Redesigned
-
రీడిజైన్ తో శబరిని కోల్పోయాం: భట్టి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఇందిరాసాగర్ రీ డిజైన్ పేరుతో రాష్ట్రం శబరి నదిని, ఈ నది ద్వారా వచ్చే 400 టీఎంసీల నీటిని శాశ్వతంగా కోల్పోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావుతో కలసి లాంచీలో పోలవరం ముంపులో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వేలేరుపాడు మండలం రుద్రమకోటలో పర్యటించారు. అక్కడ గోదావరి, శబరి నదుల సంగమం వద్ద ఇందిరాసాగర్ ప్రాజెక్టు హెడ్‌వర్క్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వద్ద పంప్‌హౌస్, అశ్వారావుపేట మండలం ఆసుపాక వద్ద పంప్‌హౌస్, పథకం నిర్వహణ కోసం ఏర్పాటవుతున్న 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను చూశారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఇప్పటికే తెలంగాణ సీలేరు హైడల్ ప్రాజెక్టును కోల్పోయిందన్నారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం కూడా అటవీశాఖకు భూమి అప్పగింత, కొంతమేర పైప్‌లైన్ నిర్మాణం చేయడం, పంపులను అమర్చడమేనని తెలిపారు. -
గైర్హాజరీ వల్ల లాభమా.. నష్టమా?
సభలో సీఎం ప్రజెంటేషన్‌కు డుమ్మాపై కాంగ్రెస్ అంతర్గత మథనం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, ప్రభుత్వ జల విధానంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. బడ్జెట్ సమావేశాల చివరిరోజునాడు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ బహిష్కరించింది. శాసనసభలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, చర్చకు అవకాశం లేకుండా సీఎం ఏకపక్షంగా చెప్పుకుంటూ పోతే సాధారణ ప్రేక్షకునిగా ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నించింది. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం సభ్యులందరికీ ఇవ్వాలనీ, సభలో కాకుండా మరెక్కడైనా నిర్వహించాలని స్పీకర్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. అయితే ఈ ప్రతిపాదనలు, అభ్యంతరాలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితి, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అనుసరించిన విధానం, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్మించిన బ్యారేజీలు, వాటివల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం, ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైను మినహా ప్రత్యామ్నాయం లేదనే విధంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్‌పై పదునైన విమర్శలూ చేశారు. ఈ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ సీనియర్ సభ్యుల్లో పార్టీ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభలో పార్టీ వాదన సమర్థవంతంగా వినిపించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతుంటే, హాజరైతే టీఆర్ఎస్ను భవిష్యత్తులో ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామని మరికొందరు వాదిస్తున్నారు. పార్టీ వాదన లేకుండా పోయింది... సీఎం శాసనసభలో ఇచ్చిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నా, దోషిగా నిలబెట్టినా... సభకు హాజరు కాకపోవడం వల్ల వాటిని తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయిందని ఓ సీనియర్ సభ్యుడు వ్యాఖ్యానించారు. శాసనసభ నిబంధనలు, ఆడియో, వీడియో డిస్ప్లే వంటివాటిని సామాన్య ప్రజలు ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కాంగ్రెస్‌కి అవినాభావ సంబంధముందని, అత్యంత కీలకమైన అంశంలో పార్టీని దోషిగా నిలబెట్టేలా సాగిన ప్రసంగం వల్ల దీర్ఘ కాలంలో పార్టీకి నష్టం కాదా అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. తెలంగాణ వద్దని సంతకాలు పెట్టిన సీపీఎం, మజ్లిస్ వంటి పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వినిపించాయని మరొక సభ్యుడు వాపోయారు. సభలో పాల్గొని చర్చకు పెట్టి, సాగు నీటి రంగంలో కాంగ్రెస్ చేసిందేమిటో, సీఎం కేసీఆర్ మార్చిన డిజైన్ వల్ల నష్టం ఏమిటో వివరించి ఉంటే బాగుండేదన్నారు. భవిష్యత్తులో ఇదే లాభం... కేసీఆర్ ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని కొందరు సీనియరు సభ్యులు వాదిస్తున్నారు. ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప నిర్దిష్టంగా ఏ కార్యక్రమాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయిందంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, జల విధానంలో లోపాల వల్ల ఆచరణలో చాలా సమస్యలు వస్తాయంటున్నారు. శాసనసభలో మాట్లాడిన కేసీఆర్ మాటలు అమలుచేయించేలా, లోపాలపై నిర్దిష్టంగా ఎత్తిచూపే విధంగా భవిష్యత్తులో మాట్లాడే అవకాశం వచ్చిందనేది సీనియర్ల అభిప్రాయం. ఒకవేళ సభకు హాజరైనా అధికార పక్షం మినహా ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కి ఉండేది కాదని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు. హాజరై ఉంటే కేసీఆర్ ప్రసంగానికి ఆమోదం తెలిపినట్టు అయ్యేదని మరో సభ్యుడు అంటున్నారు. హాజరు కాకపోవడం వల్ల నిర్మాణాత్మక విమర్శలకు అవకాశం సజీవంగా ఉంటుందంటున్నారు. -
సాగర్ ఆధునికీక‘రణం’
చీమకుర్తి: సాగర్ ఆధునికీకరణ పనుల్లో అంతులేని జాప్యం చోటుచేసుకుంటోంది. కాలపరిమితి పూర్తికావస్తున్నా అన్నీ సగం సగం పనులే తప్ప పూర్తయినవి లేకపోవడం రైతులను ఆందోళనలకు గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ...చీమకుర్తి ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఏడు ప్యాకేజీల్లో రూ. 94.18 కోట్లు విలువచేసే ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. వాటిలో ఓబీసీ కాలువతో పాటు ఆరు డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సంబంధించిన మేజర్లున్నాయి. రూ.15.72 కోట్లతో ఓబీసీ, 18.8 కోట్లతో దర్శి పరిధిలోని వీరాయపాలెం మేజరు, రూ.17 కోట్లతో కరవది మేజరు, రూ. 8.91 కోట్లతో కారుమంచి మేజరు, రూ. 8.56 కోట్లతో ఈతముక్కల,చిలకపాడు మేజరు, రూ. 10.05 కోట్లుతో అల్లూరు, ఈతముక్కల మేజరు, రూ. 15.14 కోట్లతో కొప్పోలు, త్రోవగుంట మేజర్లుపై ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఆయా పనులు చేసేందుకు వాటికి గరిష్టంగా 39 నెలలు కాలం ఉంది. ఇప్పటికే 33 నెలలు పూర్తయింది. కాలువ కట్టలను బలోపేతం చేయడం, లైనింగ్‌లు ఏర్పాటు చేయటం, ఆఫ్‌టేక్‌లు రిపేర్లు, షట్టర్లు మరమ్మతులు వంటి ఆధునికీకరణ పనులు చేయాల్సిఉంది. గత 33 నెలల కాలంలో ఇప్పటి వరకు 75వ ప్యాకేజీలో 43వ డిస్ట్రిబ్యూటరీకి చెందిన వీరాయపాలెం మేజరుపై రూ. 18.8 కోట్లకుగాను కేవలం రూ.8.1 కోట్లు విలువ చేసే పనులు మాత్రమే జరిగాయి. ఇంకా రూ.10.69 కోట్లు విలువ చేసే పనులను రానున్న ఆరు నెలల్లో చేయాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు కేవలం 43 శాతం పనులు మాత్రమే జరిగాయి. 78వ ప్యాకేజీ, 46వ డీసీ ఈతముక్కల, చిలకపాడు మేజరుపై రూ.8.56 కోట్లకుగాను కేవలం రూ. 3.19 కోట్లతో 37.2 శాతం పనులు మాత్రమే జరగటం గమనార్హం. 79వ ప్యాకేజీ, 47వ డీసీ అల్లూరు-ఈతముక్కల మేజరుపై రూ.10.05 కోట్లకిగాను కేవలం రూ. 3.03 కోట్లు విలువచేసే పనులతో 30 శాతంతో అట్టడుగు స్థాయిలో ఉంది. 80వ ప్యాకేజీలో 48వ డీసీ కొప్పోలు-త్రోవగుంట మేజరుపై రూ.15.14 కోట్లకిగాను రూ.6.8 కోట్లతో 45 శాతం పనులు మాత్రమే జరిగాయి. 76వ ప్యాకేజీలో 44 డీసీ కరవది మేజరులో రూ. 17 కోట్లకుగాను 16.52 కోట్లు విలువచేసే పనులు పూర్తయి కాస్త మెరుగుగా ఉంది. 77వ ప్యాకేజీ, 45వ డీసీ కారుమంచి మేజరులో రూ. 8.91 కోట్లకిగాను రూ.7.6 కోట్లు పనులుతో 85 శాతం జరిగాయి. 24వ ప్యాకేజీ ఓబీసీపై రూ. 15.72 కోట్లకిగాను రూ. 12.77 కోట్లతో 81.22 శాతం పనులు జరిగాయని ఇరిగేషన్ శాఖ కార్యాలయం గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. మిగిలిన పనులు చేసేందుకు 2015 జూన్ వరకు మాత్రమే గడువు ఉండటంతో 33 నెలల్లో సగం పనులు కూడా చేయని మేజర్లుపై కాంట్రాక్టర్లు మిగిలిన 6 నెలల్లో దాదాపు సగానికిపైగా ఉన్న పనులు పూర్తి చేయడం సాధ్యమేనా? అంటూ రైతులు ఆందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం సాగర్‌నీరు విడుదల చేసిన నేపధ్యంలో పనులు ఇప్పుడు చేయడం వీలుకాదు. అవి నిలిచిపోవడానికి కనీసం మరో మూడు నెలలు అంటే మార్చి నెలాఖరు పడుతుంది. ఇక మార్చి తర్వాత పనులు చేసేందుకు కేవలం మూడు నెలల గడువు మాత్రమే ఉంటుంది. అప్పటికి 90 శాతం పనులు పూర్తయిఉంటే మిగిలిన పది శాతం చేయడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా మిగిలిన సగం పనులు ఆ కొద్ది వ్యవధిలో ఎలా సాధ్యమవుతుందని స్ధానిక రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి పూర్తికాకపోవడంతో శివారు ప్రాంతాల్లోని భూములకు జలాలను తీసుకుపోవడంలో రైతులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని ఈ ప్రాంత రైతన్నలు కోరుతున్నారు.