దుమ్ముగూడేనికి కొత్త టెండర్లే!
రూ.7,967 కోట్ల తుది అంచనాతో ఆర్థిక శాఖకు ఫైలు
సాక్షి, హైదరాబాద్: సమీకృత ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను పాత కాంట్రాక్టర్లకు అప్పగించకుండా కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడేళ్ల కింద నిర్ణయించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)ల ప్రకారం మారిన డిజైన్లకు అనుగుణంగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అనాసక్తి చూపుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త టెండర్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ల కింద ఇప్పటివరకూ చేసిన పనులను అనుసంధానం చేస్తూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేలా దుమ్ముగూడెం తుది ప్రణాళిక ఖరారైన విషయం తెలిసిందే.
దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో గ్రావిటీ ద్వారా 46.30 కిలోమీటర్ల దూరం గల కోయగుట్ట పంపు హౌజ్ వరకు నీటిని తరలించి అక్కడినుంచి జగన్నాథపురంలో కట్టే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం చెరువు(రిజర్వాయర్) దాకా నీటిని తరలిస్తారు. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరు అందుతుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి 50 టీఎంసీల నీటిని తరలిస్తారు. పాల్వంచ మండలం కోయగుట్ట, ముల్కంపల్లి మండలం కమలాపురం, తోగ్గూడెం, టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామాల్లో నాలుగు పంపు హౌజ్‌లు, ఆరు లిఫ్టులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా, మొత్తం నిర్మాణానికి రూ.7,967 కోట్లతో తుది అంచనా వేశారు. ఈ అంచనాను ఆమోదానికి ఆర్థిక శాఖకు పంపారు. ఇదే సమయంలో పనులను ఎవరికి అప్పగించాలన్న అంశమై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
మొత్తంగా బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాల కోసం 2007-08లో నిర్ణయించిన స్టాండర్ట్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)తో పోలిస్తే ప్రస్తుత రేట్లు 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈపీసీ విధానంతో పాత కాంట్రాక్టులకు అప్పగించగా, ప్రస్తుతం ఆ విధానం లేదు. దీంతో పాటే డిజైన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలవడం సుముచితమనే అభిప్రాయం నీటి పారుదల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.