సాగు ప్రాజెక్టులకన్నా వాటర్‌షెడ్లే మిన్న
- మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసంలో మాజీ ఈఎన్‌సీ హన్మంతరావు
- తక్కువ ఖర్చుతో అధిక లాభాలు
- నాలుగు నీటి సూత్రాలతో ఏటా మూడు పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులంటూ ప్రభుత్వాలు రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, వాటికి బదులుగా వాటర్‌షెడ్ల కార్యక్రమాన్ని విస్తృతపరిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయని నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ టి. హన్మంతరావు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వాలు ఆర్భాటాలు చేస్తూ వాటర్‌షెడ్ పథకాలపై శీతకన్ను ప్రదర్శిస్తున్నాయని, దీంతో రైతులకు సత్వర ఫలాలు అందడం లేదని హన్మంతరావు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో తాను రూపొందించిన 4 సూత్రాల ప్రణాళిక ప్రకా రం వాటర్‌షెడ్లు ఏర్పాటు చేసుకుంటే రైతులు ఏడాదిలో మూడు పంటలు పండించుకోవచ్చని, రెండు వరుస పంటలతోపాటు మరో మెట్ట పంటను సాగు చేసుకోవచ్చన్నారు.
మెదక్ జిల్లా గొట్టిగారి పల్లి ఇందుకు నిదర్శనమన్నారు. రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతాల్లోనూ ఇది విజయవంతమైందన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఏడాదిలో కేవలం ఒక పంటకే నీరు అందుతుందని, కానీ వాటర్‌షెడ్లతో ఏడాది కాలంలో నీరు పుష్కలంగా లభిస్తుందని వివరించారు. ఇందుకు ఎకరాకు రూ. 5 వేలు మాత్రమే ఖర్చు వస్తుందని, 550 మిల్లీమీటర్ల వర్షపాతమున్న అన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతి విజయం సాధిస్తుందన్నారు. నాలుగు సూత్రాల వాటర్‌షెడ్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టు కృషి చేస్తుందని ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.