నారా వంచన | There's no mention in the budget | Sakshi
Sakshi News home page

నారా వంచన

Published Sat, Mar 12 2016 1:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

There's no mention in the budget

బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు
ఎన్నికల హామీని గాలికొదిలేశారు
అసెంబ్లీ సాక్షిగా.. అబద్ధాలు వల్లె వేశారు
పాలక పార్టీ తీరుతో హతాశులైన నిరుద్యోగులు

 
‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదవకపోయినా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి..’, ‘తమ్ముళ్లూ.. మీ కలలు సాకారం చేయబోతున్నా’ 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.2 వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలను నమ్మిన జిల్లాలోని దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.
 
విజయవాడ : ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇవ్వని పక్షంలో నెలకు రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతిగా అందజేస్తాం..’ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మాటలివి. అంతేకాదు.. ఊరూరా తిరిగి ప్రతి సభలోనూ ఈ అంశాన్ని ప్రచారం చేశారు. ‘జాబు రావాలంటే.. బాబు రావాల్సిందే..’ అంటూ టీడీపీ నాయకులు, శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు అప్పటి ఎన్నికల ప్రచారంలో ‘వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో పాదయాత్రలో నేను నిరుద్యోగుల కష్టాలు కళ్లారా చూశా. వారిని ఆదుకుంటా’ అని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగ భృతి అంశాన్నీ పక్కన పెట్టేశారు.

అసెంబ్లీలో నిస్సిగ్గుగా...
గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ నిలదీయగా, అసలు అలాంటి పథకమే లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని, లేదంటే నిరుద్యోగ భృతి అయినా ఇస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగులు టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హామీలు నమ్మి ఓట్లేశామని, అధికారంలోకొచ్చాక మాటమార్చేస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
 వయోపరిమితి పెంచారు..
 
నోటిఫికేషన్ మరిచారు..
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ చేసే నిమిత్తం నిరుద్యోగుల వయోపరిమితిని 38 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం 2014 సెప్టెంబరు 23న జీవో నంబరు 295ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2016 సెప్టెంబరు 30 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను క్రమపద్ధతిలో భర్తీ చేస్తారని ప్రకటించింది. ఈ జీవో విడుదలైనప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం జారీ చేయకపోవటం గమనార్హం. మరో ఆరు నెలల వ్యవధిలో ఈ జీవోకు కాలం చెల్లనుందని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు అంటున్నారు. గ్రూప్-1 నుంచి క్లాస్-4 ఉద్యోగాల వరకు భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయకపోవటంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
 
లక్షలాది మంది నిరుద్యోగులు

 జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 71,729 మంది తమ పేర్లను నిరుద్యోగులుగా నమోదు చేసుకున్నారు. వీరిలో పదో తరగతి చదివినవారు 12,227 మంది, ఇంటర్‌మీడియెట్ చదివినవారు 12,962 మంది, డిగ్రీ చదివినవారు 15,274 మంది, ఐటీఐ, డిప్లమో కోర్సులు చదివినవారు 30,103 మంది ఉన్నారు. ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోని నిరుద్యోగులు మూడు లక్షల మంది ఉంటారని అంచనా. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సులు చదివినవారు సైతం ఉపాధి అవకాశాలు లేక రోడ్ల వెంట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం నిరుద్యోగులను గాలికొదిలేసి తమ పబ్బం గడుపుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. పీజీ కోర్సులు చదివినవారు విశాఖపట్నంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కొంతకాలంగా ఈ ప్రక్రియ కూడా నిలిపివేశారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement