
రీడిజైన్ తో శబరిని కోల్పోయాం: భట్టి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఇందిరాసాగర్ రీ డిజైన్ పేరుతో రాష్ట్రం శబరి నదిని, ఈ నది ద్వారా వచ్చే 400 టీఎంసీల నీటిని శాశ్వతంగా కోల్పోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావుతో కలసి లాంచీలో పోలవరం ముంపులో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వేలేరుపాడు మండలం రుద్రమకోటలో పర్యటించారు.
అక్కడ గోదావరి, శబరి నదుల సంగమం వద్ద ఇందిరాసాగర్ ప్రాజెక్టు హెడ్‌వర్క్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వద్ద పంప్‌హౌస్, అశ్వారావుపేట మండలం ఆసుపాక వద్ద పంప్‌హౌస్, పథకం నిర్వహణ కోసం ఏర్పాటవుతున్న 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను చూశారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఇప్పటికే తెలంగాణ సీలేరు హైడల్ ప్రాజెక్టును కోల్పోయిందన్నారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం కూడా అటవీశాఖకు భూమి అప్పగింత, కొంతమేర పైప్‌లైన్ నిర్మాణం చేయడం, పంపులను అమర్చడమేనని తెలిపారు.