ఏ తరహా పరిశ్రమలు నిర్మిస్తారో చెప్పండి
భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.
మాజీ మంత్రి వడ్డే
మచిలీపట్నం :
భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. మచిలీపట్నంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉన్న సమయంలోనే మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో భూసమీకరణను ప్రభుత్వం తెరపైకి తేవడం రైతులను మోసగించడమేనన్నారు. భూసమీకరణను తెరపైకి తెచ్చి కొందరు మంత్రులు తమ అనుచరులతో మచిలీపట్నంలో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించడం రైతాంగ వ్యతిరేఖ చర్యేనన్నారు.
రైతులను ముంచి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనమా?..
సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు తీసుకుని బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగిస్తారా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్ పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు.. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులను సైతం అభివృద్ధి చేయలేకపోయారన్నారు. ప్రభుత్వంపై రైతులు చేసే పోరాటానికి అండగా ఉంటానని చెప్పారు. పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న భూదందాపై ముద్రించిన కరపత్రాలను అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు అందజేసి వారిని చైతన్యవంతం చేస్తామన్నారు.