‘మహా’ ఒప్పందం రద్దు చేయాలి
జలసౌధ వద్ద టీడీపీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని టీటీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ‘చలో జలసౌధ’కు పిలుపునిచ్చింది. ఈ ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని, వీటి వల్ల ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని ఆరోపిం చింది. ఎన్టీఆర్ భవన్ నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరి జలసౌధ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మహారాష్ర్టతో ఒప్పందం బూటకమని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రమణ అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. దేవేందర్‌గౌడ్ నేతృత్వంలో చేపట్టిన పాదయాత్ర వల్లే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. ధర్నాలో రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్ బాబు, బండ్రు శోభారాణి, సీతక్క, నన్నూరి నర్సిరెడ్డి, తూళ్ల వీరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.