పోలవరం : ప్రభుత్వ నిబంధనలు, అధికారుల నిర్లక్ష్యం పోలవరం ముంపు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారాయి. పోలవరం పునరావాస చట్టంలో లేని కొన్ని నిబంధనలను ఓ ఉన్నతాధికారి అమలు చేయడం, దీనికి ప్రభుత్వం వత్తాసు పలకడంతో ముంపు గ్రామాల్లో యువతుల వివాహాలు నిలిచిపోయాయి. ఏడాదిగా ముంపు గ్రామాల్లో పెళ్లిబాజాలు మోగడం లేదు. ఎప్పటివరకు ఈ పరిస్థితి ఉంటుందో తెలియక, యువతుల వివాహ వయస్సు దాటిపోతుండటంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తీరుపై సర్వత్రా ఆందోళన
ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలోని 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 89 గ్రామాలు, వేలేరుపాడు మండలంలోని 60 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ అమలు చేసేందుకు పోలవరం మండలంలోని ముంపు గ్రామాల్లో అధికారులు 2017 జూన్ 30వ తేదీని కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. గతంలో చేసిన సోషియో ఎకనమిక్ సర్వే(ఎస్‌ఈఎస్ డేటా)లో పేర్లు ఉన్నప్పటికీ, కట్ ఆఫ్ డేట్ నాటికి 18 ఏళ్లు నిండిన, వివాహం కాని యువతులకు మాత్రమే పునరావాస ప్యాకేజ్ అందిస్తామని అధికారులు గ్రామసభలో వెల్లడించారు. ముందుగా డేటాలో పేరు ఉంటే వివాహమైనా ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన అధికారులు గ్రామసభలో మాట మర్చారు. వివాహమైనా ప్యాకేజ్ వస్తుందని ముందు చెప్పడంతో అప్పట్లో యువతుల వివాహాలు చేశారు. ఆతరువాత మాటమార్చిన అధికారులు డేటాలో ఉన్న వివాహమైన దాదాపు 500 మంది యువతుల పేర్లను తొలగించారు. వివాహమైతే ప్యాకేజీ రాదన్న నిబంధనతో దాదాపు 450 మంది యువతుల వివాహాలు ఏడాదిగా నిలిచిపోయాయి.
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
ఇదిలా ఉంటే ఎప్పుడు గ్రామాలు ఖాళీ చేయిస్తారో, ఎప్పుడు ప్యాకేజ్ అమలు చేస్తారో తెలియక, ప్యాకేజ్ వదులుకుని వివాహాలు చేయలేక యువతుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 2016 జూన్‌లో సోషియో ఎకనమిక్ సర్వే చేశారు. అప్పటికి 18 ఏళ్లు నిండిన యువతులకు మాత్రమే ప్యాకేజ్ ఇస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటికే వివాహమైన వారికి గాని, కట్ ఆఫ్ డేట్ తరువాత 18 ఏళ్లు నిండిన వారికి గాని ప్యాకేజ్ వర్తించదని స్పష్టం చేశారు. ఈవిధంగా దాదాపు 2 వేల మంది యువతులకు ప్యాకేజీ వర్తించే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేయకుండా, గ్రామాలు ఖాళీ చేయించకుండా కట్ ఆఫ్ డేట్ నిర్ణయించటంపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయోమయంలో ఉన్నాం
నాకు ఇద్దరమ్మాయిలు. పెద్ద అమ్మాయి వయసు 24 ఏళ్లు. వివాహం అయితే పునరా వాస ప్యాకేజ్ రాదని చెప్పడంతో చేయలేదు. ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారో, వివాహం ఎప్పుడు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాం.
– జలగం కన్నయ్య, తల్లవరం
నాకు ముగ్గురు కుమార్తెలు
నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త లేరు. పెద్దమ్మాయి వయస్సు 25 ఏళ్లు. వివాహమైతే ప్యాకేజ్ రాదని చెప్పారు. దీంతో ఇంకా వివాహం చేయలేదు. ఎప్పుడు ప్యాకేజ్ ఇస్తారో తెలియడం లేదు.
– మాడే అక్కమ్మ, తల్లవరం
పేరు తొలగించారు
నాకు ఇద్దరు అమ్మాయిలు. గతంలో చేసిన డేటాలో పేరు ఉందని పెద్దమ్మాయి వివాహం చేశాను. ఇప్పుడు డేటా నుంచి పేరు తొలగించి ప్యాకేజీ రాదని చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం.
– మడకం సింగారమ్మ, ములగలగూడెం
వివాహం ఆపేశాం
నాకు ఒక అమ్మాయి. వయస్సు 20 ఏళ్లు. పెళ్లి సంబంధం కుదిరింది. వివా హమైతే ప్యాకేజ్ ఇవ్వనంటున్నారు. దాంతో వివాహం ఆపేశాం. ప్యాకేజ్ వస్తుందని లాంఛనాలు కూడా ఎక్కువ అడుగుతున్నారు.
– మడకం నాగమణి, గాజులగొంది
Comments
Please login to add a commentAdd a comment