భూసేకరణ సవరణ బిల్లును ఆమోదించొద్దు
రాష్ట్రపతికి పీసీసీ బృందం విజ్ఞప్తి
- శాసనసభ బలవంతంగా బిల్లును ఆమోదించింది
- ఈ చట్టం వల్ల రైతులు, కూలీలు ఉపాధి కోల్పోతారని ఆందోళన
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్టం–2013కు తూట్లుపొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణను ఆమోదించొద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీపీసీసీ బృందం విజ్ఞప్తి చేసింది. భూసేకరణ చట్టానికి సవరణ అని ప్రభుత్వం తొలుత చెప్పిందని...కానీ ఆ తర్వాత ఇది ప్రత్యేక చట్టం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారని రాష్ట్రపతికి వివరించింది. ఈ గందరగోళం మధ్య బిల్లును ప్రభుత్వం ఆమోదించుకుందని పేర్కొంది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతిని శుక్రవారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 40 మంది కాంగ్రెస్ నేతలు కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
భూసేకరణ చట్టానికి చేసిన సవరణను అమలు చేస్తే చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు ఉపాధి కోల్పోతారని, కులవృత్తులు దెబ్బతింటాయని, వారి పునరావాసానికి ప్రభుత్వం బాధ్యత వహించదని చెప్పారు. శాసనసభ బలవంతంగా ఆమోదించిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపితే నిర్వాసితులను పట్టించుకోకుండానే బలవంతంగా భూసేకరణ జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణ వల్ల జరిగే సామాజిక ప్రభావ మదింపును సవరణ చట్టంలో పూర్తిగా తొలగించారని, భూసేకరణ దేనికోసమో చెప్పాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతికి వివరించారు.
అలాగే ప్రైవేటు కంపెనీల కోసం ప్రభుత్వం భూసేకరణ జరిపితే 80 శాతం మంది రైతుల ఆమోదం అవసరమని పాత చట్టంలో ఉందని, కానీ సవరించిన చట్టంలో రైతుల ఆమోదం లేకుండానే భూసేకరణ జరిపే ప్రమాదముందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టంలో సూచించిన దానికన్నా పరిహారం మెరుగ్గా ఉంటేనే సవరణ బిల్లును ఆమోదించాలని టీపీసీసీ నేతలు విజ్ఞప్తి చేశారు. భూముల రిజిస్ట్రేషన్ ధరలను సవరించకుండా గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ ధరను మాత్రమే అంచనా వేస్తే రైతులకు జరిగే ప్రయోజనమేమీ ఉండదన్నారు. రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా భూసేకరణ జరుపుతు న్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి సామాన్యులపై ఒత్తిడి తెచ్చి భూసేకరణ జరుపుతోందని ఆరోపించారు. దేశ రాజ్యాంగ రక్షకుడిగా చట్ట సవరణకు ఆమోదం వల్ల జరిగే నష్టాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని రాష్ట్రపతి సానుకూలంగా విన్నారని వెల్లడించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.
రెండు రాష్ట్రాలు మినహా దేశమంతా పాత చట్టమే: ఉత్తమ్
గుజరాత్, తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాల్లో 2013 భూసేకరణ చట్టమే అమల్లో ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు లేని సమస్య ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలన్నారు. దేశంలోని 7,8 రాష్ట్రాల్లో కొత్త చట్టం తెచ్చినట్లుగా శాసనసభలో కేసీఆర్ అబద్ధం చెప్పారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పునరావాసం, నిర్వాసితుల గురించి చర్చించకుండా భూసేకరణ చేపట్టడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.