చీమకుర్తి: సాగర్ ఆధునికీకరణ పనుల్లో అంతులేని జాప్యం చోటుచేసుకుంటోంది. కాలపరిమితి పూర్తికావస్తున్నా అన్నీ సగం సగం పనులే తప్ప పూర్తయినవి లేకపోవడం రైతులను ఆందోళనలకు గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ...చీమకుర్తి ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఏడు ప్యాకేజీల్లో రూ. 94.18 కోట్లు విలువచేసే ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. వాటిలో ఓబీసీ కాలువతో పాటు ఆరు డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సంబంధించిన మేజర్లున్నాయి.
రూ.15.72 కోట్లతో ఓబీసీ, 18.8 కోట్లతో దర్శి పరిధిలోని వీరాయపాలెం మేజరు, రూ.17 కోట్లతో కరవది మేజరు, రూ. 8.91 కోట్లతో కారుమంచి మేజరు, రూ. 8.56 కోట్లతో ఈతముక్కల,చిలకపాడు మేజరు, రూ. 10.05 కోట్లుతో అల్లూరు, ఈతముక్కల మేజరు, రూ. 15.14 కోట్లతో కొప్పోలు, త్రోవగుంట మేజర్లుపై ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఆయా పనులు చేసేందుకు వాటికి గరిష్టంగా 39 నెలలు కాలం ఉంది. ఇప్పటికే 33 నెలలు పూర్తయింది. కాలువ కట్టలను బలోపేతం చేయడం, లైనింగ్‌లు ఏర్పాటు చేయటం, ఆఫ్‌టేక్‌లు రిపేర్లు, షట్టర్‌లు మరమ్మతులు వంటి ఆధునికీకరణ పనులు చేయాల్సిఉంది.
గత 33 నెలల కాలంలో ఇప్పటి వరకు 75వ ప్యాకేజీలో 43వ డిస్ట్రిబ్యూటరీకి చెందిన వీరాయపాలెం మేజరుపై రూ. 18.8 కోట్లకుగాను కేవలం రూ.8.1 కోట్లు విలువ చేసే పనులు మాత్రమే జరిగాయి. ఇంకా రూ.10.69 కోట్లు విలువ చేసే పనులను రానున్న ఆరు నెలల్లో చేయాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు కేవలం 43 శాతం పనులు మాత్రమే జరిగాయి. 78వ ప్యాకేజీ, 46వ డీసీ ఈతముక్కల, చిలకపాడు మేజరుపై రూ.8.56 కోట్లకుగాను కేవలం రూ. 3.19 కోట్లతో 37.2 శాతం పనులు మాత్రమే జరగటం గమనార్హం.
79వ ప్యాకేజీ, 47వ డీసీ అల్లూరు-ఈతముక్కల మేజరుపై రూ.10.05 కోట్లకిగాను కేవలం రూ. 3.03 కోట్లు విలువచేసే పనులతో 30 శాతంతో అట్టడుగు స్థాయిలో ఉంది. 80వ ప్యాకేజీలో 48వ డీసీ కొప్పోలు-త్రోవగుంట మేజరుపై రూ.15.14 కోట్లకిగాను రూ.6.8 కోట్లతో 45 శాతం పనులు మాత్రమే జరిగాయి. 76వ ప్యాకేజీలో 44 డీసీ కరవది మేజరులో రూ. 17 కోట్లకుగాను 16.52 కోట్లు విలువచేసే పనులు పూర్తయి కాస్త మెరుగుగా ఉంది. 77వ ప్యాకేజీ, 45వ డీసీ కారుమంచి మేజరులో రూ. 8.91 కోట్లకిగాను రూ.7.6 కోట్లు పనులుతో 85 శాతం జరిగాయి.
24వ ప్యాకేజీ ఓబీసీపై రూ. 15.72 కోట్లకిగాను రూ. 12.77 కోట్లతో 81.22 శాతం పనులు జరిగాయని ఇరిగేషన్ శాఖ కార్యాలయం గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. మిగిలిన పనులు చేసేందుకు 2015 జూన్ వరకు మాత్రమే గడువు ఉండటంతో 33 నెలల్లో సగం పనులు కూడా చేయని మేజర్లుపై కాంట్రాక్టర్లు మిగిలిన 6 నెలల్లో దాదాపు సగానికిపైగా ఉన్న పనులు పూర్తి చేయడం సాధ్యమేనా? అంటూ రైతులు ఆందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం సాగర్‌నీరు విడుదల చేసిన నేపధ్యంలో పనులు ఇప్పుడు చేయడం వీలుకాదు.
అవి నిలిచిపోవడానికి కనీసం మరో మూడు నెలలు అంటే మార్చి నెలాఖరు పడుతుంది. ఇక మార్చి తర్వాత పనులు చేసేందుకు కేవలం మూడు నెలల గడువు మాత్రమే ఉంటుంది. అప్పటికి 90 శాతం పనులు పూర్తయిఉంటే మిగిలిన పది శాతం చేయడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా మిగిలిన సగం పనులు ఆ కొద్ది వ్యవధిలో ఎలా సాధ్యమవుతుందని స్ధానిక రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి పూర్తికాకపోవడంతో శివారు ప్రాంతాల్లోని భూములకు జలాలను తీసుకుపోవడంలో రైతులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని ఈ ప్రాంత రైతన్నలు కోరుతున్నారు.
సాగర్ ఆధునికీక‘రణం’
Published Fri, Jan 2 2015 2:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement