్యలు వస్తాయంటున్నారు. శాసనసభలో మాట్లాడిన కేసీఆర్ మాటలు అమలుచేయించేలా, లోపాలపై నిర్దిష్టంగా ఎత్తిచూపే విధంగా భవిష్యత్తులో మాట్లాడే అవకాశం వచ్చిందనేది సీనియర్ల అభిప్రాయం. ఒకవేళ సభకు హాజరైనా అధికార పక్షం మినహా ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కి ఉండేది కాదని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు. హాజరై ఉంటే కేసీఆర్ ప్రసంగానికి ఆమోదం తెలిపినట్టు అయ్యేదని మరో సభ్యుడు అంటున్నారు. హాజరు కాకపోవడం వల్ల నిర్మాణాత్మక విమర్శలకు అవకాశం సజీవంగా ఉంటుందంటున్నారు.