హంద్రీ–నీవా కోసం అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద చంద్రబాబు గతంలో ఎన్నికలప్పుడు జనాన్ని నమ్మించేందుకు వేసిన శిలాఫలకం
తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు
- ఎన్నికలప్పుడు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడమే ఆయన ఘనత
- సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డే
సాక్షి, అమరావతి: రాయలసీమను సస్యశ్యామలం చేసింది తానేనని, హంద్రీ–నీవాను పూర్తి చేసిందీ తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై సాగు నీటి రంగం నిపుణులు, రైతులు, రాజకీయ పార్టీల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన ప్రాజెక్టులకు ఇప్పుడు గేట్లు ఎత్తుతూ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత తనదేనంటుండటంపై టీడీపీ నేతలు సైతం నోరెళ్లబెడుతున్నారు.
వాస్తవానికి దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న డిమాండ్‌తో దివంగత సీఎం, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం 1985లో ఉద్యమాలు చేసింది. పాదయాత్ర నిర్వహించింది. ఆ ఫలితంగా అప్పటి సీఎం ఎన్.టి.రామారావు తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులను 1989 నుంచి 94 వరకు అప్పటి ప్రభుత్వం కొనసాగించింది. 1995లో ఎన్.టి.రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు.. సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేశారు.
ఎన్నికలప్పుడే బాబు శంకుస్థాపనలు
అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద హంద్రీ – నీవా సుజల స్రవంతి పనులకు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పనులు చేపట్ట్టకుండా అటకెక్కించారు. 1999 సాధారణ ఎన్నికలకు ముందు హంద్రీ – నీవా ప్రాజెక్టును కేవలం ఐదు టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి ప్రాజెక్టుగా మార్చి.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాలువపల్లి వద్ద రెండో సారి పునాదిరాయి వేశారు. జనం నమ్మరనే భావనతో పునాదిరాయి అటు వైపు.. ఇటు వైపు మూడు మీటర్ల మేర కాలువ తవ్వారు. ఎన్నికలు ముగియగానే ఆ ప్రాజెక్టునూ అటకెక్కించారు. గాలేరు – నగరి ప్రాజెక్టు పనులకు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలప్పుడు వామికొండ రిజర్వాయర్ వద్ద.. 1999 ఎన్నికల సమయంలో గండికోట రిజర్వాయర్ వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
శరవేగంగా పూర్తి చేసిన వైఎస్
వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హంద్రీ–నీవా, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పనులను పూర్తి చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే శ్రీశైలం నుంచి 40 టీఎంసీలను తరలించి 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు.. 33 లక్షల మందికి తాగునీళ్లు అందించేందుకు రూ.6,850 కోట్లతో హంద్రీ – నీవా తొలి దశను పూర్తి చేశారు. రెండో దశ పనుల్లో కూడా 50 శాతం పనులను పూర్తి చేశారు. అప్పట్లో ఎకరానికి నీళ్లందించేందుకు రూ.16,750 వృథాగా ఖర్చు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యతిరేకించడం గమనార్హం.
శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీల ను తరలించి ప్రస్తుత వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీళ్లందించడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తొలి దశ అంచనా వ్యయం రూ.2,155.45 కోట్లు. ఇందులో దాదాపు రూ.రెండు వేల కోట్ల విలువైన పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. రెండో దశ పనులనూ ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 19 టీఎంసీలను తరలించి శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ) కింద కర్నూలు జిల్లాలో 1.90 లక్షల ఎకరాలకు సాగు నీళ్లందించే పనులనూ చేపట్టి.. శరవేగంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించారు.
నాడు తీవ్రంగా వ్యతిరేకించిన బాబు
రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లందించడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పనులను ప్రారంభిస్తే.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వ్యతిరేకించారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సభాపతి కోడెల శివప్రసాదరావు తదితర టీడీపీ నాయకులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం గమనార్హం.