ఆశలపై నీళ్లు | Stark allocation to irrigation projects | Sakshi
Sakshi News home page

ఆశలపై నీళ్లు

Published Fri, Mar 13 2015 1:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

Stark allocation to irrigation projects

సాగునీటి ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు
అన్నదాతపై టీడీపీ ప్రభుత్వం వివక్ష
రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లా  ప్రాజెక్టులపై శీతకన్ను
 

విశాఖపట్నం : అంతన్న రు... ఇంతన్నారు...తీరా అన్నదాతను నట్టేట్లో ముంచేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మొండిచెయ్యి చూపించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్న సీఎం చంద్రబాబు అసలు విషయం వచ్చేసరికి ముఖం చాటేశారు. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  జలయజ్ఞం పనులకు తగిన నిధులు కేటాయించనే లేదు.  సాగునీటి ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని ఇతర రంగాలకు కూడా ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించ లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం అధికారులు తీవ్ర కసరత్తు చేసి పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోనే లేదు. దాదాపు సగానికిపైగా పూర్తయిన ప్రాజెక్టుల పూర్తిపై కూడా దృష్టిసారించనే లేదు. కొత్త ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. అధికారుల ప్రతిపాదనలు, ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి...

జిల్లా రైతులు పోరాడి సాధించుకున్న రైవాడ జలాశయంపట్ల ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2005లో అప్పటి సీఎం వై.ఎస్.  రూ.21.42కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. అందులో రూ.5.50కోట్లు వెచ్చించి 27శాతం పనులు పూర్తిచేశారు. కాగా తరువాత కాంట్రాక్టరు సక్రమంగా పనులు చేయకపోవడంతో కాంట్రాక్టు రద్దు చేశారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోనే లేదు. దాంతో 2013-14లో రూ.48కోట్లతో ప్రతిపాదనలు పంపితే కేవలం  రూ.15లక్షలు కేటాయించారు.  2014-15లో కూడా సీఎంచంద్రబాబు కేవలం రూ.15లక్షలతో సరిపెట్టారు. తాజాగా ప్రాజెక్టు పూర్తికి అధికారులు రూ.60కోట్లతో అంచనాలు పంపించారు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయిచింది... కేవలం రూ.52.50లక్షలు మాత్రమే. ఈ నిధులతో ప్రాజెక్టు కనీస పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది.

తెన్నేటి విశ్వనాథం జలాశయం( పెద్దేరు)పై  కూడా ప్రభుత్వం చిన్నచూపే చూసింది. దాదాపు 45వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపునకు ప్రభుత్వానికి చేతులు రాలేదు. 2005లో రూ.45.08కోట్లతో దివంగత సీఎం వై.ఎస్. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టి దాదాపు 75శాతం పనులు పూర్తిచేసింది.  25వేల ఎకరాకలు సాగునీరు అందించింది. మిగిలిన 25శాతం పనులు పూర్తయితే మరో 20వేల ఎకారాలకు సాగునీరు అందించవచ్చును. అందుకోసం నీటిపారుదల శాఖ అధికారులు ఈ బడ్జెట్ కేటాయింపుల కోసం రూ.8కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కేవలం రూ.11లక్షలు మాత్రమే కేటాయించడం విస్మయపరుస్తోంది.
     తాండవ జలాశయం విషయంలో ప్రభుత్వ తీరు అలాగే ఉంది. జలాశయం ఆధునీకరణకు 2005లో రూ.55కోట్లతో పనులు ప్రారంభించారు. 125 కి.మీ. కాలువ పనులు చేయాలని నిర్ణయించారు. అందులో  రూ.46కోట్లు వెచ్చించి 97కి.మీ. మేర పనులు పూర్తి చేశారు.  మిగిలిన 28కి.మీ.మేర పనుల కోసం అధికారులు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.9కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.1.50కోట్లు మాత్రమే విదిల్చింది.

కోనాం ప్రాజెక్టు కథ కూడా అంతే. దివంగత సీఎం వై.ఎస్. ఈ ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా 31కి.మీ. మేర లైనింగ్ పనుల కోసం రూ.11కోట్లతో పనులు చేపట్టారు. దాదాపు 28కి.మీమేర పనులు పూర్తిచేశారు. కానీ గత నాలుగేళ్లుగా మిగిలిన పనులు పెండింగులో ఉండిపోయాయి. మిగిలిన 3కి.మీ పనుల కోసం రూ.2కోట్లు కేటాయిస్తే చాలని ఉన్నతాధికారులు టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.11లక్షలు కేటాయించడంతో  అధికారవర్గాలు విస్తుపోయాయి.
     
ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం, స్టార్ట్‌ప్ విలేజ్‌లు...ఇలా గతంలో చెప్పిన అంశాలనే బడ్జెట్ ప్రసంగంలో మళ్లీ వల్లేవేశారు. కానీ కొత్తగా ఎలాంటి నిధులు కేటాయించనే లేదు.హుద్‌హుద్ బాధితులను ఆదుకోవడనికి కూడా ప్రభుత్వం సరైన ప్రాధాన్యమివ్వ లేదు. హుద్‌హుద్ వల్ల రూ.65వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే చెప్పిం ది. కానీ ఇంతవరకు రూ.716కోట్లే ఖర్చుచేసామని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించింది. రూ.4,448కోట్లు కావాలని కేంద్రాన్ని కోరితే కేవలం రూ.400కోట్లే ఇచ్చారని కూడా వెల్లడించింది. కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.2,700కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ఎక్కడ రూ.65వేల కోట్లు... ఎక్కడ రూ.2,700కోట్లు... అదీ రుణం వస్తేనే...! అంటే హుద్‌హుద్ బాధితులను ఆదుకోవడానికి ఇక నిధులు లేవని స్పష్టం చేసేసింది. ప్రపంచ బ్యాంక్‌నిధులు వస్తేనే కొంత చేయగలమని లేకపోతే అదీ లేదని తేల్చేసింది. ఇలా అన్నింటా జిల్లాకు అన్యాయం జరిగింది
 
విశాఖ నగరంలోని పరిశ్రమలకు నీరు అందించే ఏలేరు కాలువ పనులపై కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించలేదు. కాలువ లైనింగ్‌పనుల కోసం దాదాపు రూ.1.50 అవసరమని అధికారులు ప్రతిపాదించారు. కానీ కేవలం రూ.10లక్షలు కేటాయించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement