పీఎం, సీఎంలవి అవాస్తవాలు: పొన్నాల
విద్యుత్ అమరులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: నాటి విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసినవారికి ఆదివారం బషీర్‌బాగ్‌లోని అమరుల స్మారక స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యుత్‌చార్జీల విషయమై ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌లు ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ నెల 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ యూనిట్ రూ.1.10 కే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ప్రకటించారని, అదే నిజమైతే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో యూనిట్‌కు రూ.6 ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బొగ్గు దొరకని యాదాద్రిలో థర్మల్ విద్యుత్‌ప్లాంట్ పెట్టి ఉత్పత్తి ధరను పెంచే ప్రయత్నం వెనుక ఆంతర్యమేమిటన్నారు. శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో డీపీఆర్‌లను తయారు చేయకుండానే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్‌లను ఎలా కడుతోం దని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించి డీపీఆర్‌లను తయారు చేయలేదని చెప్పి న మంత్రి హరీశ్‌రావును అభినందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవి మాట్లాడుతూ ఎవరు జైలుకు వెళ్లాలో 2019లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.