సోది... అబద్ధాలు... ప్రచారయావ!
♦ చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్
♦ కమీషన్ల కోసమే పట్టిసీమ, పురుషోత్తపట్నం తాత్కాలిక ప్రాజెక్టులు
♦ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రచారంలో ఉన్న యావ పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లేదు. తక్షణమే మనుగడలోకి వచ్చే ప్రాజెక్టులను సైతం విస్మరిస్తున్నారు. అవకాశం ఉన్నా నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి. కమీషన్లు వచ్చే పనులు మినహా శాశ్వత ప్రయోజనం చేకూరే పనులకు ప్రాధాన్యత దక్కడం లేదు. ఏనాడో తుది దశకు వచ్చిన ప్రాజెక్టులను సైతం తానే చేపట్టినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సోది... అబద్ధాలు... దుర్మార్గమే కన్పిస్తోంది’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు.
ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని పైడిపాలెం ప్రాజెక్టును సందర్శించి, పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పైడిపాలెం ప్రాజెక్టుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.668 కోట్లు ఖర్చు పెట్టగా.. చంద్రబాబు మూడేళ్లలో రూ.24కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తయితే ఇప్పుడు లస్కర్‌లా గేట్లెత్తి మొత్తం తానే చేసినట్లు చెప్పుకున్నారని దుయ్య బట్టా రు.జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
మూడేళ్లుగా పూర్తికాని పెండింగ్ పనులు
పైడిపాలెం రిజర్వాయర్ సామర్థ్యం ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 0.67టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో 0.2 టీఎంసీ డెడ్‌స్టోరేజీ. దీంతో 0.5 టీఎంసీ లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. గాలేరి– నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భా గమైన గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన వరద కాలువ 80 శాతం పనులు పూర్తయ్యాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు 80% పూర్తయ్యాయి. మిగిలిన 20% పనులను చంద్రబాబు మూడేళ్లుగా పూర్తి చేయలేకపోయారు. దీంతో నీరు డ్రా చేసుకోలేని పరిస్థితి. గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేసి ఉంటే పైడిపాలెంకు ఆరు టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు, సర్వరాయసాగర్‌లో 3.2 టీఎంసీలు, వామికొండలో 1.6 టీఎంసీలు నిల్వ చేసి ఉండవచ్చు.
మైలవరం ప్రాజెక్టు సైతం స్థిరీకరించి ఉండవచ్చు. కానీ చంద్రబాబు మిగిలిపోయిన 20 శాతం పనులు పూర్తి చేయకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం చేసుకోవడం మినహా ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు. రాయలసీమ కోసమే పట్టిసీమ నిర్మించానని చంద్రబాబు డబ్బాలు కొడుతున్నారు. పట్టిసీమ నుంచి 45 టీఎంసీల నీరు తీసుకొచ్చామని చెబుతున్నారు. పట్టిసీమ నుంచి 45 టీఎంసీలు వస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి 55 టీఎంసీలు సముద్రంలో కలవడం కనిపించడం లేదా? పోలవరం పూర్తయి ఉంటే ఆ నీరు అందులో నిల్వ చేసుకునేవాళ్లం. కానీ పోలవరాన్ని కాదని కమీషన్ల కోసమే పట్టిసీమ కట్టారు. నీళ్లు లేక రాయలసీమ అంతా ఎండిపోతోంది. చంద్రబాబు కొందరు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే జీఓలు జారీ చేస్తున్నారు.
కమీషన్ల కోసమే...: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే నీరు నిల్వ ఉంటుందని తెలిసినా కమీషన్లకోసం చంద్రబాబు తాత్కాలిక ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తున్నారు. టెండరు మొత్తం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పట్టిసీమ , పురుషోత్తపట్నం ఎత్తిపోతలను కమీషన్ల కోసమే చేపట్టారు. దీనికి సీబీఐ విచారణ అవసరం లేదు... సింగిల్ పోలీసు విచారణ చేపట్టినా లంచాల కోసం ఏ విధంగా చంద్రబాబు వ్యవహరించారో తెలుస్తుంది.
రైతులకు ఉపయోగపడే పనులను చేస్తే హర్షిస్తాం... కమీషన్ల కోసం కక్కుర్తిపడే పనులను వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్న తీరును తప్పు పడుతున్నాం.
చంద్రన్న బీమా పచ్చి దగా
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన పేరుపై చంద్రన్న బీమా పథకం ప్రవేశ పెట్టారు. ఆ పథకం గురించి పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు పెట్టి భారీగా ప్రచారం చేశారు. కానీ ప్రయోజనం శూన్యం. చంద్రన్న బీమా పథకం పచ్చి మోసం... ప్రయోజనం శూన్యం. 40 రోజుల వుతున్నా బాధితులను ఆదుకోలేదు’’ అని జగన్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ బస్సు ఢీకొని తొండూరు మండలం కోరవానిపల్లెకు చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు, 150 గొర్రెలు చనిపోతే పరిహారం అందించలేదని చెప్పారు. ప్రమాదవశాత్తు ప్రభుత్వ సంపులో పడి మరణించిన ఇద్దరు మహిళలకూ చంద్రన్న బీమా వర్తింపచేయలేదని విమర్శించారు. గొర్రెల కాపరుల కుటుంబాలను శనివారం పరామర్శించిన జగన్ కోరవానిపల్లెలో మీడియాతో మాట్లాడారు.