సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించకోవడం ద్వారా రెండు కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలాశయాలు, చెరువులతో పాటు భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని.. చెరువులు, భూగర్భ జలాలు ఇతర వనరులతో కలిపి మొత్తం 867 టీఎంసీలు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.
ఈ జలాలను వినియోగించుకుని రెండు కోట్ల ఎకరాలకు నీరు అందించడంపై లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 57.41 శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇప్పటి వరకూ లక్ష మంది సందర్శించారన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ ప్రాజెక్ట్ ఇంజినీర్లను ప్రశంసించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బచ్‌పన్ విద్యార్థులకు సీఎం అభినందనలు
గుంటూరులోని బచ్‌పన్ ప్లేస్కూల్ విద్యార్థులు గ్రీవెన్స్ భవనంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని ఇతర ప్లేస్కూళ్ల కంటే తమ స్కూల్ ముందువరుసలో ఉందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు సీఎంకు చెప్పారు. చిన్నప్పటినుంచే అన్ని విషయాల్లో బాలబాలికలకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు.
గ్రామ కంఠాల సమస్య పరిష్కరించాలి
గ్రామ కంఠాల సమస్యను పరిష్కరించకపోవడం వలన పిల్లలకు చదువులు, పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నామని, ఆర్థికంగా చితికిపోతున్నామని రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు అవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రీవెన్స్ భవన్‌కు వచ్చారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చి తమ బాధలను వెళ్లబోసుకున్నారు. రాజధాని నిర్మాణానికి తామంతా కోట్లాది రూపాయల ఖరీదు చేసే వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చామని, అయితే ప్రభుత్వం తమ సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని వాపోయారు. వారి నుంచి వినతి పత్రం స్వీకరించిన సీఎం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ.45,035 కోట్లు ఖర్చు: దేవినేని
రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులను రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ. 45,035 కోట్లు ఖర్చు చేశామని, రూ. 10,884 కోట్లు ఉపాధి హామీ, జలసంరక్షణ, చెక్ డ్యామ్‌లకు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫారెస్టు డిపార్టుమెంట్‌లో రూ. 139 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.
2 కోట్ల ఎకరాలకు నీళ్లందించాలి
Published Tue, Aug 14 2018 3:58 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment